Budameru: సక్సెస్.. బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి..
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:47 PM
కూటమి సర్కార్.. అనుకున్నది సాధించింది. వరదలతో బెజవాడ ప్రజలను గజ గజ వణికించిన బుడమేరు పనులు విజయవంతంగా ముగిసాయి...
విజయవాడ: కూటమి సర్కార్ అనుకున్నది సాధించింది..! బెజవాడను గజ గజలాడించిన.. ముంచెత్తిన బుడమేరు పనులను విజయవంతంగా పూర్తి చేసింది. బుడమేరకు గండి పడటంతో ఒక్కసారిగా వరద నీరు రావడం.. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. బుడమేరు పేరు వింటే చాలు బెజవాడ వాసులు వణికిపోతున్న పరిస్థితి. అయితే అహర్నిశలు శ్రమించి గండి పూడ్చివేత పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో విజయవాడ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి కావడంతో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. బేస్ లెవెల్ వరకు బుడమేరు 3 గండ్లను అధికారులు పూడ్చారు. నాలుగు రోజులు పాటు నిరంతరాయంగా పనులు కొనసాగాయి. పూడ్చిన గండిని ఆ తర్వాత మరింత ఎత్తు పెంచి పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని అధికారులు, మంత్రులు వెల్లడించారు. మరోవైపు.. నిద్రాహారాలు మాని గండి పూడ్చివేత పనుల్లో నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పట్టువదలని విక్రమార్కుడిలా రాత్రింబవళ్లు అక్కడే ఉన్నారు మంత్రి. ఎప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్‌కు అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఈ మొత్తం పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తెలుసుకుంటూ.. తగిన సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు.
ఇన్నాళ్లు ఇలా..!
బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు! ఇప్పుడు ఈ వాగును విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తున్నారు! వరద తగ్గినట్టే తగ్గి.. ఇళ్లు బాగు చేసుకునేలోపే మళ్లీ బుడమేరు వారితో కన్నీరు పెట్టించింది. దీంతో ఇక ఉండలేం అంటూ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు, సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మూడో గండి పూడ్చే పని పూర్తి కాకపోవడంతో బుడమేరుకు వరద హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. గురువారం ఇళ్లలోకి వచ్చిన నీరు తొలగిపోవడంతో కింది అంతస్తుల్లో ఉన్నవారు గదులు శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వరద చేరడంతో తల్లడిల్లిపోతున్నారు. వరద అడుగు మేర పెరిగినట్టు చెబుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్ డాబా కొట్టు సెంటర్‌లో గురువారం రహదారి కనిపించింది. అలాంటిది శుక్రవారం ఈ రోడ్డుపైకి నీరు వచ్చింది. బుడమేరు వంతెన పిల్లర్ల దిగువ నుంచి ప్రవహించిన నీరు ఇప్పుడు వంతెన శ్లాబ్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. తగ్గిందనుకున్న నీరుపెరగడంతో ఇక ఈ ముంపులో ఉండలేమనుకుని ఇళ్లలో ఎక్కడి వస్తువులు అక్కడ వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. బస్సు పట్టుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
ఆర్మీ రంగంలోకి దిగి..
వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపధికన సాగాయి. మొత్తం 3 ప్రధాన గండ్లలో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్దదైన మూడో గండి పూడ్చివేత శనివారం మధ్యాహ్నానికి పూర్తయ్యింది. విజయవాడ పల్లపు ప్రాంతాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరద నుంచి బాధితులను కాపాడేందుకు, సహాయ చర్యలు ముమ్మరంగా చేసేందుకు బుడమేరు వరద గండ్ల ద్వారా విజయవాడ వైపు రాకుండా చేయాల్సి ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి సైన్యాన్ని రంగంలోకి దించారు. మద్రాసు 6వ బెటాలియన్ నుంచి 120 మంది జవాన్లు వచ్చారు. తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలా కట్టారు. అందులో భారీ రాళ్లు వేసి పూడ్చారు. గేబియాస్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టల్లా చేసిన దానిలో పెద్ద పెద్ద రాళ్లతోనూ ..ఇసుకతోనూ నింపారు) ద్వారా వారు గండ్లు పూడ్చారు. ఈ బుట్టలను పటిష్ఠం చేసేందుకు 4 మీటర్ల వరకూ రక్షణ కట్టినట్లు ఆర్మీ, జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా.. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 4వ కిమీ వద్ద 60 మీటర్లు, 4.1 కిమీ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లలో 4.1, 4 కిమీ వద్ద ఏర్పడిన గండ్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూడ్చివేశారు.