అగ్నిమండలాల అక్షర అక్షయ ధైర్యమే పురాణపండ ‘జయ జయోస్తు’: చాగంటి కోటేశ్వర రావు
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:51 PM
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
విజయవాడ, జూన్ 12: మనసుకు, మాటకు అందని దివ్య వైభవంగా అమ్మవారి వరాలపోతల్లాంటి అద్భుత గ్రంధాలను అమోఘరీతిలో అందిస్తున్న ప్రముఖ రచయిత, చిరంజీవి పురాణపండ శ్రీనివాస్‌కి మహాసరస్వతీకటాక్షం ఉండటం వల్లనే.. మనకి కాంతిపుంజాల్లాంటి ఇన్ని గ్రంధాలు అందుతున్నాయని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు మంగళాశాసనం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవ సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవం చేయడానికి కొద్దిగంటల ముందే... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో ఆయన విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞకేంద్రం’ మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని ఆవిష్కరించారు.
చంద్రబాబునాయుడు సమర్ధతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్షేమంకరమైన ప్రజారంజకపాలన అందించాలని కోరుతూ... ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వర రావు మాట్లాడుతూ... స్వార్ధచింతన లేకుండా, సాధకులకు, భక్తులకు అవసరమైన అక్షర అక్షయ ధైర్యాలను సమృద్ధికరంగా అందించడంలో చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ అగ్రస్థానంలో ఉండటానికి ఆయన నిర్విరామ కృషి, ప్రతిభాసంపన్నతే అని అభినందించారు. ముఖ్యమంత్రి పాలనా సంతోషవేడుకకి ఇలాంటి దైవబలమున్న గ్రంధాన్ని సమర్పించిన బొల్లినేని కృష్ణయ్యను ఆశీర్వదించారు.
తొలి ప్రతులను స్వీకరించిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానముల జాయింట్ కమీషనర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ఈ గ్రంధాల్లో ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అగ్నిమండలంలా, పురాణపండ శ్రీనివాస్ ఒక్కొక్క గ్రంధమూ ఒక్కొక్క సూర్య మండలంలా తేజరిల్లుతున్నాయని చెప్పారు.
గోరంత భక్తి పొంగేవారింట కొండంత కటాక్షం వర్షించే కనకదుర్గమ్మ కారుణ్యంతో పురాణపండ శ్రీనివాస్ మరిన్ని అమృత పేటికల్ని తెలుగు భక్తులకు అందించాలని కె.ఎస్.రామారావు పేర్కొన్నారు.
రాబోయే రెండువారాల్లో ‘నారసింహో ... ఉగ్రసింహో’, ‘జయ జయోస్తు’ మంగళ గ్రంధాలను అమరావతిలోని మొత్తం ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఉచితంగా బహూకరిస్తున్నట్లు బొల్లినేని కృష్ణయ్య అనుచరులు చెప్పడం విశేషం.
ఇదిలా ఉండగా బుధవారం ఉదయమే ఈ రెండు గ్రంధాలూ ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి సుమారు ఐదువందల ప్రతులు మూడు బాక్సుల ద్వారా చేరినట్లు సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.
పరమ ఆకర్షణీయంగా పురాణపండ శ్రీనివాస్ రూపుదిద్దిన ఈ రెండు పవిత్ర సర్వోన్నత గ్రంధాల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల దైవదర్శన చిత్రాలను బొల్లినేని కృష్ణయ్య గౌరవప్రదంగా ప్రచురించడం విశేషం.
బుధవారం నుండీ శ్రావణ మాసం వరకూ అమ్మవారి ప్రత్యేక దర్శనంలో పాల్గొని ఆశీర్వచనం స్వీకరించే ప్రముఖులకు ఈ అపురూప గ్రంధాలు రెండింటినీ బహూకరిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు వివరించారు.