Market: ఊరిస్తున్న ఛైర్మన్ పోస్టులు
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:24 AM
మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది.మార్కెట్ కమిటీల ఛైర్మన్ల కోసం జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలందాయి.
చిత్తూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం విడతల వారీగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది.మార్కెట్ కమిటీల ఛైర్మన్ల కోసం జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలందాయి. జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు.. ఇలా అన్ని వర్గాలు ఉండేలా రూల్ ఆఫ్ రిజర్వేషన్లను నిర్ణయించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. దీంతో ఇప్పటివరకు విడుదల చేసిన నామినేటెడ్ జాబితాల్లో పేర్లు లేనివారంతా ఈ ఛైర్మన్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పుంగనూరు, సోమల, రొంపిచెర్ల, పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం, కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం, చిత్తూరు, నగరి ప్రాంతాల్లో మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో జిల్లా విభజన తర్వాత రొంపిచెర్ల, ఎస్‌ఆర్‌పురం మార్కెట్ కమిటీలను గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసింది.
ఫ పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం మూడు కమిటీలున్నాయి. 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ఇన్‌ఛార్జి వెంకటరమణరాజు పుంగనూరు కమిటీకి ఎవరి పేర్లనూ ప్రభుత్వానికి సిఫార్సు చేయకపోవడంతో ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. సోమల కమిటీ ఛైర్మన్‌గా సదుం మండలానికి చెందిన రసూల్‌బాషా, ప్రభునాథరెడ్డి పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వం రొంపిచెర్ల కమిటీని కొత్తగా ఏర్పాటుచేసి, తమ పార్టీ నాయకుల్ని ఛైర్మన్లుగా నియమించుకుంది. ప్రస్తుతానికి పుంగనూరు కమిటీ ఛైర్మన్‌గా సమీపతి పేరు ఖరారైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో కుప్పం మార్కెట్ కమిటీ ఒకటే ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో సత్యేంద్రశేఖర్, గుడుపల్లె మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ ఛైర్మన్లుగా పనిచేశారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ ప్రయత్నిస్తున్నారు.వీరితో పాటు గుడుపల్లె మాజీ ఎంపీపీ, వన్నియకుల క్షత్రియ నేత జీఎం రాజు, యువనేత చెక్కునత్తం మణితో పాటు సుమారు పదిమంది పోటీ పడుతున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో కూడా పలమనేరు కమిటీ ఒకటే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీనివాసులురెడ్డి, హేమంత్‌రెడ్డి, రామచంద్ర నాయుడు ఛైర్మన్లుగా పనిచేశారు. ఒకవేళ ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయిస్తే పలమనేరు పట్టణ జనరల్ సెక్రటరీ గిరిబాబుకు, ఓసీ అయితే మళ్లీ వి.కోట మండలానికి చెందిన రామచంద్ర నాయుడికి అవకాశం ఉండొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
జీడీనెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం కమిటీలుండగా.. ఎస్‌ఆర్‌పురం వైసీపీ హయాంలో కొత్తగా ఏర్పడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెనుమూరు కమిటీ ఛైర్మన్‌గా మోహన్ నాయుడు పనిచేశారు. ఎస్‌ఆర్‌పురం కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే థామ్‌సకు సన్నిహితుడు, టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండయ్య పేరును ఎమ్మెల్యే ఖరారు చేసినట్లు వినిపిస్తోంది. పెనుమూరు కమిటీ ఛైర్మన్‌గా జీడీనెల్లూరుకు చెందిన సెల్‌కాన్ మొబైల్స్ ఎండీ అన్న కృష్ణమ నాయుడి పేరు వినిపిస్తోంది.
చిత్తూరు నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలోని కమిటీ ఒకటే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాపాక్షి మోహన్ సుదీర్ఘకాలం పాటు పనిచేయగా, కాజూరు బాలాజీ చివర్లో కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కమ్మ వర్గానికి, చుడా ఛైర్మన్ పదవి బలిజ వర్గానికి కేటాయించడంతో పాటు వన్నియకుల క్షత్రియ ఛైర్మన్ పోస్టు కూడా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికే దక్కింది. ఈ క్రమంలో చిత్తూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టు ఈసారి బీసీ వర్గాలకు దక్కుతుందనే చర్చ జరుగుతోంది. మాపాక్షికి చెందిన వెంకటేష్ యాదవ్‌కు ఎమ్మెల్యే మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొందరు నేరుగా అధిష్ఠాన వర్గాలతో ప్రయత్నం చేసుకుంటున్నట్లు సమాచారం.
పూతలపట్టు నియోజకవర్గానికి బంగారుపాళ్యంలో ఓ కమిటీ ఉంది. టీడీపీ హయాంలో బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెకు చెందిన ఎన్‌పీ జయచంద్ర నాయుడు ఐదేళ్ల పాటు ఛైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం తవణంపల్లె, బంగారుపాళ్యం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పోటీపడుతున్నారు.
నగరి నియోజకవర్గంలో నగరి, పుత్తూరు కమిటీలుండగా.. పుత్తూరు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళుతుంది.2014-19మధ్యకాలం లో అప్పటి టీడీపీ ఇన్‌ఛార్జి,ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు ఎవర్నీ సిఫార్సు చేయకపోవడంతో ఛైర్మన్ పోస్టు భర్తీ చేయలేదు.