YSRCP: వృద్ధులపై వైసీపీ వల.. భయపెట్టేలా వ్యూహం..!
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:04 AM
YSRCP-Voters: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వైసీపీ నేతలు, మద్దతుదారుల అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయి. కార్యకర్తల నుంచి పెద్దల వరకూ డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు నమోదు చేసిన ఘటనలు బయటపడ్డాయి.
ఇంటి నుంచి ఓటేసే 12డీ ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను!
ఇందులో దివ్యాంగులు కూడా..
వలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే యత్నాలు
జగన్‌కు ఓటేయకపోతే పెన్షన్
రాదని భయపెట్టేలా వ్యూహం
రాష్ట్రంలో ఆ ఓటర్లు 10.60 లక్షలు
ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వైసీపీ నేతలు, మద్దతుదారుల అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయి. కార్యకర్తల నుంచి పెద్దల వరకూ డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు నమోదు చేసిన ఘటనలు బయటపడ్డాయి. ప్రతిపక్షపార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించడంతో పాటు పెద్దఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. వైసీపీ తాజాగా వయోవృద్ధులు, దివ్యాంగుల ఓట్లపై కన్నేసింది. వారి ఓట్లను ఎలాగైనా ఫ్యాన్ గుర్తుకు వేయించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వినియోగించుకోలేని 80 ఏళ్ల పైబడిన వయోవృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంట్లో నుంచే ఓటేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ అవకాశం ఇచ్చింది. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో ఈ కేటగిరీల ఓట్లు 5 వేల పైచిలుకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వయో వృద్ధుల ఓట్లు 5.76 లక్షలు, దివ్యాంగుల ఓట్లు 4.87 లక్షలున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. వయోవృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా ఇంట్లో నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు 12డీ ఫామ్ దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఐదు రోజుల్లోపు ఆయా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేందుకు శరీరం సహకరించనందున ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం ఇస్తారు. ఆయా రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితాలో ఆయా దరఖాస్తుదారుల పేర్లు పరిశీలించి పోస్టల్ బ్యాలెట్‌ను జారీచేస్తారు. పోలింగ్ రోజు కంటే ముందే ఎన్నికల అధికారులు ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్లలో వారి ఓట్లు వేయిస్తారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా ఆయా కుటుంబాల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. వయోవృద్ధులు, దివ్యాంగులు సొంతంగా ఓటు వేసుకోలేని పరిస్థితుల్లో తాము సూచించిన వారి సాయంతో నచ్చిన పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీ ఓటర్లపై వైసీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. జగన్‌కు ఓటేయకపోతే పెన్షన్ రాదని భయపెట్టడంతో పాటు పలు రకాలుగా ప్రభావితం చేయాలని వ్యూహం పన్నుతున్నారు.
ప్రతిచోటా కీలకం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. గత ఎన్నికల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వేల లోపు మెజారిటీతోనే గెలిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వయోవృద్ధులు, దివ్యాంగుల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ కేటగిరీ ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లి రహస్యంగా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఇంట్లో నుంచి ఓట్లు వేసే 12 డీ ఫామ్ ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో తెలుసుకునే అవకాశముంది. దీంతో ఎన్నికల ముందు ఈ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అధికార పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. వలంటీర్లను ఉపయోగించి ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించుకోవాలని వైసీపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా కుటుంబాలతో వలంటీర్లకు ఉన్న పరిచయాలను వాడుకోవాలని యోచిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.5 వేలకు అదనంగా రెట్టింపు జీతాలు, మరిన్ని రాయితీలు ఇచ్చి వలంటీర్లను పార్టీ సేవలకు వాడుకుందామన్న ధోరణిలో వైసీపీ పెద్దలు ఉన్నారు. కుదిరితే వలంటీర్లనే ఏజెంట్లుగా నియమించి పథకాల లబ్ధిపొందిన వారితో వైసీపీకి ఓట్లు వేయించేలా చూడాలని యోచిస్తున్నారు.
అక్రమాలపై అదే ఆందోళన...
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం వైసీపీకి కొత్తేమీ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అధికార యంత్రాంగాన్ని జగన్ సర్కా రు అడ్డగోలుగా వినియోగించుకుంది. తిరుపతి ఉపఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి. ఏకంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రతిఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడింది. పలువురు అధికారులు అధికార పార్టీ అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి ఓటు వేసే వయోవృద్ధులు, దివ్యాంగుల ఓటర్లను వైసీపీ నేతలు ప్రభావితం చేసే అవకాశముంది. సామాజిక పెన్షన్ పొందుతున్నవారు జగన్‌కు ఓటేయకపోతే పెన్షన్ రాదని ఇప్పటికే భయపెడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు పోలింగ్ ఆఫీసర్‌తో పాటు ఆయా పార్టీల ఏజెంట్లు కూడా వెళ్లవచ్చని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అధికార నేతలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.