Share News

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:06 AM

బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌..

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ
Vijayawada Floods

  • వరద ముంపులో మరో 50 వేల మందికిపైగా బాధితులు

  • నేటి సాయంత్రానికి పూర్తిస్థాయిలో తరలింపు

  • బోట్లు అందుబాటులో ఉన్నా ఉపయోగించని అధికారులు

  • సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌పైనే బోట్లు నిలిపివేత

  • స్వచ్ఛంద సంస్థల సహకారంతో..

  • సురక్షిత ప్రాంతాలకు బాధితులు

విజయవాడ/అమరావతి: బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, రాధానగర్‌, డాబాకొట్లు సెంటర్‌, ఇందిరానాయక్‌ నగర్‌, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నాటికి రెండు నుంచి మూడు అడుగుల మేర సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం నాటికి కండ్రిక, అంబాపురం వైపు ఉన్న ఆంధ్రప్రభ కాలనీ 11లో ఇంకా మెడలోతు నీటితోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 75 వేల మంది బుధవారం మధ్యాహ్నానికి బయటకు వచ్చేశారు. ఇంకో 75 వేల మంది బయటకు రావల్సి ఉంది.


Bezawada-Floods-1.jpg

స్వచ్ఛంద సంస్థల సాయంతో..

బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకుల పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా నాలుగు నుంచి పది కిలో మీటర్ల మేర నడుచుకుని రావటంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీవ్యాన్‌లు, ట్రాక్టర్ల వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపులరోడ్డు, గొల్లపూడి, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది.


Bezawada-Floods-2.jpg

ఇద్దరు అధికారులతోనే..

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ అధికారి కోన శశిధర్‌ బాధితుల తరలింపు విషయంలో చొరవ చూపించారు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి అందులోకి స్థానిక కార్పొరేషన్‌ సిబ్బందిని వరద ముంపు ప్రాంతాల్లోకి పంపించారు. పోలీసు శాఖ నుంచి ఏడీసీపీ గున్నం రామకృష్ణ ఒకేఒక్కడుగా సింగ్‌నగర్‌ దగ్గర పనిచేశారు. అటు కోన శశిధర్‌, ఇటు గున్నం రామకృష్ణ ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ వరద బాధితుల తరలింపు కోసం వాహనాలు, సిబ్బందిని పంపిస్తూ బాధితులను తరలించారు. మాజీ మునిసిపల్‌ కమిషనర్‌, ప్రస్తుత సిఎంఓలో పనిచేస్తున్న ప్రద్యుమ్న కలెక్టరేట్‌కు వచ్చిన తరువాతే బాధితుల ఆపరేషన్‌ ఓ గాడిలో పడింది.


Bezawada-Floods-3.jpg

కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం

నాలుగో రోజు సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల నుంచి వరద బాధితులను తీసుకువచ్చే విషయంలో ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించిన పడవలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్లు మూడు వంతులకుపైగా సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ సర్వీసు రోడ్డులోనే నిలిపేశారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన ‘కన్నీళ్లు–కష్టాలు’ కథనంపై జిల్లా యంత్రాంగం తెల్లవారుజామునే స్పందించింది. ఆహార వ్యర్ధాలతో తీవ్ర అపరిశుభ్రంగా, దుర్గంధంగా ఉన్న సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ను మాత్రం పరిశుభ్రం చేశారు. ఆ తరువాత జిల్లా యంత్రాంగం ఈ బోట్లను సింగ్‌నగర్‌ నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు పంపిస్తుందని భావిస్తే ఆ పని చేయలేదు. బోట్ల నిర్వాహకులకు జిల్లా యంత్రాంగం నుంచి కనీస సహకారం లేదు. కేవలం డాబా కొట్లు సెంటర్‌ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే 75 వేలకుపైగా బాధితులు బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒకటి, రెండు అడుగులు నీటి మట్టం తగ్గటంతో శివారు ప్రాంత వాసులు కూడా తరలిరావటం పరిమిత సంఖ్యలో ప్రారంభమైంది. వీరికి ఆహారం, నీటి పంపిణీ జరగలేదు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు కూడా సర్వీసు రోడ్డు పక్కనే పెద్ద సంఖ్యలో నిలిపేశారు. చాలా బోట్లు లారీల నుంచి కూడా బయటకు తీయలేదు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బోట్లు 30 శాతం వరద నీటిలోకి దిగి బాధితులను రక్షించాయి.

Bezawada-Floods-4.jpg

Updated Date - Sep 05 , 2024 | 08:06 AM