Share News

Tirumala Laddu: కక్కుర్తితో కల్తీ!

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:20 AM

కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్‌ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?

Tirumala Laddu: కక్కుర్తితో కల్తీ!
Tirumala Laddu

  • నెయ్యి నాణ్యతతో అడ్డగోలుగా రాజీ

  • ధరల్లో శ్రీవైష్ణవి, ఏఆర్‌ డెయిరీ మాయ

  • కోట్‌ చేసిన ధరకంటే ‘రివర్స్‌’లో వందకుపైగా తగ్గింపు

  • ఇంకా తగ్గిస్తామంటూ ఎల్‌1గా మారిన ఏఆర్‌

  • మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నా ఇక్కడ తక్కువే

  • ఒక్కసారీ అనుమానించని నాటి టీటీడీ పెద్దలు

  • జూలై 6కు ముందు నెయ్యిని పరీక్షించనే లేదు

  • ఎన్‌డీడీబీ ల్యాబ్‌లో అసలు గుట్టు రట్టు

లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తినా గత వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం వ్యాపార వస్తువుగానే చూశారు. అందుకే... నెయ్యి నాణ్యతపై దృష్టిపెట్టలేదు. అధికారులు అప్పుడే నెయ్యిని పరీక్షకు పంపించి ఉంటే... కల్తీ విషయం బయటికి వచ్చేది. జూలై 6కు ముందు ఎప్పుడూ నెయ్యి శాంపిళ్లను పరీక్షలకు పంపించలేదు.

ఈ ఏడాది జూలైలో నెయ్యి శాంపిళ్లను ఎన్‌డీడీబీ ప్రయోగశాలకు పంపినప్పుడు కల్తీ గుట్టు రట్టయింది! అంతకుముందెప్పుడూ నెయ్యిని పరీక్షించలేదు. కాబట్టి.. అదంతా స్వచ్ఛమైనదే అని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే... ఇప్పుడూ, అంతకుముందూ శ్రీవైష్ణవి, ఏఆర్‌ డెయిరీల నుంచి నెయ్యి సరఫరా జరిగిన పద్ధతి (మోడస్‌ ఆపెరండీ) ఒక్కటే!

వైష్ణవి డెయిరీ, ఏఆర్‌ డెయిరీ ఎప్పటి నుంచో టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. భోలేబాబా డెయిరీ నుంచి కొన్న నెయ్యినే ఇవి తమ పేరుతో కొండకు పంపించాయి. మార్కెట్‌ ధరతో సంబంధం లేకుండా... ఇంకా చెప్పాలంటే, బయట ధర పెరిగేకొద్దీ ఇవి ధర తగ్గిస్తూ వచ్చాయి. కల్తీ చేయకుంటే ఇదెలా సాధ్యం?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్‌ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా? పరీక్షించకుండా వదిలేసినంత మాత్రాన... అదంతా స్వచ్ఛమైనది అవుతుందా? కానే కాదు! భోలేబాబా నుంచి శ్రీవైష్ణవి... శ్రీవైష్ణవి నుంచి ఏఆర్‌ డెయిరీ... ఏఆర్‌ డెయిరీ ద్వారా తిరుమలకు! ఇదీ నెయ్యి సరఫరా జరిగిన తీరు! శ్రీవైష్ణవి, ఏఆర్‌ డెయిరీ... రెండూ తిరుమలకు పంపాయి. శ్రీవైష్ణవి నుంచి కొని... ఏఆర్‌ డెయిరీ పేరుతో వచ్చిన నెయ్యిలో అడ్డగోలు కల్తీ రుజువైంది. వెరసి... కల్తీ మూలాలు వైష్ణవి డెయిరీకి విస్తరించాయని చెప్పక తప్పదు. అప్పటి టీటీడీ అధికారులు నెయ్యిని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపించి ఉంటే... లోగుట్టు అప్పుడే రట్టయ్యేది. కానీ... ‘ఏ కారణం’ చేతనో చూసీ చూడనట్లు వదిలేశారు.


  • టెండర్లలోనే తకరారు...

టీటీడీ అధికారులు 2023 అక్టోబరు 4వ తేదీన నెయ్యి కొనుగోలుకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ టెండర్లలో ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. అవి... కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌, ఇందాపూర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీ, ఎంఎం ఆగ్రో, ఏఆర్‌ డెయిరీ, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌! ఇందులో వైష్ణవీ డెయిరీ కేజీ నెయ్యికి రూ.535లు ధర కోట్‌ చేసింది. ఎంఎం ఆగ్రో సంస్థ రూ.510, ఏఆర్‌ డెయిరీ రూ.545, పరాగ్‌ మిల్క్‌ రూ.675, కర్ణాటక డెయిరీ రూ.615.34, ఇందాపూర్‌ డెయిరీ రూ.492లు చొప్పున కోట్‌ చేశాయి. రివర్స్‌ టెండర్లలో కిలోకు పది లేదా 20 రూపాయల ధర తగ్గితే ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ... టెండర్‌లో రూ.535 కోట్‌ చేసిన వైష్ణవీ డెయిరీ రివర్స్‌ టెండరింగ్‌లో ఒకేసారి రూ.428కు తగ్గించేసింది. ఎంఎం మిల్క్‌ కూడా అంతే.

రూ.510 నుంచి రూ.430 లకు ధరను తగ్గించింది. ఏఆర్‌ డెయిరీ రూ.545ల నుంచి రూ.432లకు దిగి వచ్చింది. ఈ మూడు కంపెనీలను టీటీడీ అధికారులు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3గా ఎంపిక చేశారు. మధ్యలో జరిగిన మతలబేమిటో తెలియదుకానీ... వైష్ణవీ డెయిరీ అంతటితో ఆగలేదు. రివర్స్‌ టెండర్‌లో రూ.428లు కోట్‌ చేసినప్పటికీ... రూ.408లకే కేజీ నెయ్యి సరఫరా చేస్తామని టీటీడీకి మెయిల్‌ చేసింది. దీంతో టీటీడీ అధికారులు వైష్ణవీ డెయిరీని ఎల్‌1గా ఎంపిక చేసి, నెయ్యి సరఫరాకు అనుమతిచ్చారు. ఆ సమయానికి టీటీడీ మరో సంస్థ నుంచి కిలో రూ.496 చొప్పున కొనుగోలు చేస్తోంది. అలాంటిది వైష్ణవీ డెయిరీ రూ.408లకే ఇస్తానని ముందుకొచ్చింది. ధరలో ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఎవరికైనా అనుమానం రావాలి. కానీ... టీటీడీ అధికారులు ఇదేమీ పట్టించుకోలేదు.


  • ఇంకా ఇంకా కిందికి...

వైష్ణవీ డెయిరీ ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో ధరను మరింత తగ్గించింది. టీటీడీకి కిలో నెయ్యి రూ.355లకే సరఫరా చేసింది. ఇక ఏఆర్‌ డెయిరీ కేవలం రూ.319లకే కేజీ నెయ్యి సరఫరా చేస్తామని టెండరు దక్కించుకుంది. ఒకవైపు బహిరంగ మార్కెట్‌లో నెయ్యి ధరలు అమాంతం పెరుగుతుంటే... టీటీడీకి సరఫరా చేసే వైష్ణవీ డెయిరీ, ఏఆర్‌ డెయిరీలు మాత్రం ఏటా రేటు తగ్గిస్తూ వస్తున్నాయి.

ఇది ఎలా సాధ్యం? స్వచ్ఛమైన నెయ్యిని ఆ ధరకు ఇవ్వగలరా? ‘నెయ్యి’ పేరుతో ఏం సరఫరా చేశారు? అందులో ఏమేం కలిపారు? అప్పటి టీటీడీ అధికారుల మెదళ్లలో ఇలాంటి ప్రశ్నలే తలెత్తలేదు. వైష్ణవి సంస్థ భోలేబాబా డెయిరీ వద్ద కొన్న ధరకంటే తక్కువకు ఏఆర్‌ డెయిరీకి నెయ్యి విక్రయించింది. తానూ తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసింది. అంటే... కల్తీ జరగడం నిజం! శాంపిళ్లు తీసి పరీక్షకు మాత్రం పంపలేదు.


  • టెక్నికల్‌ కమిటీ ఏం చేసింది?

నెయ్యి సరఫరాదారులు టెక్నికల్‌ బిడ్‌, ఫైనాన్షియల్‌ బిడ్‌లు దాఖలు చేయాలి. టెక్నికల్‌ బిడ్‌ల పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. బిడ్‌ ఓపెన్‌ చేయగానే ఆయా డెయిరీలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ మొత్తం పరిశీలిస్తారు. నేరుగా డెయిరీకి వెళ్లి... బిడ్‌లో పేర్కొన్న ఉత్పత్తి సామర్థ్యం, ఇతర సాంకేతిక అర్హతలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. టీటీడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో టెండర్లు ఆహ్వానించినప్పుడు డా.భాస్కరరెడ్డితో పాటు ఆరుగురు సభ్యులతో కూడిన టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సభ్యులు వైష్ణవీ డెయిరీని, ఏఆర్‌ డెయిరీని తనిఖీలు చేశారా? మరీ ముఖ్యంగా... ఏఆర్‌ డెయిరీ వైపు కన్నెత్తైనా చూశారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే... రూ.500 కోట్లు టర్నోవర్‌ ఉందని చెప్పుకొన్న ఏఆర్‌ డెయిరీ యాజమాన్యం, తమకు సొంత ట్యాంకర్లే లేనట్లు వైష్ణవి డెయిరీ ట్యాంకర్లనే వాడింది. వైష్ణవీ డెయిరీ, ఏఆర్‌ డెయిరీలు పోటీదారులు. సరఫరాలో మాత్రం ఒక్కటైపోయారు.


  • లడ్డూతో వ్యాపారం

తిరుమల పేరు చెబితే మొదట గుర్తుకు వచ్చేది... శ్రీవారి దివ్యమంగళ స్వరూపం! తర్వాత గుర్తుకొచ్చేది... ఘుమఘుమలాడే లడ్డూ ప్రసాదం! దాని నాణ్యత తగ్గుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానీ... ఏ దశలోనూ టీటీడీ అధికారులు దీనిపై స్పందించలేదు. శ్రీవారి లడ్డూకు రుచి, సువాసనకు కారణం... స్వచ్ఛమైన నెయ్యి! అలాంటి నెయ్యిలో నాణ్యత తగ్గడంతో లడ్డూ రుచి, నాణ్యత తగ్గిపోయాయి. వైష్ణవీ డెయిరీ, ఏఆర్‌ డెయిరీలు కిలో రూ.200లే కోట్‌ చేసినా... ‘అదే స్వచ్ఛమైన నెయ్యి’ అని తీసుకునే వారేమో!

  • వైసీపీ వితండవాదం

జగన్మోహన్‌ రెడ్డి సహా వైసీపీ నేతలు, ఆ పార్టీలో మేధావులుగా చెప్పుకొనే వారంతా... నెయ్యి కల్తీపై వింతడ వాదం చేస్తున్నారు. టీటీడీ అధికారులు శాంపిల్స్‌ తీసి, కల్తీగా నిర్ధారణ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు కాబట్టి, ఆ నెయ్యినే వాడలేదు కాబట్టి... లడ్డూలు అపవిత్రం కాలేదన్నది వారి వాదన! శ్రీవైష్ణవి, ఏఆర్‌ డెయిరీలు ఎప్పటి నుంచో తిరుమలకు నెయ్యి సరఫరా చేశాయి. అనేక అనుమానాలు, ఫిర్యాదుల నేపథ్యంలో తొలిసారిగా నాలుగు ట్యాంకుల నుంచి శాంపిళ్లు తీసి ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపించారు. ఆ నెయ్యి ఘోరంగా కల్తీ అయ్యిందని, ‘యానిమల్‌ ఫ్యాట్‌’ కలిసిందని నిర్ధారణ అయ్యింది. అంటే... అంతకుముందు సరఫరా చేసిన నెయ్యి స్వచ్ఛమైనదని కాదు! వైసీపీ పెద్దలు ఈ లాజిక్‌ను కూడా మరిచిపోయారు.

Updated Date - Oct 06 , 2024 | 09:48 AM