AP Politics: అదానీపై జేపీసీతో విచారణ జరిపించండి: వైఎస్ షర్మిల
ABN , Publish Date - Dec 18 , 2024 | 03:02 PM
లంచం ఆరోపణలు వెల్లువెత్తినా.. గౌతమ్ అదానీ వ్యవహారంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు నిరసనగా ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ పిలుపునిచ్చింది.
విజయవాడ, డిసెంబర్ 18: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని మోదీ ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అలాగే గౌతమ్ అదానీ వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీబీ రంగంలోకి దింపి విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో గౌతమ్ అదానీపై చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రను నగర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
Also Read: భవానీపై ఒక్క గీత పడినా ఊరుకోను
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరు ప్రభుత్వాలు
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అదానీ, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్య ముడుపుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. స్వయంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కి అదానీ గ్రూప్ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నివేదిక ఇస్తే.. కేంద్రంలో మోడీ కానీ.. రాష్ట్రంలో చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదంటూ వైఎస్ షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ సైతం జరిపించడం లేదన్నారు.
పరువు తీసిన ఇద్దరు..
అదానీ మీద ఈగ కూడా వాలనివ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ప్రపంచం ముంగిట దేశం పరువు, ఖ్యాతిని అదానీ తీస్తే.. ఆయన వద్ద లంచాలు తీసుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు. స్వలాభం కోసం విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేసి.. జనం నెత్తిన రూ.1.50 లక్షల కోట్ల భారం వేశారని ఆరోపించారు. ఇదో పెద్ద కుంభకోణమంటూ గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసిందని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రధాని మోదీకి, అదానీకి భయపడి టీడీపీ మౌనం పాటిస్తోందన్నారు.
పిలుపునిచ్చిన ఏఐసీసీ..
లంచం ఆరోపణలు వెల్లువెత్తినా.. గౌతమ్ అదానీ వ్యవహారంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు నిరసనగా ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సారథ్యంలో జరిగిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో సైతం ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ సహచరులు సైతం హాజరయ్యారు.
For AndhraPradesh News And Telugu News