Share News

Andhra Pradesh: బాధగా ఉంది.. పేర్ని నాని షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:23 PM

Perni Nani-PDS Rice Missing: రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంపై పేర్ని నాని మౌనం వీడారు. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మరి ఆయన ఏమన్నారో ఈ కథనంలో చూడండి..

Andhra Pradesh: బాధగా ఉంది.. పేర్ని నాని షాకింగ్ కామెంట్స్..
Perni Nani

అమరావతి, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ సోషల్ మీడియా సెల్ తమపై తప్పుడు రాతలు రాస్తోందని పేర్ని నాని ఆరోపించారు. బియ్యం మిస్సింగ్ స్కామ్‌లో ఇరుక్కు్న్న పేర్ని నాని కుటుంబం.. పరారీలో ఉందంటూ గత కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఈ వ్యవహారంపై స్పందించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమ గోడౌన్‌లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారని.. నైతిక బాధ్యత వహిస్తూ తన సతీమణి అధికారులకు ఒక లేఖ రాశారని గుర్తు చేశారు. టెక్నికల్‌గా తమ బాధ్యత లేకున్నా.. నైతికంగా బాధ్యత వహిస్తామని ఆ లేటర్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. అధికారులు తనిఖీలు చేసి 3,800 బస్తాలు తగ్గాయన్నారు. దాని తాలూకు వారి చెప్పినట్లుగా నగదు చెల్లించామని పేర్ని నాని వెల్లడించారు. అయినాసరే తమపై కక్ష కట్టి తన భార్య, గోడౌన్‌ ఇన్‌చార్జి మీద కేసు నమోదు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. పదే పదే పీపీలను మార్చుతూ అడ్డంకులు సృష్టించారన్నారు. తనపై కక్షతో తన భార్య మీద అక్రమ కేసు పెట్టారని నాని ఆరోపించారు. తాము పారిపోయినట్లు అసత్య ప్రచారాలు చేశారన్నారు.


నేనేంటో డీజీపీకి తెలుసు..

తాను ఏంటో డీజీపీకి బాగా తెలుసునని పేర్ని నాని అన్నారు. తాను మంత్రిగా పని చేసినప్పుడు ఆయన తన శాఖలోనే పని చేసినట్లు పేర్కొన్నారు. అప్పుడు ఏదైనా తప్పుడు పని చేయమని ఆదేశించానా? అని నాని ప్రశ్నించారు. తనను, తన కుమారుడిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. గోడౌన్ మేనేజర్‌ని అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా తన పేరు చేర్చడానికి ప్లాన్ చేశారన్నారు. గోడౌన్‌ తలుపులు పగులగొట్టి సరుకును తీసుకెళ్లారన్నారు. అందులోని సరుకు బాధ్యత మాది, సివిల్ సప్లై అధికారులది. కానీ, తమ ప్రమేయం లేకుండా సరుకును తరలించుకుపోయారు. తాను 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బందరులోనే ఉన్నానని పేర్ని నాని చెప్పారు. లాయర్ల సూచన మేరకు విలేకరుల సమావేశం పెట్టడం లేదన్నారు.


తన భార్య గురించి యూట్యూబ్‌లో కొంతమంది దారుణమైన వ్యాఖ్యలు చేశారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అడిగినట్లు డబ్బులు కట్టాక కూడా క్రిమినల్ కేసులు పెట్టారని విమర్శించారు. తన తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని.. తాము ఏ తప్పుడు పని చేయలేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే వాస్తవాలు కూడా బయటకు వస్తాయన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారంటూ విపక్షాలపై నాని మండిపడ్డారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏనాడూ తప్పుడు పని చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఇలాంటి తప్పుడు పని చేయరన్నారు.


3 శాతం లంచాలు తీసుకుని బిల్లులు తీసుకునేవారు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ విపక్ష నేతలపై మాజీ మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పని చేస్తూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు కూడా లంచాలు తీసుకున్న వారు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ గోడౌన్‌ మేనేజర్‌ని అరెస్ట్ చేయడానికి వారి మనుషుల్ని పోలీసులు కొడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. తనను, తన కుమారిడి అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. రాజకీయ కక్ష సాధించడానికి ఇంట్లోని మహిళల వరకు రావటం బాధ కలిగిస్తోందన్నారు. 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడటం లేదన్నారు. తనపై అధికార పార్టీ కక్ష కట్టిందన్నారు నాని.


Also Read

జనం కోసం మళ్లీ జైలుకు వెళ్తా

ఆ బిల్లులు విడుదల చేయాలి...

నితీష్‌కు ఊహించని ప్రైజ్‌మనీ

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Dec 28 , 2024 | 07:48 PM