kakinada : బ్రదర్స్ బొక్కేశారు
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:21 AM
రేషన్ బియ్యం మాఫియాపై ఉచ్చు బిగుస్తోంది. పేదలకు పంచే బియ్యాన్ని కారుచౌక ధరకు కొట్టేసి, ఆనక పాలిష్ చేసి, విదేశాలకు తరలించి వేలకోట్లు కొట్టేసిన స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించడానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దందా
సోదరుడు వీరభద్రారెడ్డి, అనుచరుడు అగర్వాలే కీలకం
ఐదేళ్లలో రూ.4,995కోట్ల విలువైన 13.41లక్షల టన్నుల బియ్యం తరలింపు
అందులో సగానికిపైగా రేషన్ బియ్యమే
రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్ల బొడిచారు
ఎక్కడెక్కడి అక్రమ బియ్యమూ కాకినాడకే..
తెలంగాణ నుంచీ ఇక్కడకు పేదల బియ్యం
ఈ ఏడాది జూన్, జూలైల్లో బియ్యం అక్రమ తరలింపుపై కాకినాడ, చుట్టుపక్కల 13 కేసులు
85 కోట్ల విలువైన 22,947 టన్నులు పట్టివేత
బియ్యం స్మగ్లింగ్ మాఫియా పని పట్టనున్న ‘సిట్’
రాష్ట్రంలో ఎక్కడ అక్రమ బియ్యం పట్టుబడినా మూలాలు కాకినాడలోనే! ఆ మూలాలు సరాసరి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి, అనుచరుడు వినోద్ అగర్వాల్ దగ్గరకే వెళ్లి ఆగుతున్నాయి. అంతలా వీరిద్దరూ కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని రూ.వేలకోట్ల విలువైన పేదల బియ్యాన్ని బొక్కేశారు. వైసీపీ పాలనలో అధికారులను మేపి.. రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్ల బొడిచేశారు. ప్రభుత్వ ఖజానాను పిండేశారు. జగన్ జమానాలో కాకినాడ పోర్టుపైనా, రేషన్ బియ్యంపైనా పెత్తనం వీరిదే. ఏకంగా రూ.4,995కోట్ల విలువైన 13.41లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వీరిద్దరే విదేశాలకు విక్రయించేశారు. అందులో సగానికి పైగా రేషన్ బియ్యమే అని అంచనా!
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
రేషన్ బియ్యం మాఫియాపై ఉచ్చు బిగుస్తోంది. పేదలకు పంచే బియ్యాన్ని కారుచౌక ధరకు కొట్టేసి, ఆనక పాలిష్ చేసి, విదేశాలకు తరలించి వేలకోట్లు కొట్టేసిన స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించడానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. బియ్యం అక్రమార్కుల దందాపై లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కాకినాడ, చుట్టుపక్కల రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ 13 కేసులపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసి డొంక లాగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ 13 కేసుల్లో పట్టుబడ్డ బియ్యం ఏకంగా 22,947 టన్నులు.
దీని విలువ ఏకంగా రూ.84.87కోట్లు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఈ కేసుల్లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మరోపక్క ద్వారంపూడి సోదరుడు, ఆయన ప్రధాన అనుచరుడి కంపెనీలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఊహకు అందని విధంగా ఏకంగా 13.41 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించాయి. ఈ బియ్యం విలువ రూ.4,995కోట్లు.
అన్ని దారులూ కాకినాడకే!
రేషన్ బియ్యాన్ని తరలించేందుకు వైసీపీ అక్రమార్కులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. రేషన్ బియ్యం కిలోకు రూ.10 చెల్లించి లక్షల టన్నులు కాకినాడకు తరలించేస్తారు. ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు రేషన్ వ్యవస్థను కుళ్ల బొడిచేశారు. ద్వారంపూడి కుటుంబం కారణంగానే రేషన్ బియ్యం స్మగ్లింగ్ కాకినాడలో చెలరేగింది. ఈ స్మగ్లింగ్ పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిం ది. ప్రత్యేకంగా సిట్‌ను నియమించింది. నిందితులను అవసరమైతే తక్షణం అరెస్ట్ చేసే అధికారం కల్పించింది. కాకినాడ, చుట్టుపక్క మొత్తం 5 పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో 13 రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిపైనా సిట్ దృష్టి సారించనుంది.
తెలంగాణ నుంచీ...
మణికంఠ ఇండస్ట్రీస్ పేరుతో తెలంగాణలోని సిద్దిపేట నుంచి గత నెల 27న వచ్చిన 35 మెట్రిక్ టన్నులను కరప పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. తాళ్లరేవు స్టేషన్ పరిధిలో జూలై 17న కరీంగనర్ జిల్లా నుంచి తరలుతున్న 30టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాస గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జూన్ 28న రూ.13.96కోట్ల విలువైన 4,531 టన్నుల బ్రోకెన్, రారైస్(రేషన్ బియ్యం) పట్టుబడింది. ఇది లవన్ కంపెనీదిగా గుర్తించి, కొటారి అమిత్‌కుమార్‌ని నిందితుడిగా తేల్చారు. ఇదే కంపెనీ ఇటీవల పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం ఎగుమతి చేస్తుండగా, బార్జిలో 1,060 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తేల్చారు.
కొవిడ్‌లో చెలరేగారు...
గడచిన అయిదేళ్లలో కొన్నిలక్షల టన్నుల బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవగా, వాటిలో అత్యధికంగా ద్వారంపూడి సోదరుడైన ద్వారంపూడి వీరభద్రారెడ్డి తరలించేశారు. ఈయనకు చెందిన మానస కంపెనీ బియ్యం ఎగుమతులను రెట్టింపు చేసింది. గత ఐదేళ్లలో ద్వారంపూడి సోదరుడు కాకినాడపోర్టు నుంచి రూ.2,250కోట్ల విలువైన 6,01,290 టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. కొవిడ్ సమయంలో విదేశాలకు తరలించేశారు. 2020-21లో 1,10,300 టన్నులు, 2021-22లో 1,44,400 టన్నులు, 2022-23లో 2,00,890 టన్నులు, 2023-2024లో 82,400 టన్నులు, 2024-25లో ఇప్పటివరకు 28,400 టన్నులు విదేశాలకు తరలించారు. ఇందులో సగానికిపైగా రేషన్ బియ్యమేనని అంచనా!
కేసుల కథాకమామీషు!
‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన
సిట్ దృష్టి సారించనున్న 13 కేసులపై ‘ఆంధ్రజ్యోతి’ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపింది. తెలంగాణ నుంచీ కాకికాడ పోర్టుకు భారీగా అక్రమ బియ్యం తరలిరావడం గమనార్హం. వివరాలిలా..
జూన్ 28న కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప స్టేషన్ పరిధిలో రూ.15.31కోట్ల విలువైన 3,723 టన్నుల రేషన్, బాయిల్డ్ బియ్యం పట్టుబడింది. ద్వారంపూడి ప్రధాన అనుచరుడైన వినోద్ అగర్వాల్‌కు చెందిన సరళ ఫు డ్స్ కంపెనీ వీటిని తరలించింది. దీని పై కేసు నమోదు చేసి, శ్రీనివాస్ అగర్వాల్‌ను నిందితుడిగా చేర్చారు.
జూన్ 30న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీసులు శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ 1,406టన్నుల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. సత్తిసూర్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేసి రూ.3.83కోట్ల బియ్యంగా తేల్చారు.
కాకినాడ పోర్టు పోలీ్‌సస్టేషన్ పరిధిలో జూన్‌లో 7 కేసుల్లో 14,648 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులోను ద్వారంపూడి అనుచరులే ఉన్నారు.
కాకినాడ రూరల్ పరిధిలో జూలై 11న అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా 2 కేసులు నమోదయ్యాయి. వీ టిలో 373 ఎఫ్‌ఐఆర్ కింద రూ.26కోట్ల విలువైన 9,280 టన్నుల బియ్యం పట్టుబడింది. మెరైన్ లాజిస్టిక్ కంపె నీవిగా గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ 374 కింద 138 టన్నుల బియ్యం సీజ్ చేశా రు. నిందితులుగా యర్రా రామ భీమసుబ్రహ్మణ్యం, గుబ్బల సూర్యనారాయణలను గుర్తించారు.