AP Govt : ‘ఉపాధి’లో రోజుకు రూ.300
ABN , Publish Date - Dec 11 , 2024 | 04:52 AM
ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిర్ణయించిన ప్రకారం కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చేలా చేసి, వారికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
కూలీల వేతనం పెరిగేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిర్ణయించిన ప్రకారం కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చేలా చేసి, వారికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఇప్పటికే పలుమార్లు సమీక్షలు జరిపారు. వారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లాల స్థాయిలో వేతన మానిటరింగ్ సెల్ ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీచేసింది. దీనికి రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్‌గా ఉపాధి హామీ పథకం చీఫ్ విజిలెన్స్ అధికారి వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కోఆర్డినేటర్‌గా జిల్లా విజిలెన్స్ అధికారి లేక డ్వామా పీడీ ఉంటారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి తక్కువ వేతనాలకు కారణాలను విశ్లేషిస్తారు.
కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించి పనులు ఏ విధంగా చేపడితే రూ.300 వేతనం దక్కుతుందో వివరిస్తారు. జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలు ఉపాధి కూలీల వేతనం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్‌ఐసీ నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సరాసరిన రోజుకు రూ.255 మాత్రమే వేతనం దక్కుతోందని గుర్తించారు. కాగా, ఉపాధి హామీ పథకంపై సీఎం చంద్రబాబు ఆగస్టు 20న చేసిన సమీక్షలో కూలీలకు తగిన అవగాహన కల్పించి, సరాసరి వేతనరేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పవన్ కల్యాణ్ కూడా వేతన మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.