Share News

Minister Parthasarathy: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

ABN , Publish Date - Nov 11 , 2024 | 04:58 PM

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన వాటితోపాటు లేని వాటినీ సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Minister Parthasarathy: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

అమరావతి, నవంబర్ 11: వైసీపీ సర్కారు సహజ వనరులను దోచుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. గత జగన్ సర్కారు రూ.1.35 లక్షల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిద్రమై పోయిందని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టా లెక్కించడం సీఎం చంద్రబాబు ఒక్కడితోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

వ్యవస్థలను ధ్వంసం చేసే ఓ వ్యక్తి కోసం గతంలో పరిపాలన చేశారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. సోమవారం రాజధాని అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాల్లో ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు.

Also Read: AP Budget: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ


అయితే చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. గతంలో హామీ ఇచ్చిన వాటితోపాటు లేని వాటినీ సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు.


ఇక ఇప్పటికే ఉచిత గ్యాస్ హామీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం రూ. 840 కోట్ల నిధులు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని మంత్రి కె. పార్థసారథి గుర్తు చేశారు. అమ్మకు వందనం పథకం కోసం రూ. 6,485 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని వివరించారు. అయితే ఉచిత బస్సు పథకం ఈ ఏడాదిలోనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నిరుద్యోగభృతికి వచ్చే ఏడాది నిధులు మంజూరు చేస్తామని మంత్రి కె. పార్థసారథి వివరించారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 294427.25 కోట్ల బడ్జెట్‌ను ఆయన సభ ముందుకు తీసుకు వచ్చారు. ఈ బడ్జెట్‌లో వివిధ శాఖలకు నిధులను కేటాయించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రి కె.పార్థసారథిపై విధంగా స్పందించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 05:42 PM