Avanti Srinivas Rao , Grandhi Srinivas: బై బై జగన్
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:16 AM
సార్వత్రిక ఎన్నికల్లో భారీ పరాజయం తర్వాత.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి నడిచేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు విముఖత చూపుతున్నారు. కొందరు బయటపడుతుండగా.. ఇంకొందరు గుంభనంగా ఉంటున్నారు.
నీతో వేగలేం.. ఇక రాజకీయాల్లోనే ఉండం.. మాజీ ఎమ్మెల్యేలు గుడ్‌బై
మాజీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి
రాజీనామా లేఖలు పంపిన అవంతి, గ్రంధి
5 నెలలకే పాలక పక్షంపై ఎదురుదాడి సరికాదు
ఓటమి తర్వాత జగన్ తప్పులు దిద్దుకోలేదు: ముత్తంశెట్టి
జగన్‌కు ఓ విధానమే లేదు.. వలంటీర్లతో కార్యకర్తలకు
గుర్తింపు లేకుండా పోయింది: శ్రీనివాస్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికల్లో భారీ పరాజయం తర్వాత.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి నడిచేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు విముఖత చూపుతున్నారు. కొందరు బయటపడుతుండగా.. ఇంకొందరు గుంభనంగా ఉంటున్నారు. ఇతర పార్టీల్లో అవకాశాలు ఉన్నవారు వెంటనే నిష్క్రమిస్తున్నారు. అవకాశాలు దక్కనివారు అసలు రాజకీయాలకే గుడ్‌బై చెప్పేస్తున్నారు. గురువారం వైసీపీకి పెద్దషాకే తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రాజీనామా ప్రకటించారు. వీరిద్దరూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
వ్యక్తిగత కువిమర్శలు చేయలేక..
ఎవరైనా ఒకసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారంటే.. తరాలు కొనసాగుతుంది. తాత, తండ్రి, మనవళ్లు, కొడుకులు, కూతుళ్లు, భార్య ఇలా ఎవరో ఒకరు వారసులుగా కొనసాగుతుండడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో పార్టీలు మాత్రమే మారుతుంటారు. శాశ్వతంగా రాజకీయాలు వదిలేయరు. గత ఐదేళ్లలో జగన్‌ను నమ్ముకున్నవారిలో చాలా మంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన అనుసరించిన రాజకీయ విధానమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
సైద్ధాంతిక విమర్శలకు తిలోదకాలిచ్చి.. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులకు దిగే విష సంస్కృతికి 2019లోనే ఆయన శ్రీకారం చుట్టారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులపై కూడా సోషల్ మీడియాలో విషం చిమ్మడంవంటి వికృత పోకడలకు వైసీపీ నాయకత్వం తెరలేపింది. కన్నతల్లి, తోడబుట్టిన చెల్లెలు కూడా ఇందుకు మినహాయింపు లేదు. ఎవరికైనా వయసు మీదపడుతుంది. అది ప్రకృతి ధర్మం. చంద్రబాబును ముసలోడని జగన్ పదే అంటుంటారు. ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సీఎం ముసలోడని.. వచ్చే ఎన్నికల నాటికి బతికి ఉండడని.. బతికి ఉంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే జైలుకు పంపిస్తామని ఏకంగా విలేకరుల సమావేశంలోనే ప్రకటించడం చూస్తే.. వారి రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం ఓడిపోవడమే కాదు.. కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. అయినా తనకు ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ మొండికేయడం సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురిచేసింది. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం ఆయనకు కొత్త కాదు. కానీ దీనిపై ఏకంగా హైకోర్టుకే వెళ్లడం.. సీఎం హోదాలో తనకున్న భద్రతను పునరుద్ధరించాలని పేచీపెట్టడం వంటివి.. తమ రాజకీయ భవిష్యత్‌ను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయని వైసీపీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యర్థులను అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో చాలా మంది మెడకు చుట్టుకుంటోంది. ప్రజలు కూడా ఏవగించుకుంటున్నారు. జగన్ ప్రభావంతో గతంలో నోటికి, చేతికి పనిచెప్పిన కొందరు నాయకులపై తాజాగా కేసులు నమోదవుతున్నాయి.
అప్పుడలా చేసి..
టీడీపీ కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులపై రాజకీయ పోరాటం చేయాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపిచ్చారు. ఈ కేసులతో వైసీపీపై ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆయన ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ఆయన ఐదేళ్ల హయాంలో రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు.. జనంపైనా తప్పుడు కేసులు బనాయించారు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిరోధిస్తూ ప్రత్యేక జీవోనే తెచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర.. చివరకు చంద్రబాబును సైతం అక్రమంగా అరెస్టుచేసి జైలు పాల్జేయడం వైసీపీకి రాజకీయంగా శాపంగా మారాయి. నాటి వైసీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిపై సీఐడీ, ఏసీబీ విచారణలు జరుగుతున్నాయి. జగన్‌తో అంటకాగి అక్రమాలకు పాల్పడిన అధికారులు కొందరు అరెస్టు కూడా అయ్యారు. దీంతో వైసీపీ నేతలు భయంతో నోరుమెదపడం లేదు. కొందరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.. మరికొందరు వేరే పార్టీలకు వెళ్లిపోతున్నారు. వైసీపీలో కొనసాగడం అనవసరమని భావించి మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు వెంకటరోశయ్య జనసేనలో చేరగా.. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.