Share News

AP High Court : ఆమె జీవితం.. ఆమె ఇష్టం..!

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:56 AM

మేజర్‌ అయిన యువతికి తన అభీష్టానికి అనుగుణంగా ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.

AP High Court : ఆమె జీవితం.. ఆమె ఇష్టం..!

  • ఆ యువతి మేజర్‌.. ఎక్కడికైనా వెళ్లి జీవించొచ్చు

  • స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

  • తండ్రి జోక్యాన్ని నిలువరించాలని ఆదేశం

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మేజర్‌ అయిన యువతికి తన అభీష్టానికి అనుగుణంగా ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే హక్కు ఆమెకు ఉంటుందని తెలిపింది. తన మహిళా భాగస్వామి (లెస్బియన్‌)ని ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారని, ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ యువతి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపింది. నిర్బంధ ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతితో తమ చాంబర్‌లో న్యాయమూర్తులు నేరుగా మాట్లాడారు. అనంతరం మేజర్‌ అయిన యువతికి తన అభీష్టానికి అనుగుణంగా ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేస్తూ, యువతి విషయంలో తండ్రి జోక్యం చేసుకోకుండా నిలువరించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.


విజయవాడకు చెందిన ఇద్దరు యువతులు ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. ఓ యువతి, తాను లివిన్‌ రిలేషన్‌షి్‌పలో ఉన్నామని, కానీ.. తన భాగస్వామిని ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారని, ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మరో యువతి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... మేజర్‌ అయిన యువతిని తండ్రి నిర్బంధించడం చట్టవిరుద్ధమన్నారు. లెస్బియన్స్‌ బంధాన్ని చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం నిర్బంధానికి గురైన యువతిని కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పోలీసులు ఆమెను మంగళవారం ధర్మాసనం ముందు హాజరుపర్చారు. ఆమెతో తమ చాంబర్‌లో విడిగా మాట్లాడిన న్యాయమూర్తులు యువతి మేజర్‌ అయినందున ఆమె ఇష్టానుసారంగా ఎక్కడికైనా వెళ్లి జీవించే హక్కు ఆమెకుంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2024 | 05:56 AM