CM Chandrababu Naidu: వేగం పెంచేద్దాం !
ABN , Publish Date - Aug 20 , 2024 | 03:39 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తాను ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 2014-19లో తాను సీఎంగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స-ఈవోడీబీ)లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తుచేశారు.
‘ఈజ్ ఆఫ్’ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు: సీఎం
విజన్-2047 లక్ష్యంతో ముందుకు
పాతికేళ్లలో 15% వృద్ధిరేటే ధ్యేయం
పీ-4 మోడల్ తో పేదరిక నిర్మూలన
మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
నైపుణ్య గణనకు శ్రీకారం
నాటి నా సంస్కరణలు ఇప్పుడు
ఫలితాలిస్తున్నాయ్: చంద్రబాబు
శ్రీసిటీలో 15 పరిశ్రమలు ప్రారంభం
వాటి మొత్తం పెట్టుబడి 1,570 కోట్లు..
8,480 మందికి ఉద్యోగాలు
మరో 7 ఇండస్ట్రీలకు భూమిపూజ
900 కోట్లు.. 2,740 మందికి ఉపాధి
మరో ఐదింటి స్థాపనకు ఎంవోయూలు
1,213 కోట్లు.. 4,060 ఉద్యోగాలు
ఫొటోగ్రాఫర్స్.. స్మైల్ ప్లీజ్!
ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్ల చేతిలోని కెమెరా తీసుకొని క్లిక్‌మనిపిస్తున్న సీఎం చంద్రబాబు
శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్స్ మా లక్ష్యం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తాం. పారిశ్రామిక అనుకూల వాతావరణం కల్పిస్తాం. డ్రగ్స్‌ను నిర్మూలిస్తాం.
ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు భారతీయుడు. ప్రతి నలుగురు భారత ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఏపీ నుంచి ఉండడం మన రాష్ట్ర సామర్థ్యానికి నిదర్శనం.
- సీఎం చంద్రబాబు
తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తాను ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 2014-19లో తాను సీఎంగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స-ఈవోడీబీ)లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పారిశ్రామిక రంగం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (శీఘ్ర వాణిజ్యం) వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లా శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని ఆయన సందర్శించారు. అక్కడి బిజినెస్ సెంటర్‌లో 15 పరిశ్రమలను ప్రారంభించారు.
మరో ఏడు పరిశ్రమల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అలాగే ఐదు పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఆయా సంస్థల ప్రతినిధులతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం వివిధ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. విజన్-2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని.. రానున్న పాతికేళ్లలో 15 శాతం వృద్ధిరేటు సాధించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.పీ-4 మోడల్ (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్) అమలుతో పేదరికం నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
టాప్ టెన్‌లో ఉన్న వారు.. దిగువన 20 శాతం ఉన్న పేదలకు చేయూతనందించాలని పిలుపిచ్చారు. జనాభా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, అదే సమయంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టగా.. 1995లో తాను ఉమ్మడి రాష్ట్రంలో వాటిని ప్రారంభించానని తెలిపారు.
ఐటీ రంగం భారత్‌ను ప్రపంచపటంలో మేటిగా నిలబెడుతుందని ఆనాడే తాను చెప్పానని గుర్తు చేశారు. ఈరోజు వాటి ఫలితాలను అందరం చూస్తున్నామన్నారు. 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు.
8 వేల ఎకరాల్లో ఏర్పాటైన శ్రీసిటీలో ఆటోమేటివ్, ఎలకా్ట్రనిక్స్, ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఫుడ్ ప్రాసెసింగ్ తదితర 220 పరిశ్రమలు నడుస్తున్నాయన్నారు. వాటి ద్వారా 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమైన ప్రదేశమని చెప్పారు.
వేల ఉద్యోగావకాశాలు..
శ్రీసిటీలో చంద్రబాబు సోమవారం రూ.1,570 కోట్ల పెట్టుబడులతో 8,480 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే 15 పరిశ్రమలను ప్రారంభించారు. రూ.900 కోట్ల పెట్టుబడులతో 2,740 మందికి ఉపాధినిచ్చే ఏడు పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1,213 కోట్ల పెట్టుబడులతో 4,060 మందికి ఉపాధి కల్పించే ఐదు పరిశ్రమల స్థాపనకు సంబంధిత సంస్థల ప్రతినిధులతో ఎంవోయూలపై సంతకాలు చేశారు. శ్రీసిటీలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్‌నూ ప్రారంభించారు. హైటెక్ పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సీబీఎన్ అంటేనే బ్రాండ్: మంత్రి భరత్
గత సీఎం జగన్ ఒక్కసారి కూడా శ్రీసిటీని సందర్శించలేదని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ అన్నారు. దానికి భిన్నంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రీసిటీకి వచ్చారని తెలిపారు. సీబీఎన్ అంటేనే ఒక బ్రాండ్ అని అన్నారు. కార్యక్రమంలో హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మీరే ముఖ్య అతిథిగా రావాలి!
ఇసుజు కంపెనీ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల ఉత్పత్తిదారుగా మారింది. మా పరిశ్రమలో 20 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయించాం. ప్రస్తుతం లక్ష వాహనాలను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాం. ఆ కార్యక్రమానికి మీరే (చంద్రబాబు) ముఖ్య అతిథిగా రావాలని కోరుకుంటున్నాం.
- మిట్టల్, ఇసుజు ప్రతితినిధి
చంద్రబాబు స్వయంగా రావడం సంతోషకరం!
ఈ ఏడాది ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అభినందనలు. శ్రీసిటీలో పరిశ్రమల స్థాపనకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే మా దేశానికి చెందిన పలు కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. ఇప్పుడు మరింతగా మద్దతిచ్చి ప్రోత్సహించేందుకు ఆయన స్వయంగా రావడం సంతోషంగా ఉంది.
- సాడోసన్, జపనీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్
బాబు పిలుపుతో భాగస్వాములయ్యాం!
గతంలో చంద్రబాబు పిలుపుతో సన్‌రైజ్ ఏపీలో భాగస్వాములయ్యాం. 2016లో శ్రీసిటీలో ఏకంగా నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు మళ్లీ ఆయన సీఎం కావడం సంతోషంగా ఉంది.
- అజయ్, టోరే ప్రతినిధి
బాబు చొరవతో ప్రపంచ దేశాలకు డైకిన్ ఉత్పత్తులు
రాష్ట్రానికి జపాన్ కంపెనీలు రావాలని గతంలో చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన చొరవతో 2017లో డైకిన్ కంపెనీ శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటు చేసింది. తొలుత 75 ఎకరాల్లో.. తర్వాత మరో 35 ఎకరాల్లో.. ఆపై ఇంకో 200 ఎకరాలకు విస్తరించాం. ఇపుడు శ్రీసిటీ నుంచీ డైకిన్ కంపెనీ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
- నిమ్మగడ్డ కుటుంబరావు, డైకిన్ ప్రతినిధి