Share News

CM Chandrababu Approves : మరో రూ.2,723 కోట్ల పనులు

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:53 AM

రాజధాని అమరావతిలో రూ.2,723 కోట్లతో ఎల్‌పీఎస్‌ జోన్‌-7, జోన్‌-10 లేఅవుట్ల రోడ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు కల్పించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.

CM Chandrababu Approves : మరో రూ.2,723 కోట్ల పనులు

  • రాజధానిలో జోన్‌ 7, 10 లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం.. సీఆర్డీఏ అథారిటీ ఆమోదం

  • 15లోపు పనులన్నిటికీ టెండర్లు

  • వెంటనే నిర్మాణ పనులు మొదలు

  • అమరావతి వ్యయం ప్రజలపై వేయం

  • భూముల అమ్మకం, సంపద సృష్టితో వచ్చే సొమ్ముతోనే అప్పులు తీరుస్తాం

  • రాజధానిపై వైసీపీకి ఇంకా కక్ష తీరలేదు

  • రుణమివ్వొద్దని ప్రపంచబ్యాంకుకు లేఖలు

  • మంత్రి పి.నారాయణ ఆగ్రహం

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో రూ.2,723 కోట్లతో ఎల్‌పీఎస్‌ జోన్‌-7, జోన్‌-10 లేఅవుట్ల రోడ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు కల్పించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాజధాని అభివృద్ధికి సంబంధించి రూ.47,288 కోట్ల విలువైన పనులకు ఆమోదముద్ర వేసినట్లయింది. సోమవారమిక్కడ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అథారిటీ 44వ సమావేశం జరిగింది. అమరావతి అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆ తర్వాత మీడియాకు తెలిపారు. మిగిలిన పనుల్లో మరి కొన్నింటికి ఈ నెలాఖరులోపు, ఇంకా మిగిలే పనులకు వచ్చే నెలలో ఆమోదం తీసుకుని.. వచ్చే నెల 15వ తేదీలోపు అన్ని పనులకూ టెండర్లు పిలుస్తామన్నారు. వెంటనే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధికి చేసే ఖర్చు భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా వేయబోమన్నారు. భూసమీకరణ ద్వారా రైతుల నుంచి సేకరించిన భూముల అమ్మకం, సంపద సృష్టితో వచ్చే సొమ్ముతోనే.. అమరావతి నిర్మాణానికి తీసుకునే రుణాలను తీర్చుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని.. దీనిపై ఎవరు విమర్శలు చేసినా ప్రజలు నమ్మవద్దని కోరారు. వైసీపీ నేతలకు ఇంకా అమరావతిపై కక్ష తీరనందునే సొంత పత్రికలో విష ప్రచారం సాగిస్తున్నారని, రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వొద్దని వరల్డ్‌ బ్యాంక్‌కు లేఖలు రాశారని మండిపడ్డారు. చరిత్రలో లేనంత వరద ఇటీవల వచ్చినా అమరావతికి ఇబ్బంది రాలేదని.. వరదలను తట్టుకునేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని తెలిపారు.


కేంద్ర సంస్థలను సమానంగా పంచాం

రాష్ట్రంలోని 26 జిల్లాల సమగ్రాభివృద్ధికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. పునర్విభజనలో ఏపీకి వచ్చిన కేంద్ర సంస్థలను అన్ని జిల్లాలకు సమానంగా కేటాయించామని చెప్పారు. విజయనగరం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ జిల్లాకు ఐఐఎం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ, కాకినాడలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, తాడేపల్లిగూడెంలో నిట్‌, మంగళగిరికి ఎయిమ్స్‌, విజయవాడలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, తిరుపతిలో ఐఐటీ, ఐజర్‌, కర్నూలులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌, అనంతపురానికి సెంట్రల్‌ యూనివర్సిటీ కేటాయించినట్లు చెప్పారు. విశాఖలో టీసీఎస్‌, గూగుల్‌తో పాటు గత ప్రభుత్వం తరిమేసిన లులూను మళ్లీ తీసుకొస్తున్నామని, కర్నూలులో 350 ఎకరాల్లో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని, రాయలసీమ జిల్లాల్లో మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోర్టులు అభివృద్ధి చేస్తామని, పోర్టు అభివృద్ధి అయ్యే ప్రతి చోటా అమరావతి తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా శాటిలైట్‌ సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

జూన్‌లోగా 1.18 లక్షల టిడ్కో గృహాల పూర్తి

వచ్చే ఏడాది జూన్‌ 12కల్లా 1.18 లక్షల టిడ్కో గృహాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని, నిరర్థకంగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి రూ.102 కోట్లు చెల్లించేందుకు సీఎం ఆమోదం తెలిపారని వెల్లడించారు. ‘గత ప్రభుత్వంలో టిడ్కో గృహాల వ్యవహారం గందరగోళంగా మారింది. లబ్ధిదారులకు మంజూరు చేసిన గృహాలపై వైసీపీ ప్రభుత్వం బ్యాంకు రుణాలు తీసుకుని, ఆ సొమ్మును దారి మళ్లించింది. ఈ సమస్య పరిష్కారానికి రూ.102 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు’ అని మంత్రి చెప్పారు.

Updated Date - Dec 24 , 2024 | 03:53 AM