CM Chandrababu : కబ్జా చేస్తే ఖబడ్దార్
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:30 AM
భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సెంటు భూమి కబ్జా చేసినా వారు జైలులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
సెంటు భూమి ఆక్రమించినా తాటతీస్తా
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా
కబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నీ ధ్వంసం
భూములపైనే మాకు అత్యధికంగా ఫిర్యాదులు
ధాన్యం విక్రయించిన 2గంటల్లోపే చెల్లింపులు
కృష్ణా జిల్లా ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో చంద్రబాబు భరోసా
‘‘మీ తాత,తండ్రుల కష్టార్జితం మీకే దక్కాలి. భూములు కబ్జాకు గురికాకుండా కొత్త చట్టం తెచ్చాం. భూకబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం. జాగ్రత్తగా ఉండాల్సిందే. గత ప్రభుత్వంలో తప్పుడు సర్వేలు జరిగాయని లక్షలమంది ఫిర్యాదు చేశారు. దానివల్ల సెంటు, రెండు సెంట్లు పోయాయని బాధితులు చెబుతున్నారు. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం’’
- ముఖ్యమంత్రి చంద్రబాబు
మచిలీపట్నం/గంగూరు (కంకిపాడు), డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సెంటు భూమి కబ్జా చేసినా వారు జైలులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ధాన్యం విక్రయించిన గంట, రెండు గంటల్లోనే బిల్లులు చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కృష్ణాజిల్లా ఈడుపుగల్లులో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులోను, పెనమలూరు మండలం గంగూరులో రైతులతో భేటీలోను ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం భూకబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘భూమి విషయంలో ప్రజలు సున్నితంగా ఆలోచిస్తారు. అయినా.. గత ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర కాకుండా జగన్ ఫొటో ముద్రించింది. సరిహద్దు రాళ్లపైనా ఆయన బొమ్మ వేశారు. మన భూమి పత్రాలపై ఆయన బొమ్మ ఏంటి? వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. వాటి పరిస్థితి చూస్తూ, నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోంది’’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ప్రశాంతంగా నవ్వుతూ జీవించే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ‘‘గత ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పాలుచేసిన ఘటనలపై నావద్దకు ఇప్పటివరకూ లక్షా యాభై ఏడువేల అర్జీలు వచ్చాయి. భూములపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూకబ్జాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. 22ఏ పేరుతో చాలామంది భూములు లాక్కున్నారు. బాధితులు కోల్పోయిన భూములన్నీ తిరిగి వారికి దక్కేలా చేస్తాం. హైదరాబాద్ మాదిరిగా కాకుండా మన రాష్ట్రంలో భూములకు స్పష్టమైన రికార్డులను బ్రిటిష్ పాలకులు తయారుచేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రికార్డులను తారుమారు చేసి ప్రజలను ఇబ్బందుల పాల్జేశారు’’ అని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.....
ఫిర్యాదు లేదంటే బాగా పనిచేసినట్టు!
‘‘రెవెన్యూ సదస్సుల్లో ఈ పది రోజుల్లోనే 95,263 దరఖాస్తులు వచ్చాయి. మూడు లక్షల మంది పాల్గొన్నారు. భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో తేడాలు పరిష్కరిస్తాం. వారసుల పేర్లు సరిగా ఉండేలా చూసి, అన్నీ సరిచేసే రైతుకు పట్టాదారు పాస్‌బుక్ ఇస్తాం. పాసుపుస్తకంపై క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో భూమి వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తాం. భూమికి సంబంధించిన ఫిర్యాదులు రాలేదంటే అధికారులు సక్రమంగా పనిచేసినట్టు! ఒకవేళ ఫిర్యాదుల పరిష్కారం కాకుంటే ఆ సమస్య పరిష్కారం కాలేదని స్పష్టంగా చెప్పాలి.. ఎలా పరిష్కరించాలో మార్గాలు అన్వేషించాలి’’
అన్నదాతను అగ్రస్థానంలో నిలుపుతాం: ‘ఎక్స్’లో సీఎం
‘‘మన బలం వ్యవసాయం. దాన్ని మరింత బలోపేతం చేస్తాం. అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఆధునిక వ్యవసాయాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించడం ద్వారా అన్నదాతను అగ్రస్థానంలో నిలుపుతాం. సాంకేతికతను చేరువ చేసి, రైతులకు సాగు ఖర్చులు తగ్గిస్తాం. గంగూరులో రైతులతో మాట్లాడాను. ధాన్యం సేకరణ విధానంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను. మరింత లబ్ధి చేకూర్చడానికి ఏం చేయాలనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకున్నాను. ఖరీ్‌ఫలోఇప్పటివరకు 19,90,945 టన్నుల ధాన్యసేకరించాం. 3 లక్షల మంది రైతులకు రూ.4,584 కోట్లను 48 గంటల్లోనే చెల్లించాం. మాది రైతు అనుకూల ప్రభుత్వం’’ అని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
చివరి సమస్య పరిష్కారమయ్యే వరకూ సదస్సులు కొనసాగుతాయి : అనగాని
భూసమస్యలు మొత్తం పరిష్కారమయ్యే వరకూ రెవెన్యూ సదస్సులు కొనసాగిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో భూములను ఆక్రమించుకుని దందాలు కొనసాగించారనీ, ఇటీవల ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులలో 65 శాతం రెవెన్యూ విభాగానికి సంబంధించినవేనన్నారు. 15 శాతం శాంతిభద్రతలకు సంబంధించినవన్నారు. కూటమి ప్రభుత్వం గతంలో రీ సర్వే జరిగిన భూములన్నింటినీ మళ్లీ సర్వే చేయిస్తుందనీ, ప్రతి అర్జీదారునికీ న్యాయం చేస్తామనీ, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.