Funds: సార్.. నిధులు కావాలి!
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:20 AM
జిల్లాలో అత్యవసరంగా చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక ఇతర అంశాలపై జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఎదుట ప్రతిపాదనలు ఉంచబోతోది.
తిరుపతి, ఆంధ్రజ్యోతి: జిల్లాలో అత్యవసరంగా చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక ఇతర అంశాలపై జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఎదుట ప్రతిపాదనలు ఉంచబోతోది. నేడు, రేపు విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో వీటిని ప్రస్తావించనుంది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తాను తయారు చేసుకున్న ప్రతిపాదనల జాబితాతో విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం ఎదుట కలెక్టర్ ప్రస్తావించనున్న అంశాలకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.
పరిశ్రమల కోసం 7 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్
జిల్లాకు వరంగా మారిన చెన్నై-వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్, కృష్ణపట్న పోర్టు, సాగరమాల వంటి ప్రాజెక్టులను అనుకూలంగా మార్చుకుని పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగం భావిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు కీలకమైన భూముల విషయంలో ఇప్పటికే 7 వేల ఎకరాలను గుర్తించి ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు పరిశ్రమలను కేటాయించాలని కలెక్టర్ కోరనున్నారు.
దెబ్బతిన్న రోడ్లకు రూ.900 కోట్లు
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రహదారుల నిర్వహణను విస్మరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ రహదారుల మొదలు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, చివరకు గ్రామీణ రోడ్లూ దారుణంగా దెబ్బతిన్నాయి. కనీసం గోతులనూ పూడ్చలేదు. భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నదులు, వాగులపై వంతెనలు కూలిపోయాయి. వాటిని ఇప్పటి వరకూ పునరుద్ధరించలేదు. వీటికి తొలి ప్రాధాన్యమిచ్చిన కలెక్టర్.. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖల నుంచీ సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయించారు. ఆ ప్రకారం దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ.900 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నిధులను కేటాయించాలని కోరనున్నారు.
బాలాజీ, ఆల్తూరుపాడు రిజర్వాయర్ల నిర్మాణం అవసరం
జిల్లాకు సాగునీరు తెచ్చే ఏ ప్రాజెక్టులైనా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. ఉదాహరణకు కండలేరు నుంచే తెలుగు గంగ, స్వర్ణముఖి-సోమశిల కాలువల ద్వారా సాగునీరు జిల్లాకు వస్తోంది. తిరుపతి, తిరుమల ప్రజలు, యాత్రికుల తాగునీటి అవసరాలకూ కండలేరు రిజర్వాయర్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అందుకనే రేణిగుంట మండలంలో శేషాచల పర్వత పాద భాగంలో ప్రతిపాదిత బాలాజీ... డక్కిలి మండలంలో ప్రతిపాదిత ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ను తక్షణం నిర్మించాల్సిన అవసరముందని యంత్రాంగం భావిస్తోంది. ఇరిగేషన్ శాఖ రూపొందించిన అంచనాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రూ. 8 కోట్లు
నేలపట్టు పక్షుల అభయారణ్యం కేంద్రంగా దొరవారిసత్రంలో ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఏటా జనవరిలో జరిగేది. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచీ పర్యాటకులు, ప్రకృతి.. పక్షి ప్రేమికులు తరలివచ్చేవారు. గత ప్రభుత్వం ఈ ఉత్సవ నిర్వహణపై నిర్లక్ష్యం చూపడంతో నిధులు రాక ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగిపోయింది. తాజాగా దీనిపై దృష్టి పెట్టిన కలెక్టర్ వచ్చే నెలలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు రూ.8 కోట్లు కేటాయించాలని యంత్రాంగం ప్రతిపాదించింది.
కేంద్ర ప్రాజెక్టులపైనా సీఎంకు నివేదిక
వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, సాగరమాల ప్రాజెక్టు, పీలేరు-తిరుపతి ఫోర్ లేన్ రోడ్డు, రేణిగుంట-చెన్నై ఫోర్ లేన్ రోడ్డు వంటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరును సీఎంకు వివరించనున్నారు. వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించనున్నారు.