Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో దర్శనం కోసం కాసేపట్లో టికెట్ల విడుదల.. త్వరపడండి
ABN , Publish Date - Dec 24 , 2024 | 09:53 AM
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ..
జనవరిలో మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇప్పటికే అయిపోయాయి. సర్వ దర్శనం ఎలా జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారా.. వీఐపీ లెటర్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మార్చి వరకు అందుబాటులో లేవు.. బాలాజీ దర్శనం కోసం మరో మూడు నెలలు ఆగాల్సిందేననుకుంటున్నారా.. ఆ టెన్షన్ మీకు అవసరం లేదు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. జనవరి నెలకు సంబంధించి రూ.300 టికెట్లు సాధారణ రోజులకు సంబంధించినవి ఇప్పటికే విడుదల చేయగా మొత్తం బుక్ అయిపోయాయి. జనవరి 10 నుంచి 19వ తేదీకి సంబంధించిన టికెట్ల మాత్రం అక్టోబర్ నెలలో విడుదల చేయలేదు. ఈ పది రోజులకు సంబంధించిన టికెట్లను ఇవాళ ప్రత్యేకంగా విడుదల చేస్తోంది. జనవరి 10 నుంచి 19వ తేదీ మధ్య తిరుమల వెంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి అధిక రుసుము అవసరం లేదు. కేవలం రూ.300తో ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ ఇలా..
జనవరి 10 నుంచి 19వ తేదీల మధ్య వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ఈ లింక్ క్లిక్ చేసి లేటెస్ట్ అప్‌డేట్‌లో వైకుంఠ ద్వార దర్శనం కోసం రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ వద్ద క్లిక్ చేసి ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే టికెట్ల బుకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. జనవరి 10 నుంచి 19 వ తేదీ మధ్య మీరు దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీని క్లిక్ చేసి ఆ తేదీలో ఖాళీలు ఉంటే పేర్లు ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఒక లాగిన్ మీద ఆరుగురు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయి, చెల్లింపు చేసిన సమయానికి మీరు కోరుకున్న తేదీ, సమయంలో స్లాట్స్ ఖాళీగా ఉంటే దర్శనం టికెట్ బుక్ అవుతుంది.
వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతో డిమాండ్
ప్రతి ఏడాది తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. ఈ పదిరోజుల పాటు వీఐపీ దర్శనాలను తగ్గించడంతో పాటు ప్రజాప్రతినిధుల లెటర్లపై కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తారు. సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశం కల్పించడంతో పాటు.. సాధారణ భక్తుల తాకిడి ఎక్కువుగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే ఈ పదిరోజులు దర్శనానికి అనుమతిస్తారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here