Atchannaidu: జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధం..
ABN , Publish Date - Jan 04 , 2024 | 01:29 PM
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జయహో బీసీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జయహో బీసీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోందన్నారు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బడుగు,బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీనేనని అచ్చెన్నాయుడు అన్నారు.
‘‘బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే అక్కసుతో జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడు. బీసీలను రాజకీయంగా అణగతొక్కేందుకు రిజర్వేషన్లు 20 శాతానికి తగ్గించిన జగన్ రెడ్డి పెద్ద దగాకోరు. జగన్ రెడ్డి ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావు. కార్పొరేషన్ల ద్వారా బడుగుల్లో ఒక్కరికైనా రుణం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మంత్రి చెల్లుబోయిన .. జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు. కోడిగుడ్డు అమర్నాథ్‌కు టికెట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రం నలుదిక్కులనూ విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సజ్జలకు జగన్ రాసిచ్చాడు. జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తూ బడుగు, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నాడు.
సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపు, ఆదరణ పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డి బీసీ ద్రోహి. జగన్ రెడ్డి అరాచక పాలనపై ప్రశ్నించినందుకు నన్ను 75 రోజులు జైల్లో పెట్టాడు. యనమల, అయ్యన్న సహా ఎందరో నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన జగన్ రెడ్డిని సాగనంపాల్సిందే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అవకాశాలు కల్పిస్తాం. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తాం. ప్రతి పార్లమెంటు పరిధిలో జయహో బీసీ సభలు పెడతాం. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.