Share News

AP Politics: అయ్యో.. ఉష.. మీరింకా మంత్రి కాదమ్మా..!

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:48 AM

‘నవ్విపోదురుగాక.. నాకేటి’ అన్నట్లుంది మాజీ మంత్రి. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ తీరు. వైసీపీ అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా. ఆమె ఇంకా మంత్రి అనే భ్రమల్లోనే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి చిన్న విషయానికీ, సొంత పార్టీ నాయకులదే తప్పు ఉన్నా..

AP Politics: అయ్యో.. ఉష.. మీరింకా మంత్రి కాదమ్మా..!
Ex Minister Usha Sri

హిందూపురం, అక్టోబర్ 25: ‘నవ్విపోదురుగాక.. నాకేటి’ అన్నట్లుంది మాజీ మంత్రి. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ తీరు. వైసీపీ అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా. ఆమె ఇంకా మంత్రి అనే భ్రమల్లోనే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి చిన్న విషయానికీ, సొంత పార్టీ నాయకులదే తప్పు ఉన్నా.. హడావుడి చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌లోనే రెచ్చిపోతున్నారు. పోలీసు అధికారులపై చిందులేస్తున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆదేశాలిస్తున్నారు. అవసరమైతే పోలీసులకే సెక్షన్లు చెబుతున్నారు. ఆమె తీరుపట్ల పోలీసులు, ప్రజలే కాదు. సొంత పార్టీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


అధికారం పోయినా..

‘ఉద్యోగులు మేం చెప్పింది చేయాలి. మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి. మేం దౌర్జన్యం చేసినా స్పందించకూడదు. మేం తిట్టినా పడుండాలి. కాదంటే దాడులకు దిగుతాం, దౌర్జన్యాలు చేస్తాం.’ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు ఇది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలవుతున్నా ఇప్పటికీ కొంతమంది వైసీపీ నాయకులు.. ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది వారి పార్టీ ఉనికి కోసమా.. గత ఐదేళ్లలో ప్రవర్తించిన తీరు మార్చుకోలేకపోతున్నారో అర్థంకాని పరిస్థితి. వైసీపీ నాయకులు గతంలో పోలీసులపైనే ఎదురుకేసులు పెట్టారు. పోలీసులను చూసి నేరగాళ్లు భయపడతారు. రాష్ట్రంలో గత వైసీపీ హయాంలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉండేవి. వైసీపీ నాయకుల అరాచకాలు చూసి పోలీసులే భయపడ్డారు. ఆ పార్టీ నాయకులు చేసిన వికృతచేష్టలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినా పోలీసులను ఆదే తీరులో చెదిరించేలా వైసీపీకి చెందిన జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వ్యవహరిస్తున్నారని పోలీసులే చెప్పుకోవడం గమనార్హం. ఆమె వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికైన అనంతరం ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా ఆమె అక్కడికి చేరుకుని, వాస్తవాలను పర్చనబెట్టి పోలీసులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తీరుపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


ఉష తీరుకు నిదర్శనాలు కొన్ని..

హిందూపురం పట్టణ పరిధిలోని కొల్లకుంటలో సెప్టెంబరు 10న వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపార్టీల వారికి గాయాలయ్యాయి. వైసీపీ నాయకులు చాకచక్యంగా టీడీపీ వారు దాడిచేసిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వైసీపీ నాయకులు దాడిచేసి, రెచ్చగొట్టిన వీడియోలు లేవు. ఆ మరుసటి రోజే.. ఉషశ్రీ హిందూపురానికి చేరుకుని, ఆస్పత్రిలో వైసీపీ నాయకులను పరామర్శించారు. అక్కడి నుంచి అంబేద్కర్ సర్కిల్ చేరుకుని హల్ చల్ చేశారు. కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పినా.. ఆమె వినకుండా దురుసుగా వ్యవహరించారు. తాను ఎవరినో తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి మాట్లాడారు. పోలీసులకే సెక్షన్లు చెప్పారు. దీంతో పోలీసులే ఒకింత అసహనానికి లోనయ్యారు.


ఇటీవల చిలముత్తూరు మండలంలో సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన ఆమె.. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కాసేపు హంగామా చేశారు. తమనే లోపలకు పంపరా అంటూ పోలీసులపై చిర్రు బుర్రు లాడారు. ఈ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు బాగాలేదంటూ పోలీసులే పెదవి విరిచారు.


ఆ సోమందేపల్లి మండలంలో వైసీపీకి చెందిన ఓ నాయకుడి విషయంలో పోలీసు స్టేషన్ వద్ద ఉషశ్రీ హంగామా చేశారు. ఒకానొకదశలో ఆమె ప్రతిపక్ష హోదా మరిచి తానే మంత్రినన్న రీతిలో పోలీసులకే ఆదేశాలు జారీచేశారు. కార్యకర్తలతో కలిసి కొద్దిసేపు అక్కడు గొడవ సృష్టించేందుకు యత్నించారు. పోలీసులు కూడా వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రయత్నాలను నిశితంగా పరిశీలించి అప్రమత్తమయ్యారు. తాజాగా గోరంట్ల మండలంలో ఓ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఉషశ్రీ వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. గ్రామానికి వెళ్లిన కానిస్టేబుల్ వాహన ప్లగ్ లాక్కుని, వైసీపీ నాయకుడు హంగామా సృష్టించాడు. అయినా అక్కడికి వెళ్లిన పోలీసులు సంయమనం పాటించారు. వైసీపీ నాయకులు తప్పు చేశారన్న విషయం మరచిపోయి స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐపై చిందులు తొక్కడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరికొన్ని సందర్బాల్లో కూడా పోలీసులపై ఇలాగే వ్యవహరించినట్లు సమాచారం.


తప్పుచేసినా వెనకేసుకొస్తున్న వైనం..

గత వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు కూడా తమదే అధికారం అన్న భ్రమల్లో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు తప్పుచేసినా నిస్సిగ్గుగా వెనకేసుకురావడం గమనార్హం. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల్లో వైసీపీ నాయకులదే తప్పు ఉన్నా, అదికార పార్టీపై బురద జల్లడం.. ప్రతిపక్ష తన ఉనికి చాటుకోవడం కోసమేనన్న ఆరోణలు వ్యక్తం అవుతున్నాయి. గత ఐదేళ్లలో నాయకులు ఎలా దౌర్జన్యం చేశారు. ప్రస్తుతం కూడా ఏం చేస్తున్నారని ఆలోచించకపోవడం దురదృష్టకరం.


నేటికీ మంత్రిననే ఫీలింగ్..

ఇటీవల ఉషశ్రీ జిల్లా అధ్యకురాలయ్యాక ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నాయకులే చర్చించుకునే పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల అనంతరం బెంగళూరుకు పయనమైన ఆమె జిల్లా అధ్యక్షురాలిగా నియమించాక అప్పుడుప్పుడు వస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నామని మరిచి మంత్రిలాగే అధికారులకు హుకుం జారీ చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా తప్పుచేసిన వారిని ఉషశ్రీ వెనకేసుకురావడంపై పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

కోహ్లీ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే

లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చింపేసిన పోస్ట్‌మ్యాన్..

బీరు తాగున్నావా.. ఇది చూడు ఓసారి.. షాక్ అయి షేక్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 25 , 2024 | 12:19 PM