Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !
ABN , Publish Date - Jun 19 , 2024 | 02:54 AM
పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్’ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...
పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిన ‘రివర్స్’
ప్రజలకు వివరించి.. చట్టపరమైన చర్యలు?
చంద్రబాబు సర్కారు ఆలోచన!?
తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు
ఐదేళ్లలో 5 వేల కోట్లయినా ఖర్చుపెట్టలేదు!
పనుల్లో కేవలం 4 శాతం పురోగతి
రివర్స్ టెండరింగ్ నిర్ణయం జగన్‌దే!
దాస్, సుధాకరబాబు అమలు చేశారు
నష్టానికి బాధ్యులను గుర్తించే పనిలో కేంద్రం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్’ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి... ఆ తర్వాత అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు... పోలవరానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. డయాఫ్రం వాల్‌కు తీవ్ర నష్టం, గైడ్‌బండ్ కుంగిపోవడం.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ వంటి వాటికి బాధ్యులెవరో గుర్తించే పనిలో పడింది.
వాస్తవానికి 2019లో రివర్స్ టెండర్‌కు వెళ్లాలని జగన్ నిర్ణయించినప్పుడు కేంద్ర జలశక్తి శాఖ వద్దని చెప్పింది. పనులు జోరుగా సాగుతున్న తరుణంలో కాంట్రాక్టు సంస్థను మార్చేస్తే.. నిర్మాణం జాప్యం కావడమే కాకుండా.. అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతుందని హెచ్చరించింది. అయినా జగన్ పెడచెవిన పెట్టారు. ‘రివర్స్’ రాజకీయాలకు తెరలేపారు. జలశక్తి శాఖ హెచ్చరించిన విధంగానే.. పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టుకు నష్టాలు సంభవించాయి. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ ఇప్పుడు జల వనరుల శాఖలో సాగుతోంది.
అంతా ఆయనే చేశారు...
పోలవరం ప్రాజెక్టుపై జగన్ నిర్వాకాలను జలవనరుల శాఖ అధికారులు బట్టబయలు చేశారు. 2019 మే నుంచి 2024 మే దాకా గడచిన ఐదేళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 4,996.53 కోట్లు మాత్రమేనని సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ఇందులో రూ.2,697 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ‘కుడి కాలువ, ఎడమ కాలువ, హెడ్‌వర్క్స్‌లో గడచిన ఐదేళ్లలో పురోగతే లేదు. 2019 తర్వాత పనుల పురోగతి నాలుగు శాతానికి మించి కూడా లేదు’ అని పేర్కొన్నారు. పనుల పురోగతి లేకపోగా తిరోగమనంలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో వివిధ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లకు ఈ ఏడాది డిసెంబరు దాకా అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసే అవకాశాల్లేవని కూడా వెల్లడించారు. ఇక పోలవరం హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులను చేపట్టిన సంస్థను మార్చేయాలన్న నిర్ణయం పూర్తిగా జగన్‌దేని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు.
రివర్స్ టెండర్ నిర్ణయానికి బాధ్యులెవరని ఆయన అడిగినప్పుడు.. తాము కాదని జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, 2019 మే నెలలో ఇంజనీర్-ఇన్-చీ్‌ఫ(ఈఎన్‌సీ)గా విధులు నిర్వహిస్తున్న ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. 2019 మే నెలలో తాను జల వనరుల శాఖ బాధ్యతల్లో లేనని శశిభూషణ్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అదేశాల మేరకు అప్పటికి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రివర్స్ టెండర్ విధానాన్ని అమలు చేశారని వెల్లడించారు. ఆ సమయంలో మీరు ఈఎన్‌సీగా ఉన్నారు కదా అని వెంకటేశ్వరరావును చంద్రబాబు ప్రశ్నించగా..
తాను ఈఎన్‌సీగా ఉన్నప్పటికీ, పోలవరం బాధ్యతల నుంచి తనను తప్పించారని.. పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకరబాబుకే బాధ్యతలన్నీ కట్టబెట్టారని ఆయన వివరించారు. రివర్స్ టెండర్ విధానం అమలును ఆదిత్యనాథ్ దాస్, సుధాకరబాబు చూశారని చెప్పారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోగా.. ఆదిత్యనాథ్, సుధాకరబాబు రిటైరయ్యారని చెప్పారు. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు జల విద్యుత్కేంద్రం నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించారని తెలిపారు. 2019, 2020ల్లో గోదావరికి వచ్చిన భారీ వరదకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. గైడ్‌బండ్ కూడా కుంగిపోయిందని.. ఇందుకు కారణాలు తెలుసుకోవడానికి కేంద్రం నిజనిర్ధారణ కమిటీ వేసిందని తెలిపారు.