Share News

AP High Court : కౌంటర్లు సకాలంలో వేయాల్సిందే!

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:56 AM

సకాలంలో కౌంటర్లు వేయకుండా జాప్యం చేస్తే ఇకపై ఖర్చులు విధిస్తామని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. వివిధ వ్యాజ్యాలలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.

AP High Court : కౌంటర్లు సకాలంలో వేయాల్సిందే!

  • ఇకపై నిర్లక్ష్యం వహిస్తే ఖర్చులు విధిస్తాం

  • అధికారులను హెచ్చరించిన హైకోర్టు

  • ఆదేశించి ఏడాదైనా కౌంటర్‌ వేయలేదని ఆక్షేపణ

  • కేంద్ర గనులశాఖ కార్యదర్శికి 20వేలు జరిమానా

  • నంద్యాల జిల్లా కలెక్టర్‌కు రూ.10వేలు ఫైన్‌

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): సకాలంలో కౌంటర్లు వేయకుండా జాప్యం చేస్తే ఇకపై ఖర్చులు విధిస్తామని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. వివిధ వ్యాజ్యాలలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఓ కేసులో ఏడాది క్రితం ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయని కేంద్ర గనులశాఖ కార్యదర్శికి రూ.20వేలు జరిమానా విధించింది.

అలాగే, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సకాలంలో మెరుగైన కౌంటర్‌ దాఖలు చేయడంలో విఫలమైన నంద్యాల జిల్లా కలెక్టర్‌కు రూ.10వేలు జరిమానా విధించింది. ఆ సొమ్మును న్యాయవాదుల గుమస్తాల సంక్షేమనిధికి జమ చేయాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలుకు మరికొంత గడువు ఇచ్చి, విచారణను సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయానికి పనికిరాని లైమ్‌స్టోన్‌ ఖనిజ నిల్వలు ఉన్న భూములను తన అనుచరుల పేరు మీద అసైన్డ్‌ పట్టాలు ఇప్పించేందుకు బనగానపల్లి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారని, పట్టాల పంపిణీని నిలువరించాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పై గతేడాది ఆగస్టు 8న విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర గనులశాఖను ప్రతివాదిగా చేర్చింది.


అసైన్‌ చేయాలని నిర్ణయించిన భూముల్లో ఖనిజ నిల్వలు ఏమైనా ఉన్నాయా? వాటిని సాగు నిమిత్తం అసైన్‌ చేయవచ్చా? అసైన్‌ చేసేందుకు గనులశాఖ నుంచి అనుమతి ఏమైనా తీసుకున్నారా? తదితర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని నంద్యాలజిల్లా కలెక్టర్‌ను, కేంద్ర గనులశాఖ కార్యదర్శిని నాడు హైకోర్టు ఆదేశించింది.

ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా, ఉత్తర్వులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా కేంద్ర గనులశాఖ కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల అంతర్గత మార్పుల వల్ల కౌంటర్‌ వేయడంలో జాప్యం జరిగిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది యజ్ఞదత్‌ ఇచ్చిన వివరణకు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. తాము న్యాయవాదులుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు కౌంటర్‌ వేయడంలో జాప్యం ఉండేదికాదని న్యాయమూర్తులు గుర్తు చేశారు. కౌంటర్లు వేసే విషయంలో అధికారులు నిర్లిప్తంగా ఉండడానికి వీల్లేదని, ఇకపై జాప్యం జరిగితే ప్రతికేసులో ఖర్చులు విధిస్తామని హెచ్చరించింది.

Updated Date - Aug 16 , 2024 | 03:56 AM