Attack: మద్యం మత్తులో తహసీల్దార్ల దాడి
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:55 AM
చిత్తూరులో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు ఇన్‌ఛార్జి తహసీల్దార్లు వీధిరౌడీల్లా ప్రవర్తించి దారినపోయేవారిని భయపెట్టారు.
చిత్తూరు అర్బన్, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు ఇన్‌ఛార్జి తహసీల్దార్లు వీధిరౌడీల్లా ప్రవర్తించి దారినపోయేవారిని భయపెట్టారు. నగరం లోని ప్రభా గ్రాండ్ హోట ల్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై కృష్ణకుమార్ అనే వ్యక్తి మీద దాడి చేసి బండ బూతులు తిట్టారు. ఈ దాడిలో అతడికి గాయాలయ్యాయి. చిత్తూరులో నివాసం ఉంటున్న కృష్ణకుమార్ ఇటీవల పలమనేరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఆ ఇద్దరు తహసీల్దార్లతో కలిసి హోటల్‌లో మద్యం సేవించినట్లు సమాచారం.ఆ సందర్భంగా మాటామాట పెరిగి ఇలా దాడి చేశారనే చర్చ నడుస్తోంది. దయచేసి నన్ను వదిలేయండి సార్ అని కృష్ణకుమార్ ప్రాధేయపడుతున్నా.. చుట్టూ ఉన్నవారు నిలువరిస్తున్నా..తహసీల్దార్లు వినకుండా అతడి మీదకు వెళ్లి దాడిచేయడం చుట్టూవున్న జనాన్ని ఆశ్చర్యపరిచింది. ఓ తహసీల్దార్ సెల్ నుంచి మరో తహసీల్దార్ .....కృష్ణకుమార్‌తో మాట్లాడి కొడతామని హెచ్చరిస్తున్న కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.