Share News

Ap Govt : డోలీ మోతలు ఆగాలి

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:29 AM

ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఆగిపోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌....

Ap Govt : డోలీ మోతలు ఆగాలి

  • గిరిజన ప్రాంతాల్లో మెరుగ్గా రోడ్ల కనెక్టివిటీ

  • రూ.48 కోట్లతో 9 రహదారుల నిర్మాణం

  • ఉపాధి పనులను ముమ్మరం చేయాలి

  • పీఆర్‌ అండ్‌ ఆర్డీపై సమీక్షలో చంద్రబాబు

  • ఏజెన్సీ ఏరియాల్లో రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చ

అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఆగిపోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశమై ఏజెన్సీ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిపై చర్చించారు. తగిన సదుపాయాలు లేని గిరిజన గ్రూపులు (పీవీటీజీలు) నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ కల్పించి, డోలీ మోతల ఇబ్బందులు లేకుండా చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. ముందుగా 20 గిరిజన నివాసిత ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు రూ.48.50 కోట్లతో తొమ్మిది రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు వినియోగించాలని సూచించారు.

మన్యం జిల్లాలో 6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 రోడ్ల కనెక్టివిటీ చేపట్టేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ నిధులు రావాలంటే వేతనాల పనులు విరివిగా కల్పించాలన్నారు. కూలీలకు పనులు కల్పించడం ద్వారా మెటీరియల్‌ నిధులు సమకూర్చుకుని గ్రామాల్లో భారీగా వసతులు కల్పించవచ్చని పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా పీఎంజీఎ్‌సవై, పీఎంజన్మాన్‌ తదితర పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజన ప్రాంతాల్లో రోడ్లను మెరుగుపర్చుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చడంతో పాటు 100 ఇళ్ల లోపు నివాసిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు వినియోగించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ, ఈఎన్‌సీ బాలూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 03:29 AM