Student Unions : మారని ఏయూ వీసీ తీరు!
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:20 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద రెడ్డి తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన ఆయన ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు.
చాంబర్‌లో ఇంకా సీఎం ఫొటో పెట్టని ప్రసాద రెడ్డి
విద్యార్థి సంఘాల ఆందోళన.. రాజీనామాకు డిమాండ్
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద రెడ్డి తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన ఆయన ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు. ప్రభుత్వం మారి దాదాపు మూడు వారాలు కావస్తున్నా తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటుచేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేయాల్సిందిగా కొద్దిరోజుల కిందట ఉత్తర్వులు వెలువడ్డాయి. అయినా ఏయూ వీసీ కార్యాలయంలో ఇప్పటివరకూ సీఎం ఫొటోను ఏర్పాటు చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు గురువారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.
ఏయూ వీసీ చాంబర్ ఎదుట టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలతో ఆందోళన నిర్వహించారు. వీసీ చాంబర్‌లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఏర్పాటు చేయడంతోపాటు వీసీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు. చాంబర్‌లో వీసీ లేరని, ఆయన వచ్చిన వెంటనే ఏర్పాటుచేయిస్తానని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ హామీ ఇవ్వడంతో ఆయనకు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఇచ్చి విద్యార్థి సంఘాల నాయకులు వెనుదిరిగారు. ఆందోళనలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ, జనసేన విద్యార్థి సంఘ నాయకులు మర్రివేముల శ్రీనివాస్, రతన్‌కాంత్, బోండా రవికుమార్, పీలా అవినాష్, డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.