Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం
ABN , Publish Date - Jun 30 , 2024 | 03:43 AM
టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకొన్నారు.
తోపులాటలో చిక్కుకొన్న చంద్రబాబు
వినతుల స్వీకరణకు త్వరలో ప్రత్యేక ఏర్పాటు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకొన్నారు. ఆయన ప్రతి శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి సందర్శకులను, పార్టీ నాయకులను కలుస్తున్నారు. కొత్త ప్రభుత్వం కావడంతో ఆయన వచ్చినప్పుడు సందర్శకులు కొంత అధికంగానే వస్తున్నారు. ఈసారి శనివారం వారి సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన వారందరికీ ఒక పక్క విడిగా కుర్చీలు వేసి వరుస క్రమంలో ఆయనను కల్పించాలని పార్టీ కార్యాలయ నాయకులు అనుకొని ఏర్పాట్లు చేశారు. కాని ఆయనను కలుసుకొనే అవకాశం వస్తుందో లేదో అన్న ఆత్రుతతో వచ్చిన వారంతా ఒకేసారి తోసుకొని రావడంతో పార్టీ కార్యాలయంలో తొక్కిసలాట ఏర్పడింది.
వందల మంది చంద్రబాబును చుట్టుముట్టి వినతులు, పుష్పగుచ్ఛాలు ఇవ్వాలని చూడటంతో ఆయన కూడా కొద్దిసేపు తొక్కిసలాటలో చిక్కుకుపోయారు. దీనితో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పై అంతస్థుకు తీసుకువెళ్లారు. సెక్యూరిటీని తోసుకొని కొందరు సందర్శకులు అక్కడకు వెళ్లారు. ఆయన అక్కడ నిలబడి వచ్చిన వారిని అందరినీ ఓపిగ్గా కలిసి మాట్లాడి పంపించారు. తోపులాటలో బాగా ఇబ్బంది పడ్డామని, ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని కొందరు మహిళలు ఆయనతో చెప్పారు. ఆయన వారికి ఆమేరకు హామీ ఇచ్చారు. ఆయనను కలవడానికి వచ్చినవారు పార్టీ కార్యాలయం ఆవరణలో ఇంకా వందల మంది మిగిలిపోయారు.
వీరిలో బృందాలుగా వచ్చిన వారి నుంచి కొందరు ప్రతినిధులను ఎంపిక చేసి పార్టీ నేతలు ఆయన వద్దకు పంపారు. వారి నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్య ఏమిటో తెలుసుకొన్నారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు వందల సంఖ్యలో తరలివచ్చారు. తమకు సంబంధించిన 1,600 పోస్టులను మెగా డీఎస్సీలో కలిపారని, వాటి భర్తీని నిలిపివేయాలని కోరుతూ వారు వచ్చారు.
‘మేం ఈ పోస్టుల్లో గత పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాలో రెండు మూడు వందల మందికి వయోపరిమితి కూడా దాటిపోయింది. డీఎస్సీ రాయడానికి కూడా అర్హత లేదు. డీఎస్సీలో మా పోస్టులు భర్తీ చేస్తే మేం రోడ్డున పడతాం. ఇంతకాలం మేం చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ వస్తున్నాం. మమ్మల్ని రోడ్డున పడవేయవద్దు. మమ్మల్ని కొనసాగించే మార్గం ఆలోచించండి.
మమ్మల్ని అవే పోస్టుల్లో క్రమబద్ధీకరించండి’ అని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై పరిశీలన చేయిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి మరి కొందరు ఉపాధ్యాయ అభ్యర్ధులు వచ్చారు. తమ జిల్లాతోపాటు నాలుగు జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు బాగా తక్కువ చూపించారని, ఇంకా ఎక్కువ ఖాళీలు ఉన్నా ఆ జిల్లాల అధికారులు వాటిని పంపలేదని వారు ఫిర్యాదు చేశారు.
నోటిఫికేషన్ వెలువడే లోపు ఆ వివరాలు కూడా తెప్పించి వాటిని కూడా మెగా డీఎస్సీలో కలపాలని వారు విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు మండలాల నుంచి కొందరు టీడీపీ కార్యకర్తలు వచ్చారు. కుక్కునూరు నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి బాగా దెబ్బతినిపోయిందని, తాము అన్ని పనులకు అక్కడకే వెళ్లాల్సి ఉన్నందువల్ల ఆ రహదారిని బాగు చేయాలని కోరుతూ వారు ఒక వినతిపత్రం చంద్రబాబుకు అందచేశారు.
సమస్యలు పేరుకుపోయే..: చంద్రబాబు
గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అనేక సమస్యలు పేరుకుపోయి ఇప్పుడు వాటి పరిష్కారం కోసం ప్రజలు పోటెత్తుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయం నుంచి తిరిగి వె ళ్లే సమయంలో ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఐదేళ్లుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వస్తున్న విజ్ఞాపనలు చూస్తే అర్థమవుతోంది. తమ బాధలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి.
వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రజల ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది. మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చే వారు తమ వినతులు ఇవ్వడానికి ఒక ప్రత్యేక వేదికను త్వరలో ఏర్పాటు చేస్తాం. పార్టీ కార్యాలయంలో కూడా వినతులు తీసుకొని వాటికి త్వరగా పరిష్కారం లభించేలా చూడటానికి వచ్చే వారం నుంచి ప్రత్యేక చర్యలు తీసుకొంటాం’ అని ఆయన చెప్పారు. దెబ్బ తిన్న రోడ్లతో వర్షాకాలంలో బాగా ఇబ్బంది వస్తోందని కొందరు మీడియా ప్రతినిధులు చెప్పినప్పుడు... ‘ఈ విషయం మా దృష్టిలో ఉంది. గుంతలు పూడ్చే పనిని త్వరలో చేపడతాం. వర్షాకాలంలో తాత్కాలిక మరమ్మతులు చేసి వానలు ముగిసిన తర్వాత పూర్తి స్ధాయి మరమ్మతులు చేపడతాం’ అని చంద్రబాబు తెలిపారు.