Share News

Happy Nest Project : చకచకా అమరావతి2.0

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:57 AM

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల మహాయజ్ఞానికి సీఆర్‌డీఏ శ్రీకారం చుడుతోంది.

Happy Nest Project : చకచకా అమరావతి2.0

  • నేటి నుంచి సంక్రాంతి వరకు టెండర్లే టెండర్లు

  • ఇక మహా యజ్ఞంలా రాజధాని పనులు

  • నిర్మాణాలకు ముందుకొచ్చిన 125 కేంద్ర సంస్థలు, ప్రైవేట్‌ వర్సిటీలు

  • ముందు వరుసలో ఆర్‌బీఐ.. బిట్స్‌ పిలానీ

  • నిర్మాణాలు ప్రారంభించనున్న ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ

విజయవాడ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల మహాయజ్ఞానికి సీఆర్‌డీఏ శ్రీకారం చుడుతోంది. రుణ సంస్థల నిధులతో చేపట్టే పనులను జనవరి మొదటి వారంలో ప్రారంభించనుండగా.. ఆ నిధులతో సంబంధం లేని ప్రాజెక్టుల పనులను ముందుగా మొదలుపెడుతోంది. అందులో భాగంగా అమరావతి హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆదివారం టెండర్లు పిలుస్తోంది. మొత్తం 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,200 ఫ్ల్లాట్లతో జీ ప్లస్‌ 18 అంతస్తులతో 12 టవర్లను రూ. 984.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ చేపడుతున్న మొట్టమొదటి టౌన్‌షిప్‌ ప్రాజెక్టు ఇది. నూరు శాతం సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టుగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. 720.5 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి విధ్వంసంలో ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ. 984.10 కోట్లకు పెరిగింది. అయితే భూమి ధర ఎకరాకు రూ. 4.1 కోట్ల చొప్పున 14.46 ఎకరాలకు రూ. 59.32 కోట్లు, ఇతర ఖర్చులు రూ. 37.76 కోట్లు కూడా కలిపితే మొత్తంగా రూ. 1,081.18 కోట్లకు చేరుతోంది. చదరపు అడుగుకు రూ. 4,049 చొప్పున ఫ్లాట్లను విక్రయిస్తే మొత్తం రూ. 845.89 కోట్ల ఆదాయం వస్తుంది. వైసీపీ ప్రభుత్వం విధ్వంసం కారణంగా ఈ ప్రాజెక్టు జాప్యం వల్ల రూ. 270.71 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టంలో రెరా కేసుల్లో విధించిన వడ్డీ రూ. 35.42 కోట్లు కూడా ఉంది. హ్యాపీనెస్ట్‌ తర్వాత వరుసగా రాజధానిలో భవన నిర్మాణ పనులు, ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులు, ట్రంక్‌ ఇన్ర్ఫా పనులు, జీఏడీ టవర్ల నిర్మాణ పనులు వంటి వాటికి టెండర్లను పిలవనుంది.


  • హ్యాపీనెస్ట్‌ మిగులు ఫ్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానం

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులో ఎంపిక చేసిన 1,200 మంది లబ్ధిదారుల్లో 100 మందికి పైగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసం కారణంగా చాలా మంది రెరాను ఆశ్రయించారు. వారికి వడ్డీతో సహా చెల్లించాలని రెరా ఆదేశించింది. దీంతో వడ్డీతో కలిపి కొందరు డబ్బులను తీసుకున్నారు. దీంతో మిగులు ఫ్లాట్లకు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించటానికి సీఆర్‌డీఏ శ్రీకారం చుడుతోంది. ముందు వచ్చిన వారికి ముందు అన్న ప్రాతిపదికన సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

  • మళ్లీ నాటి కళ..

సంక్రాంతి వరకు వరుసగా సీఆర్‌డీఏ టెండర్లను పిలవబోతోంది. ముందుగా సీఆర్‌డీఏ సొంత నిధులు, హడ్కో నిధులు, కేఎ్‌ఫడబ్ల్యూ నిధులతో చేపట్టే పనులకు, జనవరి మొదటి వారం నుంచి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో చేపట్టే పనులకు టెండర్లు పిలవనుంది. ఇక అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో కూడా ఆయా సంస్థలు పనులు చేపట్టనున్నాయి. సీఆర్‌డీఏ ఇప్పటి వరకు 130 కేంద్ర సంస్థలకు భూమి కేటాయించగా.. వాటి లో ప్రస్తుతం 125 సంస్థలు నిర్మాణ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చా యి. ఆర్‌బీఐ కూడా తన శాఖను త్వరలోనే అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు సీఆర్‌డీ ఏకు సమాచారం ఇచ్చింది. ఇక బిట్స్‌ పిలానీ కూడా తమకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన కేటాయించిన 35 ఎకరాల్లో పనులు ప్రారంభించటానికి సిద్ధమౌతోంది. అలాగే ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ కూడా అతి త్వరలోనే తమకు కేటాయించిన 50 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడుతున్నట్టుగా సీఆర్‌డీఏకు చెప్పింది. దీంతో అన్ని పనులు ఒకేసారి జరగటం ద్వారా అమరావతిలో మళ్లీ 2018 నాటి కళ కనిపించనుంది.

Updated Date - Dec 22 , 2024 | 07:40 AM