Share News

New Delhi: జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా..

ABN , Publish Date - Sep 22 , 2024 | 11:30 AM

దేవ దేవుడి మేల్కొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు.. ఆగమ శాస్త్రాల నుంచి సనాతన ధర్మం వరకు.. లడ్డూ పోటు నుంచి వెంగమాంబ సత్రంలో జరిగే నిత్యాన్నదానం వరకూ తనతో జగన్ సొంత టీవీలో డిబేట్‌కు సిద్ధమా అని వల్లూరు జయప్రకాశ్ నారాయణ సవాల్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడి గెలవలగలరా అని నిలదీశారు.

New Delhi: జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా..

న్యూఢిల్లీ: తిరుమల (Tirumala) క్షేత్రంలో జరిగిన అపచారంపై బీజేపీ అధికార ప్రతినిధి (BJP Leader) వల్లూరు జయప్రకాశ్ నారాయణ (Vallur Jayaprakash Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో జరిగిన అపచారాలపై ఒక సామాన్య బీజేపీ కార్యకర్తతో చర్చకు సిద్ధమా.. అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (Ex CM Jagan) వల్లూరు జయప్రకాష్ నారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్బంగా ఆదివారం ఢిల్లీ (Delhi)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరమ పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను జంతువుల కొవ్వుతో అపవిత్రం చేయడమే కాక... బీజేపీ పెద్దలకేం తెలుసని మాట్లాడుతున్న జగన్ బీజేపీ కార్యకర్తతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సనాతన ధర్మమే ఊపిరిగా, దేశ భద్రతే ప్రాణంగా బతికేది బీజేపీ మాత్రమేనని అన్నారు. నేడు అయోధ్య, కాశీ, ఉజ్జయిని నుంచి.. ప్రపంచమంతా సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారని, ఇందుకు బీజేపీ హైందవ ధర్మం కోసం చేస్తున్న కృషే కారణమని అన్నారు.


దేవ దేవుడి మేల్కొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు.. ఆగమ శాస్త్రాల నుంచి సనాతన ధర్మం వరకు.. లడ్డూ పోటు నుంచి వెంగమాంబ సత్రంలో జరిగే నిత్యాన్నదానం వరకూ తనతో జగన్ సొంత టీవీలో డిబేట్‌కు సిద్ధమా అని వల్లూరు జయప్రకాశ్ నారాయణ అన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడి గెలవలగలరా అని నిలదీశారు. లడ్డూలను, స్వామివారి సేవలను సామాన్య భక్తులకు దూరం చేయడానికి అడ్డగోలుగా రేట్లు పెంచింది జగన్ ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. దర్శన టికెట్లను అమ్ముకున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. ఏడు కొండలపై అన్యమత ప్రచారం జగన్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. టీటీడీ టెండర్లలో అవినీతికి పాల్పడి కోట్లాది మంది భక్తులకు మనోవేదన మిగిల్చారని మండిపడ్డారు. జగన్ చేసిన పాపాలు దేవదేవుడికి తెలిసే.. ఆయన భక్తులతో మీకు ఎన్నికల్లో శిక్ష వేశారన్నారు. అయినా... ఇంకా అబద్దాలు వల్లే వేస్తూ... జగన్ పెటీఎం వందిమాగదులతో వంత ఆపాదించుకుంటున్నారని, రివర్స్ టెండర్ల పేరుతో రివర్స్ పాలన చేశారని వల్లూరు జయప్రకాశ్ నారాయణ దుయ్యబట్టారు,.


కాగా ‘‘దేశంలోనే అతి పవిత్ర క్షేత్రాల్లో తిరుమల ఒకటి. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా అక్కడ తప్పు చేసినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లడ్డూ తయారీని అపవిత్రం చేశారన్న విషయం బయటకు వచ్చిన తర్వాత దీనిపై ఏం చేయాలన్నదానిపై అందరితో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. ‘‘ప్రజల మనోభావాలు గౌరవించాలి. అదే సమయంలో శ్రీవారి ఆలయ గౌరవం పెంచాలి. మళ్లీ ఇటువంటి పాపాలు ఎవరూ చేయకుండా చూడాలి. ఇందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. తిరుమల లడ్డూకు వందల ఏళ్ల ప్రాశస్త్యం ఉందని, దానిని గత పాలకులు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రసాదం లడ్డూను కాపీ కొట్టి తయారు చేయాలని అనేకమంది ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ అది సాధ్యపడలేదు. ఆ లడ్డూ తయారీ ఫార్ములా... అందులో వాడే పదార్థాలను కలపడంపై ఆ ఆలయంలో అత్యంత నైపుణ్యం సంపాదించారు. నేను అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ బిహార్‌కు చెందిన ఒక ధర్మకర్త కలిశారు. అయోధ్యలో తిరుమల తరహా లడ్డూ ప్రసాదాన్ని పెట్టాలని తిరుపతి నుంచి అనుభవం ఉన్నవారిని తీసుకువెళ్లి ప్రయత్నం చేశానని, కానీ ఆ రుచి రాలేదని ఆయన చెప్పారు. గతంలో ఇంట్లో తిరుమల ప్రసాదం ఉంచితే ఇల్లంతా ఘుమఘుమలాడేది. అంత ప్రాశస్త్యం వీళ్ల వల్ల నాశనం అయింది. ఏమిటీ దుర్మార్గం అని మనసు చివుక్కుమంటోంది. ఆవేశం, బాధ కలుగుతున్నాయి. మన ప్రజలు....బాబాయిని కిరాతకంగా చంపినా భరించారు. ఆ రోజే తిరుగుబాటు జరిగి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. నెయ్యికి రివర్స్‌ టెండరింగ్‌ ఏమిటి? కిలో నెయ్యి రూ.320కి ఎలా వస్తుంది? కనీస ఆలోచన అక్కర్లేదా? ఇవి చేయాలని దేముడు చెప్పాడా’ అని ప్రశ్నించారు.

Updated Date - Sep 22 , 2024 | 11:30 AM