Share News

AP TDP: లోకేష్‌కు ఆ పదవి ఇవ్వాలి.. బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్..

ABN , Publish Date - May 24 , 2024 | 12:26 PM

టీడీపీ ముఖ్య నేత బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని.. 130 స్థానాల్లో విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు.

AP TDP: లోకేష్‌కు ఆ పదవి ఇవ్వాలి.. బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్..
Buddha venkanna

విజయవాడ, మే 24: టీడీపీ ముఖ్య నేత బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని.. 130 స్థానాల్లో విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పాటు.. లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి.. నలుగురు నాలుగు దిక్కులుగా పార్టీ కోసం పని చేశారని అన్నారు. గత ఎన్నికల్లో 23 సీట్లు డీపీకి వస్తే.. పార్టీ పని అయిపోయందని, పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని బుద్దా గుర్తు చేశారు. ఈ ఐదేళ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందన్నారు. వారికి అండగా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు.


సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కూడా ఖరారు అవుతుందని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు తన ఆత్మకథను తప్పకుండా రాస్తారని చెప్పారు. అందులో బుద్దా వెంకన్న అనే వ్యక్తి కోసం తప్పకుండా ఒక పేజీ ఉంటుందన్నారు. చంద్రబాబు రాముడు అయితే.. ఆంజనేయుడిగా తాను విధేయుడిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. నా దేవుడి కోసం నా రక్తంతో కాళ్లు కడిగానని.. ప్రపంచంలోనే ఇలా ఎవరూ చేసి ఉండరంటూ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా లక్షలాది మంది అభిమానం సంపాదించారని అన్నారు.


అచ్చెన్నాయుడిపై కీలక వ్యాఖ్యలు..

ఇదే సమయంలో అచ్చెన్నాయుడిపై బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాగా పని చేశారని కొనియాడారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రి వర్గంలోకి వెళ్లనున్నారని తెలిపారు. చంద్రబాబు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. నారా లోకేష్‌ను టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. తాను తన కోసం అడగడం లేదని.. పార్టీ కోసమే లోకేష్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. నారా లోకేష్‌కు రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగిస్తే మరో 30 యేళ్లు టీడీపీకి తిరుగు ఉండదన్నారు. పసుపు జెండా రెపరెపలాడాలంటే.. లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, నారా లోకేష్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఒకేరోజు జరగాలని ఆకాంక్షించారు. బీసీ నేతగా అచ్చెన్నాయుడికి ప్రమోషన్ ఇచ్చి, కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 24 , 2024 | 12:26 PM