Share News

AP Finance : వామ్మో.. ఏం సాకులు చెప్తున్నారు సారూ..!

ABN , Publish Date - May 28 , 2024 | 03:32 AM

ప్రభుత్వ శాఖల ఖజానాను ఖాళీ చేసి మరీ ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ (ఏపీఎస్‌ఎ్‌ఫసీ)లోకి డిపాజిట్ల రూపంలో జమ చేయించారు. కానీ...

AP Finance : వామ్మో.. ఏం సాకులు చెప్తున్నారు సారూ..!
CM YS Jagan

  • అనవసరంగా ఖర్చు చేసేస్తారట

  • అందుకే డబ్బులు ఇవ్వడం లేదట..

  • ‘ఆర్థిక అరాచకం’పై సర్కారు మాట

  • ఆడిట్‌ అభ్యంతరాలకు ఇదీ జవాబు

  • డిపాజిట్లు ఎందుకు చెల్లించలేదు?..

  • ష్యూరిటీ లేకుండా లోన్లు ఇస్తారా?

  • ఆడిట్‌ విభాగం తీవ్ర అభ్యంతరాలు..

  • సర్కారు వింత సమాధానాలు

‘బాగా అవసరంగా ఉంది. ఓ లక్ష రూపాయలు సర్దండి. వడ్డీతో సహా నెలలో తిరిగి చెల్లించేస్తా’ అని బతిమలాడితే ‘పోన్లే పాపం!’ అని డబ్బులు ఇచ్చారు. తీరా... నెల కాస్తా ‘నెలలు’ అయ్యాయి. ‘డబ్బులెక్కడ స్వామీ’ అని అడిగితే... ‘నీకు ఇప్పుడు డబ్బు నిజంగా అవసరముందా? ఆ అవసరమెంతో చెప్పు! ఎంత ఇవ్వాలో నేను డిసైడ్‌ చేస్తా! మొత్తం డబ్బులు ఇచ్చేస్తే అనవసరంగా ఖర్చు చేసేస్తావ్‌’ అనే జవాబు వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ‘సర్కారు వారి ఆర్థిక అరాచకం’లాగే ఉంటుంది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల ఖజానాను ఖాళీ చేసి మరీ ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ (ఏపీఎస్‌ఎ్‌ఫసీ)లోకి డిపాజిట్ల రూపంలో జమ చేయించారు. కానీ... కాలం తీరిన డిపాజిట్ల డబ్బులు సక్రమంగా చెల్లించనే లేదు. దీనిపై ఆడిట్‌ విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రభుత్వ శాఖలు పదేపదే అడుగుతున్నా డబ్బు ఎందుకు వెనక్కి ఇవ్వడంలేదు? ఏమిటీ అరాచకం?’ అని ప్రశ్నిస్తే... ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. ‘‘మెచ్యూర్‌ అయిన డిపాజిట్లను వెనక్కివ్వడానికి మాకో విధానం ఉంది. ముందుగా ఆ శాఖల సెక్రటరీలతో మాట్లాడి డబ్బు అవసరమా, కాదా తెలుసుకుంటాం. సెక్రటరీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తాం.

అవసరం లేకపోయినా డిపాజిట్లు వెనక్కి ఇచ్చేస్తే ప్రభుత్వ శాఖలు ఖర్చు పెట్టేస్తాయి. శాఖల ఖాతాల్లో డబ్బులుంటే మోసాలు జరిగే అవకాశముంది. విలువైన ప్రభుత్వ డబ్బు సొంత అవసరాలకు అందుబాటులో లేకుండా పోకూడదన్న ఉద్దేశంతోనే డిపాజిట్లు వెనక్కి ఇవ్వడం లేదు’’ అని బదులిచ్చింది. ఏపీఎ్‌సఎ్‌ఫసీని సృష్టించి ప్రభుత్వ శాఖల నుంచి వేలకోట్లు దండుకున్న వైనంపై ఇంతకుముందే ఆడిట్‌ విభాగం ఎన్నో ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఎస్‌ఎఫ్‌సీ కార్యకలాపాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ప్రభుత్వం ముందుంచింది. తెచ్చిన డిపాజిట్లు రూ.4,736 కోట్లలో 95 శాతం నగదును ఒక్క ఏపీఎ్‌సడీసీకే లోనుగా కేటాయించడాన్ని ఆడిట్‌ తప్పుపట్టింది. ఆదాయపన్ను రిటర్నులను సకాలంలో ఫైలు చేయకుండా రూ.13.5 లక్షల పెనాల్టీ కట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏవేవో సమాధానాలు చెప్పింది. మెచ్యూర్‌ అయిన డిపాజిట్లను ఆయా ప్రభుత్వ సంస్థలకు తిరిగిస్తే అనవసరంగా ఖర్చు పెట్టేస్తాయని సెలవిచ్చింది. డబ్బు వృథా కాకుండా అరికట్టేందుకే డిపాజిట్లు వెనక్కి ఇవ్వడం లేదని అడ్డగోలుగా సమర్థించుకుంది. డబ్బులను ఇంత జాగ్రత్త చేస్తే ఐటీ శాఖకు రూ.13.5 లక్షల పెనాల్టీ కట్టడం వృథా చేయడం కాదా? అనే ప్రశ్న వస్తుంది. సర్కారు దీనికీ కుంటిసాకు చెప్పింది. అకౌంట్లు ఫైనల్‌ చేయడంలో ఆలస్యమవడం కావడం వల్ల రిటర్నుల దాఖల్లో జాప్యం జరిగిందని చెప్పింది. ఏపీఎ్‌సఎ్‌ఫసీ వ్యవహారాన్ని సమర్థించుకునేందుకు జగన్‌ సర్కారు నానా పాట్లు పడింది.


సంబంధం లేని సమాధానం

ఆడిట్‌ విభాగం అడిగిన ప్రశ్నకు జగన్‌ సర్కార్‌ పొంతలేని సమాధానం చెప్పింది. ‘లోను తీసుకున్న ఏపీ టిడ్కో, ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అప్పు అసలును ఎందుకు చెల్లించలేదు’ అని ఆడిట్‌ ప్రశ్నించింది. ‘ఏపీఎ్‌సడీసీకి కూడా లోన్లు ఇచ్చాం. డిపాజిటర్లకు ఇవ్వాల్సిన వడ్డీ, అసలు ఆ కార్పొరేషన్‌ నుంచే తీసుకుంటున్నాం’ అని ప్రభుత్వం సంబంధం లేని సమాధానం చెప్పింది.

అభ్యంతరాలు

- సమర్థనలు

ఆడిట్‌: 2022-23లో 3 సార్లు మాత్రమే ఏపీఎ్‌సఎ్‌ఫసీ బోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అజెండాపై చైర్మన్‌ సంతకం లేదు. చైర్మన్‌ సంతకం లేకుండా బోర్డు సమావేశాలు ఎలా నిర్వహించారు? ఈ సమావేశాల మినిట్స్‌ కూడా అందుబాటులో లేవు.

సర్కారు: అవును చైర్మన్‌ సంతకం లేదు. తర్వాత సంతకం తీసుకుంటాం.

ఆడిట్‌: 33 ప్రభుత్వ సంస్థల నుంచి బలవంతంగా తెచ్చుకున్న రూ.4,736 కోట్ల డిపాజిట్లను ఎస్‌ఎ్‌ఫసీ బోర్డు అనుమతుల్లేకుండానే 4 కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చారు. బోర్డు అనుమతులు ఎందుకు తీసుకోలేదు?

సర్కారు: ఆయా కార్పొరేషన్లకు అప్పులు అత్యవసరం అయినందున బోర్డు సమావేశాలు పెట్టుకోకుండానే ఇచ్చాము. తర్వాత వీటిని ఆమోదిస్తాం.

ఆడిట్‌: 4 కార్పొరేషన్లకు ఇచ్చిన లోన్లకు ఎలాంటి ష్యూరిటీ లేదు. 33 ప్రభుత్వ సంస్థల నుంచి తెచ్చిన డిపాజిట్లకు రక్షణ లేదు. ఏదైనా సంస్థకు లోను ఇవ్వాలంటే ఆ సంస్థ తాలూకు మూడేళ్ల ఐటీ రిటర్నులు, ఆడిటెడ్‌ అకౌంట్లు కచ్చితంగా ఉండాలి. మూడేళ్ల నుంచి ఆ 4 కార్పొరేషన్లలో ఆడిట్‌ జరగనప్పుడు లోను ఎందుకు ఇచ్చారు?

సర్కారు: రుణాలిచ్చిన ఆ 4 కార్పొరేషన్లు కూడా ప్రభుత్వ పరిధిలోనివే. అందుకే ఎలాంటి ష్యూరిటీ తీసుకోలేదు. నగదు అత్యవసరం కావడంతో లోన్లు ఇచ్చాం.

ఆడిట్‌: ఎస్‌ఎ్‌ఫసీకి కంపెనీ సెక్రటరీని, ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ని ఎందుకు నియమించలేదు?

సర్కారు: ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ను మొదట్లో నియమించగా ఆ వ్యక్తి రాజీనామా చేశారు. కంపెనీ సెక్రటరీ కోసం సరైన వ్యక్తిని వెతికే పనిలో ఉన్నాం.

ఆడిట్‌: 33 ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్న డిపాజిట్లకు 6 నెలల నుంచి ఏడాది వరకు కాలపరిమితి విధించారు. ఆ డిపాజిట్లతో ఇచ్చిన లోన్లకు ఎలాంటి కాలపరిమితి ఎందుకు విధించలేదు?

సర్కారు: వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను డిపాజిట్లకు వర్తింపజేసేందుకు కాలపరిమితి విధించాం. మేమిచ్చిన లోన్ల కాలపరిమితి కూడా ఒక ఏడాదే. తర్వాత కాలపరిమితి పెంచుతూ పోతాం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 07:29 AM