Share News

CM Chandrababu : ఏఐతో వైద్య సేవలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:57 AM

వైద్య సేవల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ)సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

CM Chandrababu : ఏఐతో వైద్య సేవలు

  • సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • ఏఐ వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

  • ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

  • 190 కొత్త 108 అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం

  • అంబులెన్స్‌ల సిబ్బందికి అదనంగా రూ.4 వేల అలవెన్సు

  • బీమా విధానంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ.. ప్రతి మండలంలో జనఔషధి

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైద్య సేవల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ)సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖను గాడిన పెట్టి, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో అందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రివెంటివ్‌ హెల్త్‌ కేర్‌పై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టాలని సూచించారు. వైద్యశాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. అనారోగ్య సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా, సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని సూచించారు. ప్రజల హెల్త్‌ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్‌కార్డు ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే విధంగా పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి.


ఎన్టీఆర్‌ వైద్యసేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల మేర హెల్త్‌ కవరేజ్‌ ఉంటుంది. ట్రస్ట్‌ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని సీఎం చెప్పారు. పబ్లిక్‌, ప్రైవేటు సెక్టార్‌లోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి మండలంలో జనఔషధి మందుల షాపులను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు

108 సర్వీసు సిబ్బందికి జీతంతో పాటు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం దీనిని రూ.2వేలకు కుదించిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించే మహాప్రస్థానం వాహనాల సంఖ్యను పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా సీఎం అంగీకరించారు. 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. దీనికి ఏడాదికి రూ.9.45కోట్లు అదనంగా ఖర్చు అవుతుందన్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్‌ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. బాధలో ఉన్న వారిని పీడించే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


కొత్త 108లు కొనుగోలుకు ఓకే

ప్రభుత్వాసుపత్రుల బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్‌ వైద్యసేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్యసేవలు అందించే విషయంపైనా సీఎం చర్చించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 సర్వీసులకు విడివిడిగా ఆపరేటర్లు ఉండేవారని, 2020 తర్వాత కాల్‌ సెంటర్‌తో కలిపి ముగ్గురు ఆపరేటర్లను ద్వారా సేవలు అందించారని గుర్తుచేశారు. మళ్లీ కొత్తగా టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో సింగిల్‌ ఆపరేటర్‌ ద్వారా మూడు సేవలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 108 అంబులెన్స్‌ల్లో 190 ఫిట్‌నెస్‌ కోల్పోయాయని, 2016లో కొనుగోలు చేసిన వీటిని అన్నింటినీ పూర్తిగా మార్చి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. వీటికోసం రూ.60కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గ్రామాల్లో వైద్యసేవలు అందించడంలో కీలకమైన 104 సర్వీసుల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం మండిపడ్డారు. 104 అంబులెన్స్‌లను బలోపేతం చేసేందుకు ల్యాబ్‌ టెక్నిషియన్‌తో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని తిరిగి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Dec 29 , 2024 | 03:57 AM