Share News

Sand: ఆగని ఇసుక అక్రమాలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:39 AM

వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను లద్దిగం గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన ఆదివారం చౌడేపల్లె మండలంలో జరిగింది.

Sand: ఆగని ఇసుక  అక్రమాలు
నదిని తలపిస్తున్న లద్దిగం చెరువు - ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

అడ్డుకున్న గ్రామస్తులు

చౌడేపల్లె, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను లద్దిగం గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన ఆదివారం చౌడేపల్లె మండలంలో జరిగింది. చౌడేపల్లె, పుంగనూరు మండ లాల్లో అతిపెద్ద చెరువుల్లో లద్దిగం చెరువు కూడా ఒకటి. మొత్తం 750 ఎకరా (చౌడేపల్లె మండలంలో 500, పుంగనూరు మండలంలో 250 ఎకరా)ల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు ఆయకట్టు కింద లద్దిగం, బండ్లపల్లె, కొత్తపల్లె, తిర్ణింపల్లె, మలసముద్రం, అంకుతోటపల్లె, పుదిపట్ల గ్రామాలకుచెందిన సుమారు వెయ్యి ఎకరాలపైనే ఆయకట్టు భూములను రైతులు సాగు చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చేస్తోంది వైసీపీ వారే..

గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను కొన్నేళ్లుగా ఈ చెరువులో తవ్వేసి.. తరలించి.. కోట్లు గడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టీడీపీ నాయకుల అండతో నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలు ఆపలేదు. గత ప్రభుత్వంలో నోరు తెరవడానికి కూడా భయపడిన మేము.. ప్రస్తుతం ధైర్యం చేసి, తవ్వకాలను అడ్డుకున్నాం. మమ్మల్ని చూసి అక్కడ పనిచేస్తున్న వారు యంత్రాలను వదిలి వెళ్లిపోయారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

చెరువులో సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు వరకు మ

ట్టిని తవ్వేసి.. ఇసుక తీసేస్తున్నారు. నదిని తలపించేలా తవ్వేయడం వల్ల చెరువు రూపు కోల్పోవటంతోపాటు, భూగర్భ జలాలూ అడుగంటిపోతున్నాయి. దీనిపై గతంలో, ప్రస్తుతం ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మా చెరువును రక్షించుకోవాలన్న ఉద్దేశంతో తవ్వకాలను అడ్డుకున్నాం. కలెక్టర్‌ స్పందించి తవ్వకాలు జరగకుండా చేసి, చెరువును బాగు చేయించాలి.

ఐదు ఎక్స్‌కవేటర్లు, టిప్పర్‌ సీజ్‌

తహసీల్దార్‌ హనుమంతును వివరణ కోరగా.. చెరువులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలియగానే తమ సిబ్బందితో వెళ్లి అక్కడున్న ఐదు ఎక్స్‌కవేటర్లు, ఓ టిప్పర్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. పుంగనూరు రూరల్‌ సీఐ రాంభూపాల్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి పనులను ఆపించామన్నారు. అలాగే తహసీల్దార్‌ ఆదేశాలతో పనులు జరగకుండా తమ సిబ్బందిని అక్కడే బందోబస్తు పెట్టినట్లు వివరించారు.


ఇసుకాసురులపై కన్నెర్ర

యంత్రాలతో తవ్వినా, అక్రమంగా తరలించినా కేసుల నమోదు

చిత్తూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుకాసురులపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కన్నెర్ర చేశారు. ఇసుకను స్మగ్లింగ్‌ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో గుర్తించిన ఇసుక పాయింట్లలో యంత్రాలతో తవ్వుతున్నట్లు తెలిసినా, అక్రమంగా తరలిస్తున్నా.. పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తున్నారు. జీడీనెల్లూరు మండలంలో ఇటీవల యంత్రాలతో ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నారని తెలుసుకున్న అధికారులు దాడులు చేసి.. మిషనరీని సీజ్‌ చేశారు. శుక్రవారం గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం గ్రామంలో 22 ట్రాక్టర్ల మేర ఇసుకను డంప్‌ చేసి ఉండగా.. మైన్స్‌ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఎందుకంటే.. : రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్క ఇసుక రీచ్‌ కూడా లేనివి ఏడు జిల్లాలుండగా.. అందులో చిత్తూరు కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అప్పటికే స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉన్న ఇసుకను రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేసి సామాన్యులకు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు రూరల్‌ మండలంలోని దిగువమాసపల్లె, పాలూరు, గంగవరం మండలంలోని బైరెడ్డిపల్లె క్రాస్‌ ప్రాంతాల్లో ఇసుక స్టాక్‌ పాయింట్లు ఉండగా.. కొత్త ఇసుక పాలసీ పేరుతో పంపిణీ ప్రారంభించారు. ఈ స్టాక్‌ పాయింట్లలో ఇసుక అయిపోయాక.. అధికారులు మిన్నకుండిపోయారు. తర్వాత 20 మండలాల్లోని 45 ప్రాంతాల్లో ఇసుక పాయింట్లను గుర్తించారు. ఈ ప్రాంతాల నుంచి అవసరాలున్న ప్రజలు యంత్రాలు వాడకుండా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. ఈ పాయింట్లలోనే కాకుండా మరే ఇతర వాగులు, వంకల్లో ఇసుక లభించినా మనుషుల సాయంతో ఇసుకను తీసుకుని వెళ్లవచ్చు. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజల్ని ఆపి ఇబ్బంది పెట్టకూడదని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు.

కఠినంగా ఉంటాం: సుమిత్‌కుమార్‌, కలెక్టర్‌

ఇసుకను తవ్వుకునేందుకు యంత్రాలను వాడకూడదు.. నిల్వ ఉంచకూడదు.. అనేది ఉచిత ఇసుక పాలసీలో ప్రధానాంశం. దాన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. యంత్రాలు వాడుతున్నా, నిల్వ ఉంచినా వెంటనే దాడులు చేసి కేసులు పెట్టేస్తాం. ఇసుక నిజంగా అవసరమైనవారు ఆయా ప్రాంతాల నుంచి ఉచితంగా తీసుకెళ్లండి. ఎవ్వరూ అడ్డుకోరు.

Updated Date - Oct 21 , 2024 | 01:39 AM