AP Govt : ఉగాది నుంచి ఉచితం
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:03 AM
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
ఉమ్మడి జిల్లా పరిధిలో నో టికెట్
మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధత
ప్రతి నెలా రూ.265 కోట్ల భారం
ఆక్యుపెన్సీ 69% నుంచి 94 శాతానికి
సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లయినా, రోజుకు ఎంత దూరం ప్రయాణించినా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ‘మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలి. సంక్రాంతి నుంచి మొదలు పెడదాం’ అని చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే 3,500 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. కనీసం రెండువేలు కొత్త బస్సులు లేదా అద్దె బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం హామీ అమలు చేయలేమన్నారు. ఏపీఎ్‌సఆర్టీసీలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69 శాతం వరకూ ఉందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.265 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం ను సీఎంకు వివరించారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
2న కర్ణాటకకు మంత్రుల బృందం
జనవరి 2న హోంశాఖ మంత్రి అనిత, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఆర్టీసీ అధికారుల బృందంతో కలిసి కర్ణాటకకు అధ్యయనానికి వెళుతున్నట్లు సీఎంకు మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉచిత ప్రయాణం అమలుపై ఎదురైన సవాళ్లు, ఇబ్బందుల గురించి చర్చించినట్టు తెలిపారు. త్వరలో తమిళనాడుకు కూడా వెళ్లి అధ్యయనం చేశాక పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.
5,600 బస్సులు కొనాలి
ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలులో విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర రవాణా కార్పొరేషన్లకు సబ్సిడీ ఇవ్వట్లేదని, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) కింద ఇస్తోందని అధికారులు చెప్పారు. అలా తీసుకుంటే అన్నీ అద్దె బస్సులే అవుతాయని, ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సిబ్బంది సేవలు నిరుపయోగంగా మారే అవకాశముందని వివరించారు. కేంద్ర సబ్సిడీతో సంబంధం లేకుండా మనమే ఎలకా్ట్రనిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటికి రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 42 డిపోలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. రాబోయే రెండేళ్లలో 5,608 బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. మొత్తం అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికతో మరోమారు రావాలని ఆర్టీసీ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఉగాది నాటికి హామీ అమలయ్యేలా చూడాలన్నారు.
ప్రభుత్వానికి ఎంత భారమంటే..
పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వంపై నెలకు రూ.265 కోట్లు చొప్పున ఏడాదికి 3,182 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది.
ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు రూ.177 కోట్ల చొప్పున ఏడాదికి 2,112 కోట్లు భరించాల్సి ఉంటుంది.