Share News

High Court: హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు సీరియస్.. చలానా చెల్లించకుంటే వాటర్ కట్

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:31 PM

హెల్మెట్లు వాడకపోవడం వల్ల గత మూడు నెలల్లో రాష్ట్రంలో 660 మందికిపైగా మరణించారు. ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు చురకలు అంటించింది. అసలు ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించింది.

High Court: హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు సీరియస్.. చలానా చెల్లించకుంటే వాటర్ కట్
AP High Court

రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హెల్మెట్లు ధరించకపోయిన కారణంగా గత మూడు నెలల కాలంలో 667 మంది మరణించారు. ఈ విషయం తెలుసుకున్న హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఇలాంటి మరణాల సంఖ్య తగ్గేదని హైకోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల తీరుపై ప్రధాన న్యాయముర్తి ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించింది.


చలానా చెల్లించకుంటే వాటర్ బంద్?

హెల్మెట్లు వాడకపోవడంతో మరణాలు ఎక్కువవుతున్నాయని హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన నేపథ్యంలో ఈ మేరకు హైకోర్టు తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలు అనుసరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటారనే భయం ప్రజల్లో కలగాలని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలానాలు వేసి చేతులు దులుపుకోకుండా, కఠినంగా రూల్స్ అమలు చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. చలానాలను చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు చలానాలు చెల్లించని వారి వాహనాలను సీజ్ చేసే విధంగా చట్ట నిబంధనలు ఉన్నాయని హైకోర్టు గుర్తుచేసింది.


హైదరాబాద్‌లో మాత్రం

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ వెళ్లే వారు తెలంగాణా సరిహద్దుకు వెళ్లగానే సీటు బెల్టు పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఎలా అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లో బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారు దాదాపు ఎక్కడా కనిపించదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతోపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ కూడా కఠినంగా అమలు చేస్తున్నారని హైకోర్టు ప్రస్తావించింది.


పోలీసులపై ఆగ్రహం

ఏపీలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వచ్చే విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ట్రాఫిక్ ఐజీని హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు రవాణాశాఖ కమీషనర్‌ను కూడా వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 18న జరగనుంది. గతంలో కూడా హైకోర్టు పలు మార్లు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచనలు జారీ చేసింది. అయినా కూడా రూల్స్ కఠినంగా పోలీసులు అమలు చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి...

Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు

AP highcourt: అదానీతో విద్యుత్ ఒప్పందాలపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 07:07 PM