Pawan: ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు నేడు పవన్ రాక
ABN , Publish Date - Oct 01 , 2024 | 01:47 AM
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. దీక్ష విరమణకుగాను మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నారు.
3న తిరుపతిలో వారాహి సభ
తిరుపతి, ఆంధ్రజ్యోతి/తిరుపతి అర్బన్/తిరుపతి (కలెక్టరేట్): తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. దీక్ష విరమణకుగాను మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నారు. సాయంత్రం 4గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి.. అక్కడ్నుంచి రోడ్డు మార్గాన అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి నడక మార్గం గుండా తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించి గెస్ట్‌హౌ్‌సకు చేరుకుంటారు. తిరిగి గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అనంతరం రాత్రి 8.30గంటలకు విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు తిరుగుపయనం అవుతారని కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీక్ష విరమించేందుకు వస్తున్న పవన్ మూడు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పూలే కూడలిలో వారాహి సభ!
పవన్‌కల్యాణ్ వారాహి సభ నిర్వహణ కోసం జ్యోతిరావు పూలే విగ్రహ కూడలిని ఖరారు చేసినట్లు తెలిసింది. తొలుత దీంతో పాటు లీలామహల్, అన్నమయ్య కూడళ్లను ఎంపిక చేశారు. సోమవారం ఈ మూడింటిని పరిశీలించిన జనసేన నేతలు,పోలీసులు ట్రాఫిక్ సమస్య, ప్రయాణికుల ఇబ్బందులు ఉండని, ఎక్కువ మంది గుమికూడేందుకు అవకాశం ఉన్న పూలే విగ్రహ కూడలిని ఎంపిక చేసినట్లు సమాచారం. వారాహిసభ గురువారం సాయంత్రం 5నుంచి 7.30 గంటల వరకు కొనసాగనుంది. సభాస్థలిని పరిశీలించినవారిలో రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ ఛైర్మన్ కేకే శ్రీనివాస్, జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఆరణి శివ, పవన్, బాలాజీ తదితరులతో పాటు వెస్ట్ సీఐ రామకృష్ణ ఉన్నారు.