Election: పల్లెల్లో ఎన్నికల సందడి
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:07 AM
వివిధ కారణాలతో రెండు సార్లు వాయిదా పడిన సాగునీటి సంఘాల ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
చిత్తూరు సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వివిధ కారణాలతో రెండు సార్లు వాయిదా పడిన సాగునీటి సంఘాల ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. జలవనరుల సంరక్షణకు గత టీడీపీ పాలనలో సాగునీటి సంఘాలుండేవి. వీటిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలవనరులకు పూర్వవైభవం రానుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలి సారి పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొననుంది. జిల్లాలో 220 సాగునీటి వినియోదారుల సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల జాబితా తయారీ నుంచి పోలింగ్ ప్రక్రియ దాకా 40 రోజుల్లో ముగించేలా జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి సారించారు. రైతు ప్రతినిధులు సభ్యులుగా ఉండే సాగునీటి వినియోగదారుల సంఘాలు 2003లో ఆవిర్భవించాయి.చివరిసారి 2015లో వీటికి ఎన్నికలు జరగ్గా 2020తో కాలపరిమితి ముగిసింది. ఆపై అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో చెరువులు, మీడియం ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది. చెరువులు, ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు పూర్తిగా ఆగిపోవడంతో వీటికి ప్రస్తుతం నీరు చేరే పరిస్థితి లేదు. ఈ కారణంగా వర్షాలు సమృద్ధిగా కురిసినా పంటల సాగుకు నీరందడంలేదు. ఈ క్రమంలో సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తామని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభించారు.