Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే..?
ABN , Publish Date - Jun 01 , 2024 | 01:34 PM
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు. ఆదివారం నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావంతో ముందుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో శని, ఆది, సోమ మూడు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ జిల్లాల్లో వర్షం..
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉంది.
చల్లబడిన విశాఖ
విశాఖపట్టణంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన జనం వాతావరణం చల్ల బడటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చారు. విజయనగరంలో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. కాకినాడలో ఈదురు గాలులు వీచాయి. పిడుగులు వేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.