Public Grievances : 'విన్నపాల' పై విన్యాసాలు !
ABN , Publish Date - Dec 18 , 2024 | 03:20 AM
‘మీ రాష్ట్రంలో ప్రజాఫిర్యాదుల పరిష్కారం అప్ టూ మార్క్ (ఆశించిన స్థాయిలో) లేదంటూ ఢిల్లీలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాతో అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది
పరిష్కారంపై అధికారుల మాయ లెక్కలు
దరఖాస్తులు పరిష్కారమైనట్టుగా ఎంట్రీలు
పైస్థాయిలో ఒత్తిడి రాకుండా బుట్టదాఖలు
‘పెండింగ్’ కనిపించకుండా మేజిక్
సంతృప్త స్థాయి బాగుందంటూ నివేదికలు
కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రశ్నల వర్షం
సరైన సమాధానాలు చెప్పని అధికారులు
ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవాలు
తెలుసుకోవాలని నిపుణుల సూచన
గత వైసీపీ ప్రభుత్వ బాధితులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఎంతో ఆశతో మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. అయితే అధికార యంత్రాంగం ఆ దిశగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఫిర్యాదులను పరిష్కరించకున్నా బాధితులకు న్యాయం చేసినట్టు అధికారులు నివేదికలు పంపుతున్నారు. ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి రాకుండా తప్పించుకునేందుకు వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తీర్చకపోగా, ప్రజల్లో సంతృప్త స్థాయి బాగుందంటూ మాయ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘మీ రాష్ట్రంలో ప్రజాఫిర్యాదుల పరిష్కారం అప్ టూ మార్క్ (ఆశించిన స్థాయిలో) లేదంటూ ఢిల్లీలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాతో అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సీఎంకు వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్లు పరిష్కరించకపోతే ఎలా? వినతుల పరిష్కారం హేతుబద్ధంగా లేకపోతే ప్రజల్లో మాపై నమ్మకం సడలిపోదా’.. ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేసిన ఆందోళన ఇది. 2014-19 మధ్యకాలంలో ప్రజల వినతుల పరిష్కారం ఎలా చేశారో? ఇప్పుడూ అదేపంథా కొనసాగిస్తున్నారని ముఖ్యమంత్రి నిష్టూరమాడారు. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రజాఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఓ మిథ్యగా సాగుతోందని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పినట్లు అయిందని నిపుణులు అంటున్నారు. కేవలం కాగితాల్లోనే పరిష్కారం. అధికారులు తప్పుడు నివేదికలు. క్షేత్రస్థాయిలో మాత్రం తమ సమస్యలు తీరడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత రాకముందే ప్రభుత్వం మేల్కొనాలని తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు, బ్యూరోక్రాట్లు సూచిస్తున్నారు.
సీఎం ప్రశ్నల వర్షం
కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం నాటి బాధితుల నుంచి 1.74 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1.32 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. మొత్తం ప్రజా ఫిర్యాదుల్లో పరిష్కార శాతం 75.88. మొత్తం ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సినవి 67 వేలు. ఇప్పటికే 49,784 పరిష్కరించామని ఆ శాఖ సీఎంకు నివేదించింది. సమస్యల పరిష్కారంపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని ఆర్టీజీఎస్ అధికారి సీఎంకు నివేదించారు. ఇక్కడే అసలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మీకెలా తెలిసింది? సమస్య పరిష్కారం అయ్యాక మీరు సంబంధిత వ్యక్తులతో మాట్లాడారా? వారి అభిప్రాయం తీసుకున్నారా? అని సీఎం ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ అధికారి బదులిస్తూ.. ఈ డేటా కలెక్టర్లు ఇచ్చారంటూ వారిపై తోసేశారు. మీ శాంపిల్ సర్వే డేటా ఎక్కడిది? జిల్లాల్లో ఎవరితో మాట్లాడారు? మీరు సంప్రదించిన వారి డేటా ఉందా? అని సీఎం అడిగితే కలెక్టర్లు మౌనం దాల్చారు. తామిచ్చిన గణాంకాలను చూసి ముఖ్యమంత్రి ఓకే అంటారని, డేటాపై ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తరన్నది అధికారుల నమ్మకం కాబోలు. అందుకే వారికి తోచినట్లుగా ప్రజాఫిర్యాదుల పరిష్కారంపై గణాంకాలు వేసి ఉంటారు. సమస్యల పరిష్కారంపై ప్రజల సంతృప్తి స్థాయిని కూడా చాలా ఎక్కువ చేసి చూపించారు. ఇందుకు గ్రాఫిక్స్ జోడించారు. అయితే, సమస్యల పరిష్కారంపై ప్రజా సంతృప్త స్థాయి క్రమంగా తగ్గుతూ వస్తోందని సీఎం చంద్రబాబు బాంబు పేల్చారు. పరిష్కారం అద్భుతంగా ఉంటే సంతృప్తస్థాయి ఎందుకు తగ్గుతుంది? దీనికి అధికారులెవరూ సమాధానాలు చెప్పలేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధాన మంత్రి ఏపీలో ప్రజాఫిర్యాదుల పరిష్కారం బాగోలేదని చెప్పారు. అధికారులు మాత్రం అద్భుతంగా పరిష్కరిస్తున్నామని తప్పుడు లెక్కలతో ప్రజెంటేషన్‌లు ఇచ్చారు. పరిష్కారం చేయకున్నా చేసినట్లుగా, ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి లేని సంతృప్తి స్థాయిలను సృష్టించి ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నించారు.
గ్రామస్థాయి నుంచి సీఎం వరకు
గ్రామస్థాయి అధికారి నుంచి ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, పార్టీ కార్యాలయాల్లో ప్రజలు వినతులు అందజేస్తున్నారు. ఈ ఫిర్యాదులన్నింటినీ సంబంధిత శాఖలు, అధికారులకు పంపుతున్నారు. పరిష్కార ప్రక్రియను ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... పరిష్కరించాల్సిన అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఫిర్యాదులకు పరిష్కారం చూపినా, పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా అదే జాబితాలో చేర్చేస్తున్నారని చెబుతున్నారు.
హేతుబద్ధత ఎలా?
ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకమైనవి హేతబద్ధత, జవాబుదారీ. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునే సమయంలోనే వాటిపై వారి పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ వివరాలు తీసుకుంటే వారిని సులువుగా ట్రాక్ చేయడానికి వీలుంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వస్తున్న అన్ని ఫిర్యాదుల్లో ఆ వివరాలు ఉంటున్నాయి. వారి సమస్యలను అధికారులు నిజంగా పరిష్కరించినట్లయితే నేరుగా వారికే ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. సమస్య పరిష్కారం తర్వాత వారి అభిప్రాయాన్ని ఆడియో లేదా వీడియో రూపంలో రికార్డు చేసి నివేదిక రూపంలో ఇవ్వవచ్చు. తద్వారా అధికారులు పక్కా ఆధారాలు చూపించవచ్చు. ఇది కష్టంతో కూడుకున్న పని అయినా అధికారులు దృష్టి పెడితే చేయవ చ్చు. ప్రతీ గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి. అందులో సిబ్బందిని ఉపయోగించుకొని రీడ్రెస్సెల్ డేటాను నమోదు చేయించవచ్చు. సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని రెవెన్యూ నిపుణుడు రామయ్య అభిప్రాయపడ్డారు.
అంకెల గారడీతో బురిడీ
‘సుదీర్ఘకాలం నేను రెవెన్యూలో పనిచేశాను. అనేక చట్టాల తయారీలో, సదస్సుల నిర్వహణలో భాగస్వామిగా ఉన్నాను. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే అన్ని వినతులను రికార్డులో నమోదు చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించగలరో ఫిర్యాదుదారుకు చెప్పాలి. ఈ డేటాను ఆర్డీఓ, ఆపై కలెక్టర్, ప్రభుత్వానికి నివేదించాలి. ఇలా వచ్చిన డేటాను క్రోడీకరించి నెలకు సగటున ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయో ప్రభుత్వం అంచనా వేస్తుంది. జిల్లా స్థాయిలోనే పరిష్కారమయ్యే విన్నపాలను వెంటనే చేయాలి. రాష్ట్రస్థాయిలో అంటే.. ప్రభుత్వ స్థాయిలో సెటిల్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. జిల్లా స్థాయిలో ఎన్ని పిటిషన్‌లు వచ్చాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? వంటి విషయాలను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్, పీజీఆర్‌ఎస్ సైట్లలో పొందుపరుస్తారు. ఎక్కడ ఎక్కువ పెండింగ్ ఉంటే ఆ జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. మీ జిల్లాలో ఎందుకు ప్రజాసమస్యలు పరిష్కరించడం లేదంటూ ముఖ్యమంత్రి, సీఎస్, ఇతర అధికారులు వెంటపడతారు. ఈ ఒత్తిడి భరించలేక కొందరు అధికారులు దరఖాస్తులను పరిష్కరించినట్లుగా, బాధితులకు న్యాయం చేసినట్లుగా నివేదికలు రాసి సంబంధిత వినతి పత్రాలను బుట్టదాఖలు చేస్తారు. చంద్రబాబు ఎక్కువగా ఆన్‌లైన్ డేటా వెరిఫికేషన్‌కు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో సమస్యలు పరిష్కారం కాకపోయినా అధికారులు పరిష్కారమైనట్లుగా నివేదికలు పంపిస్తారు. అంతేగాక అసలు ఆన్ లైన్ డేటాలోనే నమోదు చేయకుండా ఉండేందుకు వినతులను తీసుకోవడం మానేస్తున్నారు. ఒకవేళ తీసుకున్నా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వం నివేదికలు చూసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామన్న భ్రమల్లో ఉంటుం ది. ప్రజలు ఏమో తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో ఉంటారు. ఇదే రానురాను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్యాప్ పెంచుతుంది’ అని రెవెన్యూ నిపుణుడు, రిటైర్డ్ అధికారి రామయ్య చెప్పారు.