Atiya-Batia Association: ఆడుదాం ఆంధ్రా స్కాం రూ.100 కోట్లు
ABN , Publish Date - Jun 16 , 2024 | 04:26 AM
ఉపయోగంలేని సర్టిఫికెట్లు, నాసిరకం కిట్లు, డ్రెస్సులతో ఎన్నికల స్టంట్‌గా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో రూ.100 కోట్ల స్కాం జరిగిందని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు, ఆటియా-బాటియా అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ రంబా ప్రసాద్ ఆరోపించారు. అనంతపురం జిల్లాకు శనివారం వచ్చిన ఆయన.. ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఐదేళ్లలో క్రీడాశాఖను
నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం
జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు,
ఆటియా-బాటియా రాష్ట్ర సీఈఓ ప్రసాద్
సీఐడీ విచారణ జరిపి,
బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్
అనంతపురం క్లాక్‌టవర్, జూన్ 15: ఉపయోగంలేని సర్టిఫికెట్లు, నాసిరకం కిట్లు, డ్రెస్సులతో ఎన్నికల స్టంట్‌గా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో రూ.100 కోట్ల స్కాం జరిగిందని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు, ఆటియా-బాటియా అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ రంబా ప్రసాద్ ఆరోపించారు. అనంతపురం జిల్లాకు శనివారం వచ్చిన ఆయన.. ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. క్రీడా శాఖను సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం.. సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా అంటూ నిధులు స్వాహా చేసిందని విమర్శించారు. ఆడుదాం ఆంధ్రా మొత్తం ఒక డ్రామా అని, నిధులను కాజేసేందుకే నిర్వహించారని అన్నారు. తక్కువ ఖర్చు అయ్యే క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడాంశాలను ఎంచుకున్నారని.. కనీసం మంచినీరు, నీడ వంటి వసతులు కల్పించలేదని అన్నారు. నాసిరకం క్రీడా కిట్లు, డ్రెస్సులను ఇచ్చారని, అవీ అరకొరగానే ఇచ్చి క్రీడాకారులను మోసం చేశారని అన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని, కానీ రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారని.. ఆ నిధులను స్వాహా చేసిన క్రీడాశాఖ మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఆధారాలతో సీఐడీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. క్రీడా శాఖను నిర్వీర్యం చేయడంతో పాటు క్రీడాకారులను గత ఐదేళ్లూ కించపరిచారని మండిపడ్డారు.
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో అప్పటి మంత్రి, శాప్ చైర్మన్ అవినీతి, అక్రమాలలో డీఎ్‌సడీఓల భాగస్వామ్యం ఉందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క స్టేడియం నిర్మించని వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన స్టేడియాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేడియాలు శిథిలావస్థకు చేరినా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను తన సామాజిక వర్గానికి చెందిన క్రీడారంగంలో అనుభవం లేని వ్యక్తులతో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నింపారని విమర్శించారు. క్రీడాశాఖను బతికించేందుకు, ఆడుదాం ఆంధ్రా రూ.100 కోట్ల స్కాంను వెలికితీసేందుకు సీఐడీ వెంటనే విచారణ జరిపాలని, బాధ్యులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. సీఐడీకి ఫిర్యాదు చేసిన తనకు వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని, కానీ తాను భయపడనని, రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు.