Share News

Sricity: శ్రీసిటీ గ్రామాల్లో సర్వే కలకలం

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:33 AM

సత్యవేడు మండల పరిధిలోని శ్రీసిటీ గ్రామాల్లో రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు చేపడుతున్న భూముల సర్వే కలకలం రేగుతోంది.

Sricity: శ్రీసిటీ గ్రామాల్లో  సర్వే కలకలం
కొల్లడంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు- అధికారులతో రైతుల వాగ్వాదం

సత్యవేడు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు మండల పరిధిలోని శ్రీసిటీ గ్రామాల్లో రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు చేపడుతున్న భూముల సర్వే కలకలం రేగుతోంది. శ్రీసిటీ పరిధిలోని కొల్లడం, ఇరుగుళం పంచాయతీలలో తహసీల్దార్‌ టీవీ సుబ్రమణ్యం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో సుమారు 15 మంది సర్వేయర్లు, వీఆర్వోల బృందం పోలీసు బందోబస్తు మధ్య గ్రామాల్లోని భూముల్లో అణువణువు సర్వే చేపట్టారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో సర్వే ఎందుకు చేస్తున్నారంటూ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూములనే నమ్ముకుని పంటలు పండించుకుని జీవనం గడుపుతున్న తమ భూములను శ్రీసిటీకి కట్టబెట్టేందుకే రెవెన్యూ అధికారులు ఉన్నపళంగా సర్వేలు చేపడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా 2008లో శ్రీసిటీ ఏర్పాటు కోసం మొదటి దశలో ఎనిమిది వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీ రైతుల ద్వారా సేకరించింది. ఇందులో కొల్లడం, ఇరుగుళం గ్రామాలలో కొంతమంది రైతులు భూములను ఏపీఐఐసీకి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈ గ్రామాల్లో అధికారుల బృందం సర్వే చేయడం చర్చనీయాశంగా మారింది. ఈ విషయమై తహసీల్దార్‌ సుబ్రమణ్యంను వివరణ కోరగా.. కొల్లడం, ఇరుగుళం గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న భూములకు, రికార్డుల్లో ఉన్న భూములకు వ్యత్యాసాలు ఉన్నాయని జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందడంతో జిల్లా రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు తాము సర్వేలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శ్రీసిటీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Oct 21 , 2024 | 01:33 AM