Share News

CM Chandrababu Naidu : స్వచ్ఛ సైనికులుగా విద్యార్థులు

ABN , Publish Date - Dec 15 , 2024 | 06:13 AM

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థులను స్వచ్ఛ సైనికులుగా తయారు చేసే ఆలోచనలో ఉందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు.

CM Chandrababu Naidu : స్వచ్ఛ సైనికులుగా విద్యార్థులు

  • చెత్త నిర్వహణ అంశాలపై ప్రజలకు అవగాహన

  • స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థులను స్వచ్ఛ సైనికులుగా తయారు చేసే ఆలోచనలో ఉందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు. శనివారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఏపీఎ్‌సఐఆర్‌పీఆర్‌) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థీ పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించేలా అవగాహన కల్పించేందుకు వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. బాపట్ల, శ్రీకాళహస్తి, సామర్లకోటల్లోని విస్తరణ శిక్షణ కేంద్రాలను, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాలను భాగస్వాములను చేసి.. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి పౌరుడికీ శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 18, మూడో శనివారంలోగా చెత్త నిర్వహణపై మొదటి స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులకు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌లో పొందుపర్చిన పది సూత్రాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడానికి ప్రతి నెలా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ రోజుగా నిర్వహించాలని చెప్పారు. ఆ రోజు వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర చెత్త నిర్వహణ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పట్టాభి దిశానిర్దేశం చేశారు.

Updated Date - Dec 15 , 2024 | 06:13 AM