Share News

Accident: నా బిడ్డను ఆదుకోండి

ABN , Publish Date - Sep 20 , 2024 | 02:27 AM

చేతికొచ్చిన కొడుకు. సర్కారు కొలువు. జీవితం సెటిల్‌ అయిపోయిందనుకునేలోపే అంతా తారుమారైంది. అప్పటివరకు ఆనందంగా సాగిన ఆ కుటుంబ తలరాత ఒక్క యాక్సిడెంట్‌తో తలకిందులైపోయింది. మంచంమీదున్న బిడ్డను చూసుకుంటూ, అతను కన్న భవిష్యత్తును తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు కుమిలికుమిలి విలపిస్తున్నారు.

Accident: నా బిడ్డను ఆదుకోండి
బిడ్డ ఆలనా పాలన చూస్తూ కుమిలిపోతున్న తల్లి - దత్తాత్రేయ (ఫైల్‌ ఫొటో)

8 నెలలుగా కోమాలోనే దత్తాత్రేయ

జీతభత్యాలను నిలిపేసిన వైసీపీ సర్కార్‌

తలకిందులైన బంగారు భవిష్యత్‌

కుమిలిపోతున్న తల్లిదండ్రులు

తిరుపతి, ఆంధ్రజ్యోతి : చంద్రగిరి నియోజకవర్గం మల్లంగుంట రోడ్డు ఉత్తరపు కండ్రిగలోని లక్ష్మి, ఎల్లయ్య దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు దత్తాత్రేయ. ఇతడి తండ్రి తిరుపతి మున్సిపల్‌ కూరగాయల మార్కెట్లో చిన్న కిరాణ షాపు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కామచిన్నయపల్లి సచివాలయంలో దత్తాత్రేయ వెల్ఫేర్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల నిర్వహణకోసం జెండాలు, ఫ్లెక్సీలు తీసుకుని గతేడాది డిసెంబరు 23వ తేది ఉదయం 7.30 ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ఈయన బయలుదేరారు. చంద్రగిరి ఫ్లైఓవర్‌ (చెర్లోపల్లె) వద్ద యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఏటీఎంలో నగదు నింపే వాహనం నిర్లక్ష్యంగా మలుపు తిప్పడంతో దత్తాత్రేయ వెళుతున్న ద్విచక్రవాహనానికి తగిలింది. హెల్మెట్‌ వేసుకున్నప్పటికీ ఆయన తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రుయాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. అంబులెన్స్‌లో చెన్నైకు తీసుకెళుతుండగా దారిలోనే పరిస్థితి విషమించింది. దీంతో వేలూరు సీఎంసీకి వెళ్లారు. తలకు సంక్లిష్టమైన పెద్ద ఆపరేషన్‌ చేశారు. 15రోజులు అక్కడే ఉంచుకుని, పోస్ట్‌ ఆపరేటివ్‌ చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లమన్నారు. మూడునెలలు ఆస్పత్రిలోనే వైద్యం చేసుకున్నారు. దెబ్బ బలంగా తగలడంతో కోమాలోకి వెళ్లారు. ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి రూ.50 లక్షల ఖర్చు పెట్టారు. అయినా అచేతన స్థితిలోనే దత్తాత్రేయ ఉన్నారు. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు. నెలనెలా ఆస్పత్రికి వెళ్లేందుకు, మందులు కొనసాగించేందుకు కూడా వీరికి కష్టంగా మారింది.


దత్తాత్రేయ చదువులో ముందుండేవారు. ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కు శిక్షణ తీసుకోవాలని భావించారు. ఇంతలో సచివాలయ ఉద్యోగానికి ఎంపికకావడంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు. అతనొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. యాక్సిడెంట్‌కు గురికావడంతో మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది.

గతంలో సీఎం హోదాలో జగన్మోహన్‌ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసేవాళ్లకు సచివాలయ ఉద్యోగి అయిన దత్తాత్రేయ మార్గదర్శకుడిగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయనే విధివంచితుడై సహాయం కోసం అచేతనంగా ఎదురు చూస్తున్నారు.

విధి నిర్వహణలో ప్రమాదం జరిగినప్పటికీ డిసెంబరు నుంచి జీతభత్యాలు ఆపేశారు. ఆర్థిక సహకారం అందలేదు. కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారు. సహచర ఉద్యోగులు మానవతాదృక్పథంతో తలాచేయి వేశారు కానీ అప్పటి జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని దత్తాత్రేయ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 02:27 AM