Share News

Suspension: గాలేరు-నగరి ఈఈ సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:55 AM

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి తిరుపతి ఎఫ్‌ఏసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ)గా వ్యవహరిస్తున్న సీహెచ్‌ హరిబాబును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Suspension: గాలేరు-నగరి ఈఈ సస్పెన్షన్‌

తిరుపతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి తిరుపతి ఎఫ్‌ఏసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ)గా వ్యవహరిస్తున్న సీహెచ్‌ హరిబాబును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేత ఆదాల ప్రభాకర రెడ్డికి చెందిన నిర్మాణ కంపెనీకి.. నిబంధనలు ఉల్లంఘించి బ్యాంకు గ్యారెంటీ విడుదల చేసిన కారణంగా ఆయనపై వేటుపడింది. ఈ పథకం కింద కడప జిల్లా నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కాలువ తవ్వాల్సి ఉంది. శేషాచల పర్వతాలు అడ్డుగా ఉన్నందున టన్నెల్‌ కూడా తవ్వాలి. ఈ పనుల ఇన్వెస్టిగేషన్‌, డిజైన్లతో పాటు మెయిన్‌ కెనాల్‌ 245వ కిలోమీటరు నుంచి 262.1వ కిమీ వరకు కాలువ తవ్వకం.. అలాగే 262.1వ కిమీ నుంచి 272.8వ కిమీ వరకూ బాలాజీ టన్నెల్‌-2 తవ్వకం, లైనింగ్‌ పనులకు 2007-08లో నాటి ప్రభుత్వం జలయజ్ఞం కింద టెండర్లు పిలిచింది. ఆదాల ప్రభాకరరెడ్డికి చెందిన ఏపీఆర్‌సీఎల్‌-సీఆర్‌ఎ్‌సఎ్‌సజీ (జేవీ) హైదరాబాద్‌ కంపెనీకి టెండర్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం ఆ కంపెనీకి మొబిలైజేషన్‌ అడ్వాన్సు కూడా చెల్లించింది. ఆ పనులకు సంబంధించి ఆ కంపెనీ రూ.1.36 కోట్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. ఎంతకాలమైనా పనులు చేపట్టలేదు. దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు కంపెనీకి నోటీసులు జారీ చేశారు. అడ్వాన్సు తీసుకుని కూడా పనులు చేపట్టనందున తీసుకున్న అడ్వాన్సు మొత్తాన్ని ప్రభుత్వానికి వాపస్‌ చేయాలని నోటీసుల్లో కోరారు. దీనికి ప్రతిగా కంపెనీ ప్రతినిధులు తమకు సకాలంలో అవసరమైన అనుమతులు, ఆమోదాలు ఇవ్వలేదని, దానివల్ల పనులు చేపట్టలేకపోయామని సమాధానమిచ్చారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సుతో మెషినరీ కొనుగోలు చేశామని, పనులు లేక వాటిని ఖాళీగా పెట్టినందున తామే నష్టపోయామని అందులో పేర్కొన్నారు.


అడ్వాన్సు నిధులు పోనూ ప్రభుత్వమే తమకు అదనంగా సుమారు రూ.91 లక్షలు చెల్లించాలని క్లెయిమ్‌ చేశారు. అప్పటి నుంచి ఆ వివాదం పెండింగులో ఉంది. కరోనా సమయంలో కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాకీలేవైనా ఉంటే వాటికి సరిపడా మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉంచుకుని మిగిలిన గ్యారంటీలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికనుగుణంగా ఆదాల కంపెనీకి కూడా గాలేరు-నగరి ప్రాజెక్టు ఎస్‌ఈ, ఈఈ నోటీసులిచ్చారు.అడ్వాన్సు వెనక్కి చెల్లించి బ్యాంకు గ్యారంటీ వాపస్‌ తీసుకోవాలని కోరారు. ఆ అధికారులు నిబంధనల ప్రకారం నిక్కచ్చిగా వ్యవహరించడంతో 2022-23లో వారిపై బదిలీ వేటు పడింది. ఆ స్థానంలో హరిబాబును ఎఫ్‌ఏసీ ఈఈగా నియమించారు. ఆయన వచ్చీ రాగానే ఆదాల కంపెనీకి ప్రభుత్వమే బాకీ పడిందని పేర్కొంటూ కంపెనీకి బ్యాంకు గ్యారెంటీని రిలీజ్‌ చేసేశారు. ఫలితంగా ప్రభుత్వం చెల్లించిన మొబిలైజేషన్‌ అడ్వాన్సును ఎలా వెనక్కి రాబట్టాలో అంతుబట్టక ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు గ్యారంటీలను విడుదల చేసిన హరిబాబుపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఆ క్రమంలో అతడిని సస్పెండ్‌ చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సీఎస్‌ సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Dec 24 , 2024 | 12:55 AM