Share News

Pension: సర్వర్‌ మొరాయించినా..!

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:36 AM

జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణ శుక్రవారం ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. అయితే 8.30 గంటలకు సర్వర్‌లో సాంకేతిక సమస్య మొదలవగా, దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిష్కారమైంది.

Pension: సర్వర్‌ మొరాయించినా..!
తిరుచానూరులో వితంతుపింఛను పంపిణీ చేస్తున్న డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు

రాష్ట్రంలో మూడో స్థానం

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణ శుక్రవారం ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. అయితే 8.30 గంటలకు సర్వర్‌లో సాంకేతిక సమస్య మొదలవగా, దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిష్కారమైంది. దీంతో యథావిధిగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక వైపు దీపావళి.. మరోవైపు సర్వర్‌ మొరాయించినా సాయంత్రానికి 2,56,029మందికి (96.44 శాతం) పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో తిరుపతి జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. దాదాపు రూ.108.33 కోట్ల పింఛన్లను పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. మిగిలిన మూడు శాతం శనివారం పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. ఈ పింఛన్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్తూరులో 93 శాతం పంపిణీ

చిత్తూరు సెంట్రల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా తొలిరోజైన శుక్రవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను 93 శాతం పంపిణీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చిత్తూరు 12వ డివిజన్‌లోని 190 రామాపురంలో లబ్ధిదారులకు పింఛను సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అవ్వాతాతలకు పింఛన్లు భారీగా పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. జిల్లాలో 2,67,583 మంది లబ్ధిదారులుంటే, తొలి రోజున 2,50,304 మంది (93.54శాతం)కి గ్రామ, వార్డు సచివాయల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.


అంతకుముందు మంత్రికి కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, మేయర్‌ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్‌ కఠారి హేమలత, జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు, కమిషనర్‌ నరసింహప్రసాద్‌, నాయకులు వసంతకుమార్‌, బాలాజీ, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:36 AM