‘అదానీ పవర్’ పనుల అడ్డగింత!
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:10 AM
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడి పేరిట బెదిరింపులు
ఎన్నికల ముందు వైసీపీ నుంచి బీజేపీలో చేరినవారి రుబాబు
ధర్మవరం/తాడిమర్రి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్టును 407.6 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.3వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ యంత్రాలతో కొండలను తవ్వి, చుట్టూ మట్టి పోస్తున్నారు. రాళ్లను పగులగొట్టి పిండి చేసి తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.500 కోట్లకు పైగా విలువైన పనులు పూర్తయ్యాయి. రూ.400 కోట్ల విలువైన యంత్రసామగ్రిని చేర్చారు. తదుపరి నిర్మాణ పనులకు భారీస్థాయిలో కంకర అవసరమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురానికి చెందిన క్రషర్ యజమాని లక్ష్మీనారాయణ ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. తాము చెప్పిన చోటే కంకర కొనాలని సైట్ ఇంజనీర్‌ను బెదిరించారు.
ముందు పనులాపాలనడతో ఆపేశారు. ఈ విషయం అటువైపు వెళుతున్న టీడీపీ తాడిమర్రి మండల కన్వీనర్ రామ్మోహన్, ఆయన తమ్ముడు మల్లికార్జున తదితరులకు తెలిసింది. వెంటనే వారు కొండపైకి చేరుకున్నారు. ‘మా మండలంలో మీ రుబాబు ఏమిటి’ అని వారిని నిలదీశారు. ఇక్కడికి పంపించిందెవరని ప్రశ్నించారు. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంపించారని వారు చెప్పారు. ఆయనతోనే మాట్లాడతామని టీడీపీ నాయకులు ఫోన్ చేసేందుకు యత్నించగా.. వద్దంటూ బీజేపీ నాయకులు జారుకున్నారు.
మంత్రికి తెలియదా?
ఎన్నికలకు 2నెలల ముందు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, లక్ష్మీనారాయణ రూ.3 వేల కోట్ల విలువైన పవర్ ప్రాజెక్టును ఆపే యత్నం చేయడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇంతజరుగుతున్నా మంత్రి సత్యకుమార్ స్పందించకపోవడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులకు బీజేపీ నేతలు అండగా నిలుస్తున్నారని.. ఏ పనికోసం వెళ్లినా ప్రత్యక్షమవుతున్నారని, ఇంత జరుగుతుంటే సత్యకుమార్‌కు తెలియకుండా ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు.