Share News

Mismanagement : అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు!

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:30 AM

రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్‌ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది.

Mismanagement : అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు!
Aurobindo

  • 108, 104 ఉద్యోగాల భర్తీలో చేతివాటం

  • నియామకాల పేరుతో లక్షల్లో వసూళ్లు

  • శిక్షణకు మరో 10 వేలు గుంజిన వైనం

  • 108 అంబులెన్సుల్లో ప్రైవేటుకు రోగులు

  • బిల్లుల్లో పర్సంటేజ్‌లు తీసుకున్న సిబ్బంది

  • గుంటూరులో భారీగా అందిన ఫిర్యాదులు

  • విచారణకు రంగంలోకి దిగిన విజిలెన్స్‌

  • అక్రమాలపై కూపీ లాగుతున్న అధికారులు

ఫోన్‌ చెయ్యగానే కుయ్‌.. కుయ్‌.. కుయ్‌ మని హారన్‌ కొట్టుకుంటూ 108, 104 వాహనాలు రావడం తెలిసిందే. కానీ, ఈ వాహనాల రాక, ఆస్పత్రులకు పోక మధ్య అత్యవసర సేవలు నిర్వహించే అరబిందో సంస్థ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉద్యోగుల నియామకం నుంచి రోగులను ఆస్పత్రులకు తరలించడం వరకు వసూళ్లకు పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్‌ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది. దీంతో 108 అంబులెన్స్‌లు, 104 వాహనాల నిర్వహణలో సంస్థ పూర్తిగా విఫలమైంది. ఆ వాహనాలు తిరగకుండానే తిరిగినట్లు చూపించి రూ.వందల కోట్లు వసూలు చేశారు. చివరికి ఇంజన్‌ ఆయిల్‌ కూడా మార్చకుండా వాహనాలను తిప్పేశారు. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇన్ని తప్పులు చేసినా జగన్‌ ప్రభుత్వం అరబిందోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెనాల్టీలు కూడా విధించకుండా మరింత ప్రోత్సాహం అందించింది.


కూటమి ప్రభుత్వం వచ్చాక అరబిందో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 108, 104 వాహనాల్లో ఉద్యోగుల భర్తీకి సంబంధించి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలుగుచూశాయి. దీనిపై గుంటూరు విజిలెన్స్‌ కార్యాలయంలో ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో అరబిందో అత్యవసర వైద్య సేవల డైరెక్టర్‌ సంపత్‌ రెడ్డి, ఆపరేషన్స్‌ హెడ్‌ గంగాధర్‌, డాక్టర్‌ సునీల్‌ను విజిలెన్స్‌ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం డేటా బయటకు తీస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ, వాహనాల నిర్వహణ, ఎంవోయు ప్రకారం వాహనాలు తిప్పారా? లేదా? అన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ నుంచి విజిలెన్స్‌ అధికారులు సమాచారం సేకరించారు. ముఖ్యంగా 108 అంబులెన్సుల్లో పైలట్‌, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌), 104 వాహనాల్లో డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రె్‌సలో డ్రైవర్‌ పోస్టుల భర్తీకి ప్రతి ఒక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ, వైసీపీ హయాంలో ఈ ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు ఉద్యోగాల్లో చేరిన వారి నుంచి శిక్షణ పేరుతో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైలట్‌, ఈఎంటీ సర్టిఫికెట్‌కు రూ.15వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తాన్నీ అరబిందో సంస్థ వసూలు చేసిందా? లేక మధ్యలో ఉండే ఉద్యోగులు తీసుకున్నారా? అనే విషయంపైనా విజిలెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.


ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు

రోగులను కూడా అరబిందో వదిలిపెట్టలేదు. రోగుల అత్యవసర సేవలను కూడా క్యాష్‌ చేసుకోవాలని ఉద్యోగులు చూశారు. 108 అంబులెన్సులను రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు వచ్చిన బాధితులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇలాంటి రోగులే టార్గెట్‌గా సంస్థలోని కొంత మంది సరికొత్త ప్లాన్‌ చేశారు. అత్యవసర వైద్యం అవసరమైన రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలించేవారు. ఈ ప్రక్రియలో ప్రైవేటు ఆస్పత్రులతో ముందే బేరం కుదుర్చుకునేవారు. ప్రభుత్వ అంబులెన్సుల్లో రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి, ఆ రోగులు కట్టే బిల్లుల్లో 10 నుంచి 20 శాతం వీళ్లకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. పర్సంటేజ్‌ వసూలు చేయడానికి అరబిందో సంస్థ విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ప్రత్యేకంగా ఉద్యోగులను కూడా నియమించిందన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజిలెన్స్‌ అధికారులు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ నుంచి హాస్పిటల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(హెచ్‌ఆర్‌ఎంఎస్‌) గురించి కూడా సమాచారం కావాలని కోరారు. అయితే, ఈ సమాచారాన్ని ట్రస్ట్‌ అధికారులు మళ్లీ అరబిందో సంస్థనే అడిగారు. విజిలెన్స్‌ పంపించిన లేఖను అరబిందోకు పంపించి సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అరబిందో సంస్థ ఇలాంటివేమీ జరగలేదంటూ మూడు వేల పేజీలతో కూడిన నివేదికను ట్రస్ట్‌కు పంపింది. ట్రస్ట్‌ అధికారులు ఆ నివేదికను విజిలెన్స్‌కు పంపించి చేతులు దులుపుకొన్నారు. విజిలెన్స్‌ లేవనెత్తిన ప్రశ్నలపై గతంలో ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చాయా? వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న కనీస విచారణ కూడా ట్రస్ట్‌ చేయలేదు.


  • జీతం పెంపుపై ఉద్యోగులు హర్షం

108 అంబులెన్సుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీతం రూ.4 వేలు పెంచాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నాటి టీడీపీ హయాంలో 108 ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు 2017లో జీవో 49 ద్వారా నెలకు రూ.4 వేలు అదనంగా ఇచ్చారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం అదనపు మొత్తాన్నీ ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం మళ్లీ జీవోను పునరుద్ధరించి ఉద్యోగులకు రూ.4 వేల వేతనం పెంచాలని నిర్ణయించడం హర్షణీయమని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 30 , 2024 | 07:14 AM