CM ChandraBabu: ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది
ABN , Publish Date - Dec 04 , 2024 | 03:15 PM
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్బంగా రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ వారు చేసిన వ్యాఖ్యపై సీఎం చంద్రబాబు సరదా సమాధానం ఇచ్చారు. అది మా ఇంటి హోం మంత్రి(భువనేశ్వరి) కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆయన చమత్కరించారు.
అమరావతి, నవంబర్ 04: కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని పెద్దలు రాయించుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం.. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవన్నారు. అయితే కొత్తగా వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుందని తెలిపారు. అవినీతి గురించి విన్నాం కానీ వ్యాపారాల్లో మెజార్టీ వాటాలను బలవంతంగా లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు.
నిస్సిగ్గుగా తుపాకీ చూపించి..
రాజకీయ నాయకత్వం అండతో నిస్సిగ్గుగా తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవటం మునుపెన్నడూ లేదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ముంబయిలో ఉందని.. దీనిపై సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు. ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి..!
ఇక కాకినాడ పోర్టు, సెజ్‌ల్లో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం భూ వివాదాల ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. అధికారులు పరిష్కారం చూపకుండా తమ సీటు నుంచి వేరొకరికి బదిలీ చేయటమే పరిష్కారం అనుకోవటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదు చేసిన వారికి పరిష్కారం లభించే అంశంపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని సాధ్యం కానివి.. కొన్ని కుటుంబ వివాదాలు సైతం ఉంటున్నాయని ఆయన వివరించారు.
రెవెన్యూ సదస్సుతో కొంత స్పష్టత..
కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకోలేక పోయినా అన్యాయం జరిగిన వారికి ఏ మేర న్యాయం చేయగలమో.. చూస్తున్నామన్నారు. ఇక 2019 అనంతరం న్యాయబద్ధంగా జరిగిన క్రయవిక్రయాలను తప్పు పట్టలేమని చెప్పారు. కానీ రికార్డులు కావాలని మార్చినవి పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. డిసెంబర్‌లో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రజల దగ్గర నుంచి ఊరికే కాగితాలు తీసుకోకుండా ఎలా పరిష్కారం చేయాలనే దానిపై కొంత మేథోమథనం జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలన్నదే..
అయితే కొంతమంది అధికారుల్లోనూ నిర్లక్ష్య వైఖరి వచ్చిందన్నారు. ఆ క్రమంలో కొన్ని శాఖలకు సరిహద్దులు మార్చేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో అర్థం కానీ పరిస్థితి తెచ్చారంటూ సీఎం చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారు. అందులోభాగంగా 22ఏ వంటి చిక్కుముడులు అనేకం ఉన్నాయన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలన్నదే తమ తపన అని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో రోజు వారి పరిపాలన చూసుకుంటూ ప్రజల హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు. ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూనే రోజు వారి కార్యక్రమాలూ చేసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై..
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై ఏం చేయాల్లో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి ఉందన్నారు. అన్ని వైపుల నుంచి ప్రజల కోణంలో ఏది మంచి అనేది బేరీజు వేస్తున్నామని తెలిపారు. ఇసుక లారీలో అధిక లోడు ఉన్నా రవాణా చేసేందుకు అనుమతులిచ్చామని చెప్పారు. రవాణా వాహనాలకు ఉచిత ఇసుక అనే బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకోవచ్చునన్నారు.
అది మా హోం మంత్రి, కుటుంబ సభ్యులు...
ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించేందుకు చాలా సమస్యలు పరిష్కరించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ మీడియా ప్రతినిధుల మాటలకు సీఎం చంద్రబాబు సరదా సమాధానం ఇచ్చారు. అది మా ఇంటి హోం మంత్రి(భువనేశ్వరి) కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆయన చమత్కరించారు. రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తున్నా..., ఇంటి నిర్మాణం వ్యవహారాలు మాత్రం కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని సీఎం చంద్రబాబు వివరించారు.
ధాన్యం కొనుగోళ్లు.. వాట్సప్ నెంబర్..
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు వాట్సప్ నెంబర్ అందుబాటులోకి తీసుకు వచ్చామని గుర్తు చేశారు. అందులో నెంబర్ రిజిస్టర్ చేయగానే ఐవీఆర్ఎస్ ద్వారా మెసేజ్ వెళ్తుందన్నారు. తద్వారా రైతు తాలుక ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిందో లేదో తనిఖీ చేస్తున్నామన్నారు. ఇటీవల తుఫాన్ సంభవించిన సమయంలో రైతుల మీద భారం పడకుండా రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించి.. ధాన్యాన్ని మిల్లులకు పంపిన విషయాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇంకా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తమ దృష్టికి వస్తే పరిశీలన జరిపి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాన్ని నిందించటం సహజంగా జరిగే ప్రక్రియేనని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం పరిష్కారాలు చూపిస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో గోను సంచుల కొరత అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు.
For AndhraPradesh News And Telugu News