Share News

Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

ABN , Publish Date - Jun 26 , 2024 | 07:18 AM

చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన బస చేసిన కుప్పం ఆర్‌అండ్‌బి అతిథి గృహము వద్ద ఉదయం 10.30 గంటలకు ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.

Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) కుప్పంలో (Kuppam) బుధవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన బస చేసిన కుప్పం ఆర్‌అండ్‌బి అతిథి గృహము (R&B Guest House) వద్ద ఉదయం 10.30 గంటలకు ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల (PES Medical College) సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.10 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళతారు.


రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వచ్చారు. భారీవర్షం కురుస్తున్నా.. కుప్పం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశమిచ్చామని.. 164 మంది కూటమి అభ్యర్థులను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని తెలిపారు. వైసీపీ ఉంటే తమకు భవిష్యత్‌ ఉండదని వారు భయపడ్డారని చెప్పారు. కొత్త కేబినెట్‌లో 8 మంది బీసీలకు మంత్రులుగా స్థానం కల్పించామన్నారు. ప్రమాణం చేసిన వెంటనే పోలవరం, అమరావతిని సందర్శించానని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 5 హామీలపై సంతకం చేశానన్నారు. ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి, నాసిరకం మద్యం అమ్మకాలు, భూగర్భ ఖనిజాల వంటి 7 అంశాలపై త్వరలో శ్వేతపత్రాలను విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులకు పింఛన్లను ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. రూ.4 వేలకు పెంచిన పింఛన్‌ మొత్తాన్ని ఒకటో తేదీనే ఇంటికొచ్చి ఇస్తామన్నారు. ‘ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజలు తోడు ఉండాలి. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు మోసం. ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. మీ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలపై జగన్‌ ఫొటో తీసేసి, మళ్లీ రాజముద్రతో పంపిణీ చేస్తాం. త్వరలో 283 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం’ అని వివరించారు.


ఏడాదిలోగా కుప్పానికి హంద్రీనీవా జలాలు

సొంత నియోజకవర్గానికి సీఎం అనేక హామీలిచ్చారు. ఏడాదిలోగా నియోజకవర్గానికి హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా నీళ్లు తెస్తానన్నారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతాను. నేను మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. 8 సార్లు కుప్పం నుంచే గెలిపించారు. వచ్చే ఐదేళ్లలో వారి రుణం తీర్చుకుంటా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసం వచ్చాను. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ, రింగు రోడ్డు, కార్గో విమానాశ్రయం, కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తా’ అని తెలిపారు.


సీఎంకు ఘనస్వాగతం..

ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో కుప్పం వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు జనం పోటెత్తారు. పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీలో హెలిప్యాడ్‌ వద్ద జిల్లా నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయల్దేరి శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న తన ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. అదే మండలం జల్లిగానిపల్లె, చిన్నారిదొడ్డి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి కుప్పం వస్తుండగా తుమ్మిసి రోడ్డు వద్ద చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయన కాన్వాయ్‌ ఆపి వాహనంలో నుంచి దిగి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.


రాజధానికి డ్వాక్రా మహిళల భారీ విరాళం

రాజధానినిర్మాణానికి చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల్లోని 4.30 లక్షల మంది మహిళల తరఫున సీఎం చంద్రబాబుకు రూ.4.50 కోట్ల మెగా చెక్కును అందించారు. అలాగే రాజధాని కోసం ఆనందరెడ్డి రూ.5 లక్షలు, కిరణ్‌కుమార్‌ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Jagan: శరణు... శరణు!

మోయలేనంత భారముంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 26 , 2024 | 09:38 AM