Share News

Panchayat: పల్లె పండుగకు రూ.71.2 కోట్ల మంజూరు

ABN , Publish Date - Oct 12 , 2024 | 01:49 AM

వైసీపీ పాలనలో పంచాయతీలకు పైసా విదల్చకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో పల్లెల ప్రగతి మరుగున పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Panchayat: పల్లె పండుగకు రూ.71.2 కోట్ల మంజూరు
పంచాయతీ కార్యాలయం

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 11: వైసీపీ పాలనలో పంచాయతీలకు పైసా విదల్చకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో పల్లెల ప్రగతి మరుగున పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా పల్లెపండుగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పండుగ వాతావరణంలో శంకుస్థాపనలు చేసి, 2025 ఏడాది జనవరి నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురు, శుక్రవారాల్లో డీపీవో లక్ష్మి సెట్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు మార్గదర్శకాలు జారీచేశారు. రూ.71.2 కోట్లతో 584 పనులు చేపడుతున్నామని డ్వామా పీడీ రవికుమార్‌ తెలిపారు.

మారనున్న రూపురేఖలు

తొలిదశలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీలు, రహదారులు, డ్రెయిన్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తగా మంజూరైన గోకులాలు, పంటకుంటలు తదితర పనులు కూడా పట్టాలెక్కనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్‌ పనులను కూడా చేపట్టనున్నారు.


గ్రామ సభల నిర్ణయాలతో..

జిల్లావ్యాప్తంగా 697 పంచాయతీల్లో గతనెల 14న నిర్వహించిన గ్రామ సభల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, స్థానికుల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. వచ్చిన వినతులు, అర్జీలపై చర్చించిన అనంతరం ప్రాధాన్యతా క్రమంలో కొన్ని పనులకు పాలకవర్గ సమావేశాల ద్వారా తీర్మానాలు చేశారు. ఉపాధి హామి మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనుల ఆధారంగా జిల్లాలో 584 పనులకు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం ఆమోదముద్ర వేసి రూ.71.2 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను వారం వ్యవధిలో ప్రారంభించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Updated Date - Oct 12 , 2024 | 01:49 AM