Share News

AP News: కారుచౌకగా భోగాపురం భూములు

ABN , Publish Date - May 31 , 2024 | 04:06 AM

విశాఖ, విజయనగరం జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. జగన్‌ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ భూముల మార్కెట్‌ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.

AP News: కారుచౌకగా భోగాపురం భూములు
Bhogapuram land

భోగాపురంపై మీకు అంత ప్రత్యేక ప్రేమ ఎందుకు?

అసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలపై వాస్తవమెంత?

బినామీల పేరిట 218 ఎకరాలు

436 కోట్ల విలువైన భూమి 43 కోట్లకే

మరో 160 ఎకరాలకు అగ్రిమెంట్లు

పేదల భూములకు 22(ఏ) నుంచి

విముక్తి లభించగానే రిజిస్ట్రేషన్లు

రైతులను బెదిరించి కొనుగోళ్లు

కడప జిల్లా వ్యక్తి టీమ్‌ అరాచకాలు

ప్రభుత్వంలో ముఖ్య పదవిలో ఉన్న

‘పెద్దసారు’ సొంత మనిషిగా ప్రచారం

జవహర్‌రెడ్డిగారూ.. మీకే మైనా తెలుసా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అసైన్డ్‌ భూములపై గద్దలు

ఇటు విశాఖ.. అటు విజయనగరం.. జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. అయితే జగన్‌ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ భూముల మార్కెట్‌ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.


రైతులను భయపెట్టి మరీ దందా సాగిస్తున్నారు.

జవహర్‌రెడ్డి గారూ.. ఎవరా వ్యక్తి?

భోగాపురం మండలంలో పేదల భూములు లాక్కొంటున్న కడప జిల్లా వ్యక్తి పేరు విశాఖ, విజయనగరంతో పాటు రాష్ట్రమంతా మార్మోగిపోతోంది. ఆ రెండు జిల్లాల అధికార యంత్రాంగం, ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు ఆయన పేరు చెప్పగానే... వైసీపీ నేతలను పక్కన పెట్టి మరీ రెడ్‌కార్పెట్‌ వేస్తున్నారు. అవసరమైన భూమి రికార్డులు పట్టుకొని పరుగులు తీస్తున్నారు. ఇంతలా ప్రభావితం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ‘పెద్దసారు’ సొంత మనిషి అని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని మించిన పెద్దసారు లేరు. జవహర్‌రెడ్డి గారూ... మరి ఆ ‘సొంత మనిషి’ ఎవరో మీకు తెలుసా? ఆయన మీకు సమీప బంధువా? మీకు ఏమవుతారు?


సవరణ అందుకే..?

అస్మదీయ భూ బకాసురులకు మేళ్లు చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది సెప్టెంబరులో జగన్‌ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ భూముల చట్టం-1977(పీఓటీ)ను సవరించింది. పైకి మాత్రం పేదలకు మేలు చేస్తున్నామని చెబుతూ... 20 ఏళ్లకు పైన అసైన్‌ చేసిన భూములకు పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పించింది. ఇదే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు, అధికారులకు వరంగా మారింది. కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ చట్టం రావడానికి ముందే అంటే.. గతేడాది జూలై నుంచే విశాఖలో వాలిపోయారు. జగన్‌ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారికి ఆయన దగ్గర వ్యక్తి అనే ప్రచారం జరుగుతోంది. భోగాపురం మండలంలో వందల కోట్ల రూపాయల నిధులతో మకాం వేశారు. అక్కడ ‘పెద్దసారు’ సొంత మనిషిగా పాపులర్‌ అయ్యారు. విలువైన అసైన్డ్‌ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గాలించారు. భోగాపురం మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో 218 ఎకరాలను బినామీల పేరిట సొంతం చేసుకున్నారు. మరో 160 ఎకరాల భూములపై అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఫ్రీ హోల్డ్‌ కేసులను సెటిల్‌ చేస్తే ఆ భూములు బినామీల పేర్ల మీదకు మారిపోవడమే తరువాయి. ఆ తర్వాత మరో 320 ఎకరాలపై అగ్రిమెంట్లు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు.


చకాచకా డీల్‌

భోగాపురం మండలంలో ఇప్పుడు కడప జిల్లా వ్యక్తి పేరు బాగా పాపులర్‌ అయింది. పేద రైతులు, అసైన్డ్‌ భూములున్న వారి దగ్గర ఆయన ఫోన్‌ నంబరు ఉంది. ఏ రైతు ఫోన్‌ చేసినా, వాట్స్‌పలో హలో అన్నా ఆయన వెంటనే అక్కడ వాలిపోతారు. అసైన్డ్‌ రైతులు ఎవరు? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? వంటి విషయాలపై అధ్యయనం చేశారు. అప్పులున్న రైతులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. వారితో ధర మాట్లాడుకుని భూములు తాను చెప్పిన వ్యక్తులకు అమ్మేలా అగ్రిమెంట్లు రాయించారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు అసైన్డ్‌ రైతులతో ఫ్రీ హోల్డ్‌ రైట్స్‌ కోరుతూ దరఖాస్తులు పెట్టించారు. అధికారులు వాటిని శరవేగంగా పరిష్కరించి ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అంతే... వెంటనే బినామీలకు ఆ భూములు కట్టబెట్టారు. వేగంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. అసైన్డ్‌ భూములకు ఫ్రీ హోల్డ్‌ రైట్స్‌ వచ్చాయంటూ, కొనుగోలుదారుల పేర్లతో రికార్డులు తయారు చేశారు. ఇలా భోగాపురం మండలంలోని పోలిపల్లి, కవులరాడ, బసవపాలెం, ముంజేరు, కొంగవానిపాలెం, కంచేరు గ్రామాల పరిధిలో 218 ఎకరాల అసైన్డ్‌ భూములను కడప జిల్లా వ్యక్తి తన బినామీల పేరిట మార్చేశారు. ఇవేగాక... కంచేరు, కొంగవానిపాలెం, ముంజేరు గ్రామాల్లోనే మరో 160 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్లు అయ్యాయి. వీటికి సంబంధించిన ఫ్రీ హోల్డ్‌ దరఖాస్తులు రెవెన్యూ అధికారుల క్లియరెన్స్‌లు పూర్తి చేసుకొని కలెక్టర్‌ వద్దకు చేరాయి. కలెక్టర్‌ క్లియర్‌ చేయాల్సి ఉంది. అయితే ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయినా సరే ఆ దరఖాస్తులను సెటిల్‌ చేయాలంటూ కలెక్టర్‌పై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఓ ముఠా ఇదే మండలంలో మరో 320 ఎకరాలను సొంతం చేసుకునేందుకు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు.


బెదిరించి హస్తగతం

భోగాపురం మండలంలో అసైన్డ్‌ భూములపై కడప జిల్లా వ్యక్తి కంటే ముందే వైసీపీకి చెందిన ఓ స్థానిక నాయకుడి కన్నుపడింది. ఆయన తన మనుషుల ద్వారా రైతులతో ఒప్పందాలు చేయించుకున్నారు. ఎకరాకు పది లక్షల చొప్పున అమ్మేలా అగ్రిమెంట్లు రాయించుకున్నారు. విషయం తెలుసుకున్న కడప జిల్లా వ్యక్తి వారి కంటే అదనంగా మరో రూ.5 లక్షలు ఇస్తానని ఆఫర్‌ చేశారు. దీంతో స్థానిక నేత మనుషులు, రియల్టర్లు, ఏజెంట్లతో కడప జిల్లా వ్యక్తి టీమ్‌కు గొడవలు జరిగాయి. ఎలాగైనా భూములు చేజార్చుకోరాదని భావించిన ఆయన సగటున ఒక్కో ఎకరానికి 20 లక్షలు ఇస్తానని రైతులకు ఆశ చూపారు. దీంతో రైతులు కడప జిల్లా వ్యక్తి టీమ్‌ చెప్పిన వారితో అగ్రిమెంట్లు చేసుకున్నారు. అక్కడ ఎకరా దాదాపు 2 కోట్లు విలువ చేస్తుండగా, చాలా చౌక ధరకు కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేసిన గ్రామాలు సముద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. రైతులు ఎక్కువ ధర ఆశించకుండా వారిని చట్టపరమైన భయాందోళనలకు గురిచేసి అగ్రిమెంట్లు రాయుంచుకున్నారు.


టార్గెట్‌ 698 ఎకరాలు

పెద్దసారు సొంత మనిషి తొలుత భోగాపురం మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో 218 ఎకరాల అసైన్డ్‌ భూమిని కొనుగోలు చేశారు. వాటిని తన బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. మ్యుటేషన్‌లు పూర్తిచేశారు. రెవెన్యూ రికార్డులు కూడా మార్చేశారు. ఆ భూముల మార్కెట్‌ విలువ 436 కోట్లు. అయితే సకల వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, రైతులను ప్రలోభపెట్టి, మోసం చేసి కారుచౌకగా 43.60 కోట్లకే చేజిక్కించుకున్నారు. ఒక్కో రైతు ఎకరం భూమిపై 1.80 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయిన 160 ఎకరాలకు కూడా ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఎకరాకు 20 లక్షల చొప్పున డీల్‌ కుదిరింది. అగ్రిమెంటు సందర్భంగా రైతులకు ఎకరాకు 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించారు. ఫ్రీ హోల్డ్‌ దరఖాస్తులను కలెక్టర్‌ పరిష్కరించాక మిగిలిన 10 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదే పద్ధతిలో మరో 320 ఎకరాల కొనుగోలుకు రైతులతో అగ్రిమెంట్లు చేయించుకునేందుకు కడప వ్యక్తి టీమ్‌ రెడీగా ఉంది. అగ్రిమెంట్లు సిద్ధంగా ఉన్నాయి. ధర కూడా ఎకరానికి 20 లక్షలే. ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ రావడం, స్థానికంగా రియల్టర్లతో గొడవల కారణంగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. అయినా రైతులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ బృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భోగాపురం మండలంలోని ఆరేడు గ్రామాల పరిధిలో మొత్తం 698 ఎకరాలు సేకరించాలన్నది టార్గెట్‌గా పెట్టున్నట్లు తెలిసింది.


భోగాపురమే ఎందుకు?

ఒకవైపు అందమైన విశాఖ. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ రెండింటిని అనుసంధానించే 20 కిలోమీటర్ల బీచ్‌ కారిడార్‌. ఇదే వరసలో పారిశ్రామిక కారిడార్‌. ‘భవిష్యత్‌ అంతా ఇక్కడే. పెట్టుబడులు ఇక్కడే. అదొక నవలోకం కాబోతుంది’ అన్నది ముఖ్యమంత్రి జగన్‌ కల. ఆ ఫలాలు అందుకునేందుకు అధికారంలో ఉన్న పెద్దలు కొందరు అక్కడ వాలిపోయారు. ఇప్పటికే విశాఖలో విలువైన భూములను చేజిక్కించుకున్నారు. తర్వాత భోగాపురంపై కన్నేశారు. ప్రైవేటు భూములు కొనాలంటే ఖరీదు. అందుకే పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములపై పడ్డారు. పేదలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, భయపెట్టి మరీ భూములు చేజిక్కించుకుంటున్నారు. అధికారంలో ఉన్న పెద్దలు తమ మనుషులతో స్వయంగా చేయిస్తున్న నయా రౌడీయిజం ఇది. ఇందుకోసం అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. భోగాపురం మండలంలోని పేదల భూములను కబళిస్తున్నారు. పేదల చేతిలో చిల్లర పెట్టి కోట్ల విలువ చేసే సాగు భూములను దోచేస్తున్నారు. వారిలో కడప జిల్లా వ్యక్తి ముందు వరసలో ఉన్నారు.

Updated Date - May 31 , 2024 | 07:38 AM